The Kitáb-i-Aqdas - Notes

1. నా వస్త్రపు సుమధురపరిమళము ¶4

ఖురాన్‌లోను, పాత నిబంధన గ్రంథంలోను గల జొసెఫ్ కథ దీనికి అన్వయం గావించ బడింది. అందులో జోసెఫ్ సోదరులు అతని వస్త్రాన్ని, తమ తండ్రి అయిన జేకబ్ వద్దకు తెచ్చినపుడు, అది అతనికి బహుకాలం క్రితం తప్పిపోయిన తన ప్రియసుతుని ఆనవాలు పట్టేందుకు ఉపకరించింది. భగవంతుని దివ్యావతారాన్నీ, ఆయన దివ్యావిష్కరణాన్నీ ప్రస్తావించేందుకు వీలుగా ఈ సుమధుర పరిమళ భరిత “వస్త్రోపమానము” బహాయి లేఖనాలలో తరచుగా ఉపయోగించబడింది. 

బహాఉల్లా తన ఫలకాలలో ఒక దానిలో అతి “తుచ్ఛమైన వెలకు అమ్మివేయ బడిన దివ్య జేకబ్‌” గా తనను అభివర్ణించుకున్నాడు. ఖయ్యాముల్- ఆస్మాలో , బహాఉల్లాను బాబ్ – “నిజమైన జోసెఫ్‌” గా గుర్తించాడు; విశ్వాసఘాతకుడైన తన సోదరుని చేతిలో బహాఉల్లా అనుభవించవలసిన కడగండ్ల గురించి ముందే భాష్యం చెప్పాడాయన. అదే విధంగా ఆబ్దుల్-బహా సర్వోత్కృష్టత, ఆయన సవతి సోదరుడైన మీర్జా ముహమ్మద్ అలీ (చూ. వివరణ 190) లో తీవ్రమైన అసూయను, భయంకరమైన మాత్సర్యాన్ని రేకెత్తించడానికీ, “జోసెఫ్ ఉత్కృష్టాధిక్యత అతడి సోదరుల హృదయాలలో తీవ్రమైన అసూయను రగిలింప చేయడానికీ” గల సాదృశ్యాన్ని షోఘీ ఎఫెండీ చూపించాడు.

2. శక్త్యధికారములనెడు యంగుళులచే దివ్యమదిరాభాండమును వివృత మొనరించినాము. ¶5
  
మదిరాసేవనం, మాదకద్రవ్యాల వినియోగము కితాబ్-ఎ-ఆఖ్దస్‌లో నిషేధించ బడినది. (చూ. వివరణలు 144, 170). 
 
మదిరా సేవన సంబంధమైన ప్రస్తావన, ఆధ్యాత్మిక పారవశ్యానికి దృష్టాంత భావనతో సూచించ బడినది. బహాఉల్లా దివ్యావిష్కరణంలోనే కాదు, బైబిల్ లోను, ఖురాన్‌లోను సనాతన హైందవ సాంప్రదాయాల లోను, ఇటువంటి దృష్టాంత సహిత వర్ణనలు అగుపిస్తాయి. 

ఉదాహరణకు: ఖురాన్‌లో - ధార్మికులు భద్రపరచబడిన “ఆభీష్ట మదిర” ఇవ్వబడతారని వాగ్దానం చేయబడింది. తన ఫలకాలలోని “కస్తూరీ పరిమళా”లను, “సమస్తజీవకోటిపై” గుబాళించిన తన దివ్యావిష్కరణమును – “ఆభీష్ట మదిర” గా బహాఉల్లా అభివర్ణించాడు. ఈ “మదిర”ను “వివృతం చేశా” నని ఆయన ప్రకటిస్తాడు. తద్వారా, ఇప్పటి వరకూ తెలియచేయబడని ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడి చేస్తున్నాడు. దివ్యమదిరను పానం చేసిన వారిని “దివ్యైక్యతా ప్రభలను కాంచుటకు” అంతే కాక, “భగవద్గ్రంథాలలో నిబిడీకృత మైన పరమార్ధాన్ని గ్రహించుటకు” సమర్ధులను గావిస్తాడు. 

తన ధ్యానఫలకాలలో ఒకదానిలో “అన్యమంతయు మరచి, నీ దైవధర్మ సేవకు ఉద్యుక్తులై నీ ప్రేమయందు దృఢచిత్తులై యుండునటుల” విశ్వాసులకు “నీ దయాభీష్ట మదిర” నొసంగుమని బహాఉల్లా భగవంతుని వేడుకొంటాడు.

3. అనివార్య ప్రార్థనను మీకు నిర్దేశించినాము. ¶6 

అరబ్బీ భాషలో ప్రార్థన అనే అర్థాన్నిచ్చే పలు పదాలున్నాయి. ఇక్కడ మూలంలో అగుపిస్తున్న “సలాత్‌” అనే పదం ఒక ప్రత్యేక విధమైన ప్రార్థనల వర్గాన్ని సూచిస్తుంది. వీటిని ప్రతిరోజూ నిర్ణీత సమయాల్లో ఆలపించడం విశ్వాసులకు నిర్దేశించబడింది. ఇతర ప్రార్థనల నుండి ప్రత్యేకంగా సూచింపబడేందుకు వీలుగా ఈ పదం “అనివార్య ప్రార్థన” గా భాషాంతరం గావించబడింది.

“భగవంతుని దృష్టియం దనివార్యప్రార్థనయును, ఉపవాస నియమములును ఉత్కృష్ట స్థానము నొందు” నని బహాఉల్లా వక్కాణిస్తున్నాడు. (చూ. ప్ర.-జ. 93) “భగవంతుని వంకకు మోమును నిల్పి ఆయన పట్ల తమ భక్తిని వ్యక్తము చేసుకొనుటకూ, వినయవిధేయతలకూ ఉపయుక్తము” లని, అంతేకాక, ఈ ప్రార్థనల ద్వారా “మానవుడు భగవంతునితో సంసర్గమునొంది, ఆయన సామీప్యము నర్థించి తన మనోవల్లభునితో సంభాషించి, ఆధ్యాత్మిక స్థానముల నందుకొను,” నని అబ్దుల్-బహా నొక్కి వచిస్తున్నాడు.
 
ఈ దివ్యప్రవచనంలో ప్రస్తావించబడిన అనివార్య ప్రార్థన (చూ. వివరణ 9) స్థానంలో మరో మూడు అనివార్య ప్రార్థనలు బహాఉల్లాచే వెలువరించబడినాయి. [చూ. ప్ర.-జ. (ప్రశ్నలు – జవాబులు) 63]. ప్రస్తుతం వినియోగంలో వున్న ఈ మూడు ప్రార్థనల మూలపాఠాలను, వాటి ఆలాపనకు సంబంధించిన నియమాలను ఈ సంపుటంలో ‘కితాబ్-ఇ-అఖ్దస్‌కు అనుబంధంగా బహాఉల్లా వెలువరిం చిన కొన్ని మూల గ్రంథముల’ లో చూడవచ్చు.

ప్రశ్నలు - జవాబులలో అనేకం ఈ నూతన అనివార్య ప్రార్థనాత్రయం గురించి వివరిస్తాయి. ఈ మూడు ప్రార్థనలలో నుండి ఏ ఒక్కదానినైనా యెంచుకోవడానికి వ్యక్తి అనుమతింపబడ్డాడని బహాఉల్లా వచిస్తున్నాడు. (చూ. ప్ర.-జ. 65). ఇందుకు సంబంధించిన ఇతర నియమాలకై 66, 67, 81, 82 సంఖ్యలు గల ప్రశ్నోత్తరాలను చూడవచ్చు. 

 అనివార్య ప్రార్థనలకు సంబంధించిన శాసన వివరణలు, ‘కితాబ్-ఎ-అఖ్దస్ శాసనాదేశముల సారసంగ్రహము – క్రోడీకరణము’ లో పరిచ్ఛేదము 4. అ. 1-17 లో సంక్షిప్తం గావించబడినాయి.

4. తొమ్మిది ‘రకాహ్’ లు ¶6  
 
విశేషించి వెలువరించబడిన దివ్యప్రవచనాలను నిర్దేశిత దండప్రమాణ విధానాల ననుసరిస్తూ ఆలపించడాన్నే ‘రకాహ్’ అని వ్యవహరిస్తారు.
 
బహాఉల్లా తన అనుయాయులకు ప్రధానంగా తొమ్మిది ‘రకాహ్ లు కలిగిన అనివార్య ప్రార్థనను నిర్దేశించాడు. ఈ ప్రార్థన కనిపించకుండా పోయిన  కారణంగా దీని సూక్ష్మ స్వభావం కాని, దీనిని ఆలపించడానికి నిర్దేశింపబడిన ప్రత్యేక సూచనలు కాని తెలియరాలేదు. (చూ. వివరణ 9)

ప్రస్తుతం ఆదేశించబడిన అనివార్యప్రార్థనలపై వాఖ్యానిస్తూ అబ్దుల్-బహా ఒకానొక ఫలకంలో యిలా సూచించాడు: “అనివార్య ప్రార్థన యందలి ప్రతి పదములో, చలనములో మానవుని అవగాహనకు అందనివీ, లేఖలయందున, స్మృతులందున కానరానట్టి దృష్టాంతములు, మర్మ వివేకము లున్నవి.”

కొన్ని ప్రార్థనలను ఆలపించడం కోసం బహాఉల్లా ప్రసాదించిన నిర్దేశాలు కేవలం ఆధ్యాత్మిక భావగర్భితాలే కాక, వ్యక్తికి “ప్రార్థన, ధ్యానములలో పూర్తి ఏకాగ్రతను వహించుట” కుపకరిస్తాయని షోఘి ఎఫెండీ వివరిస్తున్నాడు.

5. ఉదయ, మాధ్యాహ్నిక, సాయంకాలములయందున ¶6  

ప్రస్తుత కాలంలో మధ్యమ అనివార్య ప్రార్థనలను ఆచరించ వలసిన “ఉదయ”, “మధ్యాహ్న”, “సాయంకాలము” లను నిర్వచిస్తూ, వాటిని “సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమ,” యాలతో అనుసంధించాడు బహాఉల్లా. (చూ. ప్ర.-జ. 83) “అనివార్య ప్రార్థన నాలపించుటకు అనుమతింపదగు సమయాలు ఉదయం మొదలు మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం మొదలు సూర్యాస్తమయం వరకు, సూర్యాస్తమయం తదుపరి రెండు గంటల కాలం వరకు” అని స్పష్టీకరించా డాయన. అదే విధంగా ఉదయ అనివార్య ప్రార్థనను ఉషోదయానికి ముందే చేయాలని అబ్దుల్-బహా ప్రకటించాడు. 

“మధ్యాహ్నం మొదలు సూర్యాస్తమయం” వరకు గల సమయాన్ని “మధ్యాహ్నం”గా నిర్వచిం చడం జరిగింది. ఇది లఘు, మధ్యమ అనివార్య ప్రార్థనలను చేసే విషయంలో అనువర్తిస్తుంది.

6. అసంఖ్యాక ప్రార్థనల నుండి మిమ్ము విముక్తుల నొనరించినాము. ¶6

కితాబ్-ఎ-అఖ్దస్‌లో నిర్దేశించబడిన తొమ్మిది ‘రకాహ్’ లు గల అనివార్య ప్రార్ధనను చేయవలసిన పర్యాయాలకన్న బాబీ, ఇస్లాం మతాలలో అనివార్య ప్రార్థనను చేయవలసిన పర్యాయాలు అనేకం; అవశ్యం. (చూ. వివరణ 4)

బయాన్‌లో పంధొమ్మిది ‘రకాహ్’ లు గల అనివార్య ప్రార్థన నొకదానిని బాబ్ నిర్దేశించాడు. దానిని ఇరవై నాలుగు గంటలకొక పర్యాయం - అంటే ఒక మధ్యాహ్నానికీ మరునాటి మధ్యాహ్నానికీ మధ్య గల సమయంలో - చేయాలి.
 
ముస్లిం ప్రార్థన రోజుకు ఐదు పర్యాయాలు - ప్రాతః కాలం, మధ్యాహ్నం, అపరాహ్నం, సాయంకాలం, రాత్రి వేళలలో - ఆలపించబడుతుంది. అర్పించే ‘రకాహ్’ ల సంఖ్య, ఆలపించే కాలాన్ని బట్టి ఉంటుంది. రోజులో - మొత్తం పదిహేడు ‘రకాహ్’ లు అర్పించబడతాయి.

7. మీరీ ప్రార్థన చేయనెంచినప్పుడు . . . అమరపురజనుల కారాధనా కేంద్రముగ భగవన్నిర్దేశిత మైనదియును, . . . అగు ఈ పునీత స్థానము దెసకు, నా పరమ పవిత్ర ప్రత్యక్షతా స్థానము వంకకు అభిముఖులు కండు. ¶6

“ఆరాధనా కేంద్రము” అంటే అనివార్య ప్రార్ధన చేసేటప్పుడు ఆరాధకుడు అభిముఖుడు కావలసిన బిందువు. దీనిని ఖిబ్లేహ్ అని అంటారు. ఈ ఖిబ్లేహ్ భావన పూర్వపు మతాలలో కూడా ఉంది. గతంలో జెరూసలెమ్ ఆరాధనా బిందువుగా నిర్ధారితమైంది. మహమ్మదు ఈ ఖిబ్లేహ్ ను మక్కాకు మార్చాడు. అరబ్బీ బయాన్‌లో బాబ్ యిలా సూచించాడు : 

“దేవుడు ప్రత్యక్షీకరించునతడే”యదార్ధమైన ‘ఖిబ్లేహ్’ ; ఆయన విశ్రమించునంత వరకు అది ఆయన గమనముననుసరించి చరించును.”

ఈ గ్రంథభాగాన్ని బహాఉల్లా కితాబ్-ఎ-అఖ్దస్‌లో ఉటంకించి, (¶137) పై దివ్యప్రవచనంలో ధృవీకరించాడు. ఖిబ్లేహ్ - దిశగా అభిముఖమవడం “అనివార్య ప్రార్థన పఠనకు నిశ్చయించిన విధాన” మని కూడా ఆయన సూచించాడు. (చూ. ప్ర.-జ. 14, 67). అయితే ఇతర ప్రార్థనలు, ఆరాధనల విషయంలో వ్యక్తులు ఏవైపునకైనా తిరగవచ్చు.

8. దివ్యసత్య, దివ్యోచ్చారణా సూర్యుడస్తమించినపుడు, మేము మీకై నిర్దేశించినయట్టి దివ్యస్థలి వైపు నకు మీ వదనములను సారింపుడు. ¶6

తాను పరమపదించిన తదుపరి తన విశ్రామస్థానాన్ని ఖిబ్లేహ్ గా బహాఉల్లా నిర్దేశించాడు. పరమ పవిత్ర సమాధి అక్కాలోని బహ్‌జీ వద్ద ఉంది. ఈ క్షేత్రాన్ని “తేజోమయ పుణ్యక్షేత్రము” గాను, “ఊర్ధ్వలోక దైవ సమూహములు ప్రదక్షిణమొనరించు ప్రదేశము” గాను అబ్దుల్-బహా అభివర్ణించాడు.
 
షోఘీ ఎఫెండీ తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో, ఖిబ్లేహ్ వైపుకు అభిముఖం కావడానికి గల ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు, మొక్క సూర్యుడి వంకకు తిరగడానికి గల ప్రాముఖ్యతకు గల సాదృశ్యాన్ని ఇలా వివరిస్తాడు. :

... జీవానికీ, ఎదుగుదలకూ అవసరమైన సూర్యరశ్మికై ఏ విధంగా ఒక మొక్క పరితపిస్తుందో, ప్రార్థించేటప్పుడు మనం మన హృదయాలను భగవంతుని దివ్యావతారమూర్తి బహాఉల్లా వంకకు అలా మరల్చుతాము; ... అంతఃకరణానికి చిహ్నంగా ఈ భూమిపై ఆయన దేహధూళి విశ్రమించియున్న దిశకు ... మన ముఖాలను మరల్చుతాము.

9. అనివార్య ప్రార్థనా వివరాలను మేమింకొక దివ్యఫలకమునందు వెల్లడించినాము. ¶8
 
మౌలికమైన అనివార్య ప్రార్థన, “వివేక హేతువు”గా, బహాఉల్లాచే ఒక ప్రత్యేక ఫలకంలో వెలువరించ బడినది. (చూ. ప్ర.-జ. 68) దీని స్థానంలో ప్రస్తుతం అమలులో ఉన్న మూడు అనివార్య ప్రార్థనలు వెలువరించబడటం వల్ల, ఆయన జీవితకాలంలో ఈ ప్రార్థన విశ్వాసులకు అందజేయబడలేదు.

బహాఉల్లా స్వర్గారోహణానంతరం కొద్ది కాలానికే, ఈ ప్రార్థనా పాఠాన్నీ, మరికొన్ని యితర ఫలకాలనూ - ఆయన ఒడంబడికను ఉల్లంఘించిన మహమ్మద్ అలీ తస్కరించాడు.

10. దివంగతుల కొరకైన ప్రార్థన. ¶8

దివంగతులకై నిర్దేశించిన ప్రార్థన (చూ. కితాబ్-ఇ-అఖ్దస్‌కు అనుబంధంగా బహాఉల్లా వెలువ రించిన కొన్ని మూల గ్రంథములు) మాత్రమే సామూహికంగా ఆలపించవలసిన ఏకైక అనివార్య ప్రార్థన. దీనిని ఒక విశ్వాసి పఠిస్తుండగా, అక్కడ చేరినవారు మౌనంగా నిలబడాలి (చూ. వివరణ 19). మృతులకై చేసే ఈ ప్రార్థన, మృతుడు వయోజనుడైతేనే అవసరమనీ (చూ. ప్రశ్నోత్తరాలు 70), మృతుని ఖననం చేయడానికి ముందే ఈ ప్రార్థన నాలపించాలని, ఖిబ్లేహ్ వైపుకు అభిముఖం కానవసరం లేదని (చూ. ప్ర.-జ. 85) బహాఉల్లా విశదీకరించాడు. 

మృతులకై చేయవలసిన ప్రార్థన గురించిన మిగతా వివరాలు సారసంగ్రహము - క్రోడీకరణములో పరిచ్ఛేదము 4. అ. 13-14 లో సంక్షిప్త పరచబడినాయి.

11. ఆరు నిర్దిష్ట గ్రంథభాగములు దివ్యప్రవచనావిష్కర్తయగు భగవంతునిచే ననుగ్రహింపబడినవి. ¶8

మృతులకై చేసే ప్రార్థనలో భాగమైన ఈ గ్రంథభాగాలతో పాటు, ఆరు పర్యాయాలు అల్లా ‘హో’ ఆభా (భగవంతుడు సకల మహిమాన్వితుడు) నామ పునరుచ్చారణను కూడా నిర్దేశించడమైనది. ప్రతి అల్లా ‘హో’ ఆభా నామోచ్చారణతో పాటుగా, ప్రత్యేకించి వెలువరించబడిన గ్రంథభాగాలను పంధొమ్మిది సార్లు పునరుచ్చరించాలి. ఈ దివ్యప్రవచనాలు మృతులకై బయాన్‌లో బాబ్ వెలువరించిన ప్రార్థనలోని ప్రవచనాలను పోలిఉన్నాయి. బహాఉల్లా ఒక నివేదనను ఈ ప్రవచనాలకు ముందు జోడించాడు.

12. కేశములైనను, జీవరహితములగు నస్తికలవంటివైనను నీ ప్రార్థనను భంగము గావింపనేరవు. బీవరు, ఉడుత, యింకను యితర జంతువుల యున్నిని మీరు ధరియింపవచ్చును. ¶9

పూర్వపు మతధర్మాలు కొన్నింటిలో వ్యక్తి - కొన్ని జంతువుల రోమాలను, ఇతర వస్తువులను ధరించి చేసే ప్రార్థన నిష్ఫలమని నిర్ణయించబడింది. అటువంటి వస్తువులేవీ ప్రార్థనను నిష్ఫలం గావించలేవని అరబ్బీ బయాన్‌లో బాబ్ చేసిన తీర్మానాన్ని, బహాఉల్లా ఆమోదించాడు.

13. యుక్తవయస్సారంభమైననాటినుండి ప్రార్థన చేయుమని, ఉపవసింపుమని మేము నిన్నాదేశించి నాము. ¶10 

“మతవిధుల నిర్వహణకు యుక్త వయస్సు” “స్త్రీ పురుషు లిరువురికిని పదునైదేండ్లు” గా బహాఉల్లా నిర్వచించాడు (చూ. ప్ర.-జ. 20). ఉపవాసకాల వివరాలకై , చూ. వివరణ 25.

14. అనారోగ్యము లేక వృద్ధాప్యముచే దుర్బలులైన వారిని ‘ఆయన’ . . . దీనినుండి మినహాయించినాడు. ¶10

అనారోగ్యకారణంగా బలహీనులైన వారు, వయోవృద్ధులు అనివార్య ప్రార్థన చేయడం నుండి, ఉపవాస నియమాలను పాటించడం నుండి పొందిన మినహాయింపు గురించి ప్రశ్నలు -జవాబులలో వివరించబడింది. “అనారోగ్యస్థితియం దీవిధులను నిర్వర్తింప ననుమతిలే” దని బహాఉల్లా సూచించాడు. (చూ. ప్ర.-జ. 93). వృద్ధ్యాప్యమంటే డెబ్భై ఏండ్ల నుండి అని ఆయన నిర్వచించాడు (చూ. ప్ర.-జ. 74). డెబ్భై సంవత్సరాల వయసు గలవారు బలహీనులైనా, కాకపోయినా ఈ విధుల నుండి మినహాయింప బడ్డారని షోఘి ఎఫెండీ విశదీకరించాడు. 

ఉపవాసం నుండి మినహాయింపు కొన్ని ఇతర విశేష వర్గాలకు చెందిన వారికి కూడా ఇవ్వ బడింది. వారి జాబితా సారసంగ్రహము - క్రోడీకరణము లో పరిచ్ఛేదము 4. ఆ. 5లో ఇవ్వబడింది. అదనపు వివరాలకై చూ. వివరణలు 20, 30, 31.

15. పరిశుభ్ర స్థానమెందైనను సాష్టాంగప్రణామము నొనర్చుటకు భగవంతుడు మీ కనుమతి నను గ్రహించినాడు, ఏలయన ఇందుకు సంబంధించి దివ్యగ్రంథమునం దేర్పరుపబడిన నియమమును మేము తొలగించినాము. ¶10

పూర్వపు మత ధర్మాలలో సాష్టాంగ ప్రణామం ప్రార్థనలో ఒక భాగంగా చేర్చబడింది. తమ ఫాలభాగాన్ని పరిశుభ్రమైన భూ ఉపరితలాన్ని తాకేలా సాష్టాంగ ప్రణామం చేయమని అరబ్బీ బయాన్‌లో బాబ్ విశ్వాసులను ఆదేశించాడు. అదే విధంగా ఇస్లాంలో, సాష్టాంగ ప్రణామం చేయవలసిన ఉపరితలం గురించి మహమ్మదీయులకు కొన్ని పరిమితులు విధించబడ్డాయి. బహాఉల్లా ఈ పరిమితులను రద్దుచేసి “పరిశుభ్ర స్థాన మెందైనను” అని సరళీకృతం గావించాడు.

16. శుద్ధీకరణకు జలము అలభ్యమైన యాతడు “పరమ పావనుడగు, పరమ పావనుడగు భగవంతుని దివ్యనామము పేరిట” యను  పదముల నైదు పర్యాయములు పలికి, ఆపై తన ప్రార్థనాదికముల కుపక్రమింపవలె. ¶10

అనివార్య ప్రార్థన సమర్పణకు సంసిద్ధుడయ్యేటందుకై, విశ్వాసి శుద్ధీకరణలను చేసుకోవలసి ఉంటుంది. ఇందులో చేతులను, ముఖాన్ని ప్రక్షాళనం చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ నీరు లభ్యం కాని పక్షంలో ప్రత్యేకంగా వెలువరించబడి, నిర్దేశించబడిన దివ్యప్రవచనాలను ఐదు పర్యాయాలు ఉచ్చరించాలి. శుద్ధీకరణలకు సంబంధించిన సాధారణ వివరాలకై చూ. వివరణ 34. నీరు అలభ్యమైనప్పుడు అవలంబించవలసిన ప్రత్యామ్నాయ విధానాలకు సంబంధించి పూర్వపు మతధర్మాలలో గల ఏర్పాట్లను ఖురాన్ లోను, అరబ్బీ బయాన్‌లోను చూడవచ్చు.

17. దివారాత్రముల యవధి సుదీర్ఘముగ నుండు ప్రదేశములయందున గడియారములు లేదా కాల గమనము నెరుకపరచు సాధనముల వలన ప్రార్థనా సమయములు తెలిసికొనబడు గాక. ¶10

ఇది రాత్రికీ, పగలుకూ కాలపరిమితిలో సుదీర్ఘ వ్యత్యాసాలు ఉండే ఉత్తర, దక్షిణ ధృవ ప్రాంతా లకు సంబంధించిన అంశం. ఈ ఏర్పాటు ఉపవాస నియమావలంబనకు కూడా వర్తిస్తుంది. (చూ. ప్ర.-జ. 64, 103)

18. సంకేత ప్రార్థన గావించవలసిన యావశ్యకత నుండి మిమ్ములను విముక్తుల నొనరించినాము. ¶11

భూకంపాలు, గ్రహణాలు, భయాందోళనలను కలిగించే అసాధారణ వైపరీత్యాలు దైవ సంకేతాలుగా భావించబడతాయి. అటువంటివి సంభవించినప్పుడు పఠించేందుకై ప్రత్యేకించి మహ్మదీయు లకు సంకేత అనివార్య ప్రార్థన వెలువరించబడినది. ఈ ప్రార్థనను చేయవలసిన ఆవశ్యకత రద్దుచేయ బడినది. దీని స్థానంలో “గోచరా గోచరముల కధిపతియును, సృష్టికర్తయును అగు దేవదేవునిదే సామ్రాజ్య” మని బహాయి పలకవచ్చు. అయితే, ఇది అనివార్యం కాదు. (చూ. ప్ర.-జ. 52).

19. దివంగతులకు నిర్దేశితమైన ప్రార్థనయందు తప్ప సామూహిక ప్రార్థనాచారము తొలగింపబడినది. ¶12

ఉదాహరణకు, ఇస్లాంలో ఆచారంగా మసీదులో ఇమామ్ చే నిర్వహించబడే నిర్ణీత ఆచారనియమంతో పఠించవలసిన శుక్రవారం నాటి సామూహిక ప్రార్థ్థన బహాయి దివ్యధర్మములో రద్దుపరచబడింది. కేవలం మృతుని కొరకై విధించిన ప్రార్థన (చూ. వివరణ 10) మాత్రమే - బహాయి శాసనం నిర్దేశించిన సామూహిక ప్రార్థన. దీనిని అక్కడ సమావేశమైన వారిలో ఒకరు ఆలపిస్తుండగా మిగిలినవారు మౌనంగా నిలబడి ఉంటారు. ఆలపించే వ్యక్తికి ప్రత్యేక హోదా ఏమీ ఉండదు. సమావేశమైన వారు ఖిబ్లేహ్ కు అభిముఖులు కావడం అవసరమేమీ కాదు. (చూ. ప్ర.-జ. 85)

దైనందిన అనివార్య ప్రార్థనాత్రయాన్ని, సామూహికంగా కాక, వ్యక్తిగతంగా ఆలపించాలి. 

అనివార్యం కాని ఇతర బహాయి ప్రార్థనాలాపనల నిమిత్తం - ప్రత్యేకించి విధివిధానాలేమీ నిర్దేశించబడి లేవు. అటువంటి ప్రార్థనలను వ్యక్తిగతంగా గాని, సమావేశాలలో గాని, తమకు అనువైన రీతిలో చేసే స్వేచ్ఛ అందరికీ ఉంది. షోఘి ఎఫెండీ ఈ విషయంలో ఇలా అంటాడు:

... మిత్రులు తమ యిష్టానుసారం అనుసరించ వీలున్నప్పటికీ, ఏ విధంగానూ వారి ఆచరణకు అతి కఠినమైన లక్షణమును ఆపాదింపజేసి, ఒక స్థిరవ్యవస్థగా రూపుదాల్చకుండా అత్యంత జాగ్రత్తను వహించాలి. సుస్పష్టంగా సూచించబడిన దివ్యబోధనల నుండి వీడి పోకుండుటకు మిత్రులు ఈ విషయాన్ని సదా తమ మేధ యందుంచుకోవాలి.

20. బహిష్టైన మహిళలను - అనివార్య ప్రార్థనను, ఉపవాసములను చేయుట నుండి భగవంతుడు మినహాయించినాడు. ¶13

బహిష్టైన స్త్రీలు అనివార్య ప్రార్థన చేయడం నుండి, ఉపవాస నియమపాలన నుండి మినహాయించ బడ్డారు. వారందుకు బదులుగా, శుద్ధీకరణాన్ని ఆచరించి (చూ. వివరణ 34), నాటి మధ్యాహ్నానికి మరుసటి మధ్యాహ్నానికి మధ్యకాలంలో, “దేవుడు మహిమాన్వితుడు, శోభాసౌందర్యాల విభుడు” అనే దివ్యప్రవచనాన్ని 95 పర్యాయాలు ఉచ్చరించాలి. ఇందుకు సంబంధించి అరబ్బీ బయాన్‌లోను ఇటువంటి అవకాశమే కల్పించబడింది. 

పూర్వం, కొన్ని మత ధర్మాలలో, బహిష్టైన స్త్రీలు మతాచార కర్మలకు అపవిత్రులుగా పరిగణింపబడి ప్రార్థన, ఉపవాస విధులను ఆచరించటం నుండి నిషేధించబడ్డారు. ఆచారకర్మలకు అపవిత్రులు అనే భావనను బహాఉల్లా రద్దు చేశాడు (చూ. వివరణ 106 )

కితాబ్-ఎ-అఖ్దస్‌లో కొన్ని విధులు, బాధ్యతల నుండి మినహాయింపు యివ్వబడిన విషయమై వివరణ యిస్తూ, ఆ మాట మినహాయింపునే సూచిస్తుంది కాని, నిషేధం కాదని విశ్వన్యాయ మందిరము వారు విశదీకరించారు. అందుకే, ఏ విశ్వాసి ఐనా కావాలనుకుంటే, తనకు అనువర్తించే మినహాయింపును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. అయితే, ఆ మినహాయింపును పాటించటమా, మానడమా అన్న విషయాన్ని నిర్ణయించుకునేటప్పుడు బహాఉల్లా ఆయా మినహాయింపులను సహేతుకంగానే ప్రసాదించాడని విశ్వాసి తన వివేకాన్ని ఉపయోగించి గ్రహించాలి.

మౌలికంగా తొమ్మిది రకాహ్ లు గల్గిన అనివార్య ప్రార్థనకు సంబంధించిన ఈ నిర్దేశిత మినహాయింపు - ప్రస్తుతం, ఆ ప్రార్థన స్థానంలో వెలువరించబడిన అనివార్య ప్రార్థనాత్రయానికి వర్తిస్తుంది.

21. ప్రయాణము చేయునపుడు, ఏదేని సురక్షితప్రదేశమందు ఆగి విశ్రమింపవలసివచ్చెనేని, మీరు - స్త్రీ పురుషులొకే విధముగ - చేయలేక పోయిన ప్రతి అనివార్య ప్రార్థన స్థానము నందొక్క సాష్టాంగ ప్రణామము నాచరింపవలె. ¶14

అభద్రతా పరిస్థితుల్లో అనివార్య ప్రార్థ్ధనాలాపన దుర్లభమనిపించినపుడు, అటువంటి వారు అనివార్య ప్రార్థనను చేయడం నుండి మినహాయించబడ్డారు. వ్యక్తి ప్రయాణంలో ఉన్నా, ఇంటివద్ద ఉన్నా ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే ఈ అభద్రతా పరిస్థితుల కారణంగా పఠించబడని అనివార్య ప్రార్థనలకు పరిహారం చేయడానికి ఈ మినహాయింపు అవకాశాన్నిస్తుంది. 
 
ఎవరైనా అనివార్య ప్రార్థన చేయడానికి “సురక్షిత ప్రదేశము” కనుగొనబడేటంత వరకూ దీనిని “మానవలసిన అవసరము లే” దని బహాఉల్లా స్పష్టం చేశాడు. (చూ. ప్ర.-జ. 58)

ప్రశ్నలు - జవాబులలో 21, 58, 59, 60, 61 సంఖ్యలు గలవి ఈ నిబంధనలను సవిస్తరంగా వివరిస్తాయి.

22. మీ సాష్టాంగ ప్రణామముల యనంతరము . . . నర్ధపద్మాసనా సీనులై ¶14

“హేయ్కాలుత్-తవ్హీద్‌” అనే అరబ్బీ పారిభాషికపదం ఇక్కడ “అర్ధ పద్మాసన” మని (అంటే ‘ఐక్యభంగిమ’ అనే అర్థంలో) అనువదించబడింది. అర్థపద్మాసనం సంప్రదాయ విధానాన్ని సూచిస్తుంది.

23. భగవంతుడు నిగూఢమగు నా ప్రేమను దివ్యైశ్వర్యమునకు తాళపుచెవిని గావించినాడు ¶15

భగవంతుడికి, ఆయన సృష్టికి సంబంధించి ఇస్లాంలో ఒక ప్రసిద్ధమైన ఐతిహ్యం ఉంది :

“మున్నొక నిక్షిప్త కోశాన్ని నే
మిన్నగా నెఱుక జేయబడనెంతు
మన్నికగొని విరచించితి సృష్టి
నన్నరయుదురు మీరని తలంచి”

ఈ సాంప్రదాయ సంబంధ ప్రస్తావనలు, సూచనలు బహాయి పవిత్రలేఖనా లన్నింటిలోనూ కానవస్తాయి. ఉదాహరణకు తన ప్రార్థనలలో ఒక దానిలో బహాఉల్లా యిలా వెలువరిస్తాడు : 

నా దేవుడవైన ఓ ప్రభూ! నీ నామము ప్రశంసింపబడుగాక. నీవు స్మృత్యతీతాస్తిత్వమునందు అభినివిష్టం గావింపబడిన నిక్షిప్త భాండాగారానివనీ, నీ స్వీయ సారమునందు ప్రతిష్ఠితమైనట్టి దుర్గ్రాహ్యరహస్యానివనీ నేను సాక్ష్యం వహిస్తాను. నిన్ను నీవు బహిర్గతమొనర్చనెంచి ఊర్ధ్వాధమ లోకాల కస్తిత్వ మొసంగి, మానవుని సమస్త జీవకోటి కతీతునిగా నెంచికొని, ఇరు ప్రపంచములకును ఆతనిని చిహ్నము గావించిన నీవు మా సకలాధీశుడవు, పరమ దయానిధివి.

నీ సృష్టి యందలి జనులందరి సమక్షమున నీ సింహాసనము నధిరోహించు నటుల ఆయనను ఉత్తిష్టుని గావించితివి. నీ మర్మములను వెలువరించి నీ దివ్యావిష్కరణా స్ఫూర్తి కాంతులతో వెలుగొంది నీ దివ్యనామములనూ, సద్గుణ విశేషములనూ ప్రదర్శించు నటుల ఆయనను యోగ్యుని జేసితివి. నీ కల్పనాకృత విశ్వమునకు విభుడవగు ఓ దేవా! ఆయన ద్వారా నీ సృష్టి రచనా ప్రవేశి నలంకరించితివి. 

(ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ బై బహాఉల్లా , 38 నుండి) 

అదే విధంగా, నిగూఢార్థ ప్రవచనము (హిడెన్ వర్డ్స్) లలో ఆయన యిలా ప్రవచిస్తాడు:

ఓ మానవపుత్రుడా! నిన్ను సృష్టించుటను ప్రేమించినందుననే నిన్ను సృజించితిని. నీకు నామకరణము చేసి, నీ ఆత్మను జీవసారముతో నింపు నిమిత్తము నీవు నన్ను ప్రేమింపుము.

పై సాంప్రదాయం గురించి వ్యాఖ్యానిస్తూ అబ్దుల్-బహా యిలా వ్రాశాడు: 

ప్రియతముని పథాన పయనించు ఓ పథికుడా! ఎవరు ఆయన సమస్త కీర్తియుతాస్తిత్వానికి ఉషోదయస్థానములో వారి గురించి, సత్యస్వరూపము నందు భగవంతుని నిక్షిప్తమూ, భగవంతుని ప్రత్యక్షీకరణ దిశల గురించి ప్రస్తావించడమే ఈ పవిత్ర సాంప్రదాయపు ప్రధానోద్దేశ్యమని తెలిసికొనుడు. ఉదాహరణకు, అనంతాగ్నిజ్వాల వెలిగింపబడి, ప్రత్యక్షీకరింపబడుటకు పూర్వమే విశ్వసాక్షాత్కారాలకు నిగూఢ చిహ్నముగా దానియందే అంతర్లీనముగా దాగి ఉంటుంది; ఇదే “నిక్షిప్త భాండాగార” దశ. పావన తరువు తనంత తానే రగిలింపబడి, ఆ దివ్యాగ్ని తన జీవసత్త్వము నందలి చేవచే జ్వలించు దశే “నే నెఱుక చేయబడనెంతు” ననునది. విశ్వదిఙ్మండలము నుండి అనంత దివ్యనామ గుణ విశేషణములతో అగంతుక నిరంజన ప్రపంచములపై శోభిల్లినపుడు, వినూత్నాద్భుత సృష్టి ఆవిర్భావము నొంది “మన్నిక గొని విరచించితి సృష్జి” యనుదానికి అనుసంధానమగును. పునీతాత్మలు సమస్త భవబంధములనెడు తెరలను చీల్చివైచి, ప్రాపంచిక నిరోధములను అధిగమించి, దివ్యసాక్షాత్కార దర్శనమునకు భగవదవతారమూర్తిని గుర్తెరుగు గౌరవమునకు త్వరపడు దశనొంది, వారి హృదయముల యందున పరమాత్ముని పరమోన్నత శోభా చిహ్నమును వీక్షించినపుడు, అనంతసత్యమైనట్టి ఆయనను తెలిసికొనినపుడు సృష్టి పరమార్థము సాక్షాత్కరించును.

24. ఓ మహోన్నతుని దివ్యలేఖినీ ! ¶16

“పరమోన్నతుని లేఖిని”, “పరమోన్నత లేఖిని”, “మహోత్కృష్ట లేఖిని” అనేవి బహాఉల్లాకు – భగవత్ప్రవచనావిష్కర్తగా ఆయన కర్తవ్యనిర్వహణను అభివర్ణిస్తూ - అనువర్తిస్తాయి.

25. మీకు స్వల్పకాలముపాటు ఉపవసించుటను విధియించి . . . ¶16

ఆవిష్కృత భగవత్శాసనానికి - ఉపవాస, అనివార్య ప్రార్థనలు మూలస్థంభాలు. అనివార్యప్రార్థనల ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా విశ్వాసులు దైవసాన్నిధ్యము నొందుదురు కనుకనే, తాను వాటిని వెలువరిం చడం జరిగిందని బహాఉల్లా ఒకానొక దివ్య ఫలకంలో ధృవీకరించాడు.
 
సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలను వర్జించి, పాటించే ఉపవాసకాలం గురించి షోఘి ఎఫెండీ ఇలా వ్రాశాడు :

“... ప్రత్యేకించి యిది ప్రార్థనకు, ధ్యానమునకు, ఆధ్యాత్మిక పునర్ప్రాప్తికి అనువైన వ్యవధి. ఈ తరుణంలో విశ్వాసి తన ఆంతరంగిక జీవనమునందు పునస్సమన్వయములను చేసుకోవ డానికీ, తన ఆత్మయందు లీనమై యున్న ఆధ్యాత్మిక శక్తులను పరిశుద్ధీకరించి, దృఢీకరించ డానికీ శ్రమించడం ఎంతో అవసరం. అందువలన, దాని ప్రాముఖ్యత, ఉద్దేశ్యం ప్రధానంగా ఆధ్యాత్మిక స్వభావానికి సంబంధించినవి. స్వార్థపూరిత, ఐహిక సౌఖ్యాలను వర్జించవలె ననడాన్ని గుర్తుచేసే సంకేతమే ఉపవాస నియమము.”

విశ్వాసులందరికీ 15 నుండి 70 యేండ్ల వయస్సు వచ్చేంత వరకు, ఉపవాస నియమం విధించబడింది.

ఉపవాస శాసనానికి సంబంధించిన పూర్తి వివరణల గురించి, కొన్ని వర్గాల వారికి ఇచ్చిన మినహాయింపుల గురించి కితాబ్-ఎ-అఖ్దస్ శాసనాదేశముల సారసంగ్రహము – క్రోడీకరణము లో పరిచ్ఛేదము 4. ఆ. 1-6 లో ఇవ్వబడింది. ఉపవాసం నుండి మినహాయింపులకు సంబంధించిన చర్చనీయాంశాలకై చూ. వివరణలు 14, 20, 30, 31. 

పంధొమ్మిది రోజుల ఉపవాస కాలం - బహాయి మాసం ఆలా* తో కలిసి - సాధారణంగా అధిక దినాలు ముగియగానే మార్చి 2-20 మధ్య వస్తుంది (చూ. వివరణలు 27, 147); నౌరూజ్ పండుగతో ముగుస్తుంది (చూ. వివరణ 26).

26. . . . తదంత్యమును నౌరూజ్ పండుగగా నిర్ధారించినాము. ¶16

ప్రస్తుతం బదీ లేక బహాయి పంచాంగముగా వ్యవహరించబడుతున్న నూతన పంచాంగాన్ని (చూ. వివరణలు 27, 147) బాబ్ ప్రవేశపెట్టాడు. ఈ పంచాంగం ప్రకారం సూర్యాస్తమయం నుండి సూర్యాస్తమయం వరకు గల సమయాన్ని ఒక రోజుగా పరిగణించడమైనది. బయాన్ లో – ‘ఆలా’ మాసాన్ని ఉపవాసమాసం గాను, ఆ మాసాంతాన్ని నౌరూజ్‌కు నాంది గాను, నౌరూజ్‌ను దైవదివసం గాను బాబ్ పేర్కొన్నాడు. బహాఉల్లా - బదీ పంచాంగాన్ని ఆమోదిస్తూ నౌరూజ్‌కు పర్వదిన (పండుగ) హోదాను కల్పించాడు.

సంవత్సరంలో మొదటి రోజు - నౌరూజ్. ఇది మార్చి 21వ తేదీన ఉత్తరార్ధగోళంలో వసంతఋతు విషువత్తుతో కలిసి ఏకకాలంలో సంభవిస్తుంది. సూర్యుడు మేషరాశిలో ఏ దినాన ప్రవేశిస్తాడో - అది ఆ సూర్యాస్తమయానికి, ఒక్క నిమిషం ముందైనా కావచ్చు - ఆ దినాన్ని పండుగగా జరుపుకోవాలని బహాఉల్లా వివరించాడు. వసంతఋతు విషువత్తు సంభవించే కాలం ఆధారంగా, నౌరూజ్ - మార్చి 20, 21 లేదా 22న రావచ్చు.

అనేక శాసనాల వివరణలను పూరించే విధిని బహాఉల్లా విశ్వన్యాయ మందిరానికి అప్పగిం చాడు. వీటిలో బహాయి పంచాంగానికి వర్తించే విషయాలు చాలా ఉన్నాయి. నౌరూజ్ సమయనిర్ధారణకు సంబంధించిన శాసనాన్ని ప్రపంచమంతటా అమలులో పెట్టడానికి వసంతఋతు విషువత్కాలాన్ని నిర్ధారించటానికి ప్రామాణికంగా తీసుకోదగిన ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఎన్నుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని దివ్యధర్మ సంరక్షకుడు షోఘి ఎఫెండీ ప్రకటించాడు. ఈ ప్రదేశాన్ని నిర్ణయించే అధికారాన్ని విశ్వన్యాయ మందిరానికే వదిలి వేయడం జరిగిందని కూడా ఆయన సూచించాడు.

27. మాసముల యందలి అధిక దినములు ఉపవాస మాసమునకు ముందుంచబడు గాక. ¶16

సంవత్సరానికి 365 రోజుల, 5 గంటల 50 నిమిషాలు ఉండే సౌరమాన పంచాంగం ఆధారంగా బదీ పంచాంగం రూపొందించబడింది. ఈ పంచాంగంలో మాసానికి 19 రోజుల చొప్పున సంవత్సరానికి 19 మాసాలు (అంటే 361 రోజులు) ఉంటాయి. వీటికి అదనంగా నాలుగు (లీపు సంవత్సరానికైతే ఐదు) అధిక దినాలను కలిపి ఒక సంవత్సరంగా పరిగణిస్తారు. నూతన పంచాంగం ప్రకారం అధిక దినాలు సంవత్సరంలో ఎక్కడ చోటు చేసుకుంటాయన్నది బాబ్ నిర్ధారించలేదు. ఈ అధిక దినాలను “ఆలా” మాసానికి అంటే ఉపవాస కాలానికి ముందుండేలా స్థిరపరచి కితాబ్-ఎ-అఖ్దస్ ఈ సమస్యను పరిష్క రించింది. బహాయి పంచాంగం గురించిన మరిన్ని వివరాలకై చూ. బహాయి వరల్డ్, సంపుటి 18.

28. ఈ రేయింబవళ్లన్నియును, “హా” యక్షరస్వరూపములు కావలె నని నిర్దేశించినాము. ¶16

అయ్యామ్-ఇ-హా (హా దినములు) గా వ్యవహరించబడుతున్న ఈ అధిక దినాలు “హా అక్షర” సాంగత్యంతో విశిష్టత నొందినాయి. అబ్జాద్ సాంఖ్యక విలువ ఐదు అయిన ఈ అరబ్బీ అక్షరం అధిక దినాల సంఖ్యకు సరిపోతున్నది.

“హా” అక్షరానికి పవిత్ర లేఖనాలలో అనేక ఆధ్యాత్మికార్థాలు ఇవ్వబడ్డాయ. దైవధృతికి ప్రతీక - వాటిలో ఒకటి.

29. నిగ్రహకాలమునకు మునుపు వచ్చునట్టి ఈ దాతృత్వ దినములు ¶16

ఈ దినాలలో విందు, వినోదాలను నిర్వర్తించవలసిందిగా బహాఉల్లా తన అనుచరులకు నిర్దేశిం చాడు. “అతిధి సత్కారాలకు, దాన ధర్మాలకు ఈ అధిక దినాలు ప్రత్యేకంగా రూపొందింపబడిన” వని షోఘి ఎఫెండీ తరఫున వ్రాయబడిన ఒక లేఖలో వివరించబడింది.

30. ప్రయాణికులు . . . ఉపవాస నియమమునకు బద్ధులు కారు ¶16

ప్రయాణానికి సంబంధించి, ఉపవాసం నుండి విశ్వాసికి మినహాయింపునిచ్చే - కనిష్ఠ వ్యవధి బహాఉల్లాచే నిర్వచించబడింది. (చూ. ప్ర.-జ. 22, 75). ఈ నిబంధన వివరాలు సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఆ. 5. అ. 1-5 వరకు సంక్షిప్త పరచబడ్డాయి.
 
ప్రయాణికులకు ఉపవాసం నుండి మినహాయింపు ఇవ్వబడినప్పటికీ, వారికి ఇష్టమైతే ఉపవాసనియమాన్ని పాటించవచ్చునని షోఘి ఎఫెండీ స్పష్టీకరించాడు. ఈ మినహాయింపు పూర్తి ప్రయాణకాలానికి వర్తిస్తుంది తప్ప - రైలులోనో, కారులోనో ప్రయాణించే కొద్దిపాటి గంటల కాలానికి వర్తించ దనికూడా సూచించా డాయన.

31. ప్రయాణికులు, రోగులు, గర్భవతులు, స్తన్యమునిచ్చు తల్లులు ఉపవాస నియమమునకు బద్ధులు కారు; భగవంతుడు తన యనుగ్రహమునకు ప్రతీకగ వారికి మినహాయింపు నొసంగినాడు. ¶16

అస్వస్థులు, లేదా వయోవృద్ధులకు (చూ. వివరణ 14), బహిష్టు మహిళలకు (చూ. వివరణ 20), ప్రయాణికులకు (చూ. వివరణ 30), గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు ఈ మినహాయింపు ప్రసాదించ బడినది. ఎక్కువగా కష్టించే శ్రామికులకు కూడా ఈ మినహాయింపు ఇవ్వబడింది, కాగా అదే సమయంలో వారు “దైవశాసనం పట్ల, దాని మహోన్నత స్థానం పట్ల గౌరవాన్ని ప్రదర్శించేందుకై మితంగా, ఏకాంతంగా భుజింప” వలెనని సూచించబడ్డారు. (చూ. ప్ర.-జ. 76). ప్రజలకు ఉపవాస నియమం నుండి మినహాయింపును ఇవ్వదగిన పనుల వివరాలను విశ్వన్యాయ మందిరము వారు నిర్వచిస్తారని షోఘి ఎఫెండీ సూచించాడు.

32. సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు అన్నపానాదులను వర్జింపుడు. ¶17 

ఇది ఉపవాస కాలానికి సంబంధించింది. ఉపవాసంలో అన్నపానాదుల వర్జనయే కాదు ధూమపానం కూడా ఒక విధమైన ‘సేవన’ మే (అంటే త్రాగడమే) నని, అబ్దుల్-బహా తన దివ్యఫలకాలలో ఒకదానిలో వివరించాడు. ‘పానం’ అనే మాట అరబ్బీ భాషలో ధూమపానానికి కూడా యధాతధంగా వర్తిస్తుంది.

33. న్యాయాధీశుడగు భగవంతుని విశ్వసించు ప్రతి యొక్కడును అనుదినమును . . . “అల్లా ‘హో’ అభా” ను తొంబదియైదు పర్యాయము లుచ్చరింపవలె. ¶18
 
 “అల్లా ‘హో’ ఆభా” అనేది “దేవుడు సకల మహిమాన్వితుడు” అని అర్ధాన్నిచ్చే అరబ్బీ పదబంధం. భగవంతుని మహోన్నతనామ స్వరూపమిది (చూ. వివరణ 137). మహోన్నతం అన్నది ఇస్లాం సంప్రదాయంలో భగవంతుని వివిధ నామాలలో ఒకటి. ఈ మహోన్నత నామపు జాడ అదృశ్యంగా ఉంటుంది. భగవంతుని మహోన్నత నామం : “బహా” యేనని బహాఉల్లా స్థిరపరిచాడు.

“బహా” నుండి జన్మించిన వివిధ పదజనితాలు కూడా మహోన్నత నామములే. షోఘి ఎఫెండీ తరఫున ఆయన కార్యదర్శి యిలా వ్రాశాడు : 

బహాఉల్లా నామధేయమే మహోన్నత నామము. “యా బహాఉల్ –అభా” అనే ధ్యాన శ్లోకానికి: “ఓ మహిమలకు మహిమా” అని భావము. “అల్లా హో* ఆభా” అభివందనకు “దేవుడు సకల మహిమాన్వితు” డని అర్థం. ఈ రెండూ బహాఉల్లాకే వర్తిస్తాయి. మహోన్నత నామము పేరిట, భగవంతుని మహోన్నత నామముతో బహాఉల్లా సాక్షాత్కరించాడని అర్థం. మరోవిధంగా చెప్పనెంచిన, ఆయన భగవంతుని మహోన్నత దివ్యావతారమని చెప్పవచ్చు.

“అల్లా ‘హో’ ఆభా” అనే అభివందన బహాఉల్లా బహిష్కృతుడై అడ్రియానోపుల్ లో ఉండగా అమలులోకి వచ్చింది. 

 “అల్లా ‘హో’ ఆభా” ను తొంభైఐదు సార్లు ఉచ్చరించేందుకు ముందుగా శుద్ధీకరణలను ఆచరించాలి (చూ. వివరణ 34).

34. అనివార్య ప్రార్థనకై శుద్ధీకరణములను గావింపుడు ¶18 

కొన్ని ప్రార్థనలకు శుద్ధీకరణలు ప్రత్యేకంగా అనుసంధించబడినాయి. మూడు అనివార్య ప్రార్ధనలను పఠించడానికి ముందుగానూ, అలాగే, అనుదినం తొంభైఐదు సార్లు ఉచ్చరించవలసిన “అల్లా ‘హో’ ఆభా” కు ముందుగానూ, అనివార్య ప్రార్థనలకు మారుగానూ, బహిష్టైన మహిళలకై నిర్దేశింపబడిన దివ్య ప్రవచనాల పఠనకు ముందు గానూ - ఈ శుద్ధీకరణలు జరగాలి (చూ. వివరణ 20).

ప్రార్థనకు సమాయత్తమయ్యే ముందు హస్తాలనూ, ముఖాన్నీ ప్రక్షాళన చేసుకోవడం కూడా నిర్దేశిత శుద్ధీకరణలలో ఉంది. మధ్యమ అనివార్య ప్రార్థన విషయంలో, యిది కొన్ని దివ్య ప్రవచనాల ఆలాపనతో పాటు అనుసంధానించబడింది. (చూ. కితాబ్-ఇ-అఖ్దస్‌కు అనుబంధంగా బహాఉల్లా వెలువ రించిన కొన్ని మూల గ్రంథములు).

సాధారణ ప్రక్షాళనకన్నా, శుద్ధీకరణలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. వాస్తవానికి, ఒక వ్యక్తి అనివార్య ప్రార్థనకు ముందుగా స్నానం చేసి ఉన్నప్పటికీ, శుద్ధీకరణ గావించుకోవడం అత్యావశ్యకం. (చూ. ప్రశ్నోత్తరాలు 18)

శుద్ధీకరణకు నీరు లభ్యం కానప్పుడు, నిర్ణీత ప్రవచనాలను ఐదుసార్లు ఉచ్చరించాలి (చూ. వివరణ 16), నీటి వాడకం వల్ల శరీరానికి హానికలిగే వారికి కూడా ఇది వర్తిస్తుంది (చూ. ప్ర.-జ. 51).

శుద్ధీకరణ శాసనానికి వర్తించే విధి విధానాలు సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. అ. 10. అ.-ఋ. వరకూ, ఇంకా, ప్రశ్నలు - జవాబులలో 51, 62, 66, 77, 86 సంఖ్యలు గలవానిలోనూ పొందుపరచ బడ్డాయి.

35. హతమార్చుట . . . నుండి మీరు నిషేధింపబడినారు. ¶19 

ఇంకొకరి ప్రాణాన్ని తీయడం నిషిద్ధమన్న నియమాన్ని బహాఉల్లా కితాబ్-ఎ-అఖ్దస్ లోని 73 వ పేరాలో పునఃప్రతిపాదించాడు. ఒక పథకం ప్రకారం చేసే నరహత్యకు అపరాధపరిహారాలు నిర్దేశింపబడ్డాయి (చూ. వివరణ 86). నరహత్య విషయంలో హతుని కుటుంబానికి నిర్ణీత నష్టపరిహారాన్ని చెల్లించడం తప్పనిసరి (చూ. కితాబ్-ఎ-అఖ్దస్ ¶188).

36. లేక వ్యభిచరించుట ¶19 

 “వ్యభిచారము” అని ఇక్కడ భాషాంతరం చేయబడిన “జినా” అనే అరబ్బీ పదం - వ్యభిచారం, జారత్వం రెండింటినీ సూచిస్తుంది. ఇది ఒక వివాహితుడు లేదా వివాహితురాలు తన భార్య లేదా భర్త కాని వ్యక్తితో కలిగి ఉండే లైంగిక సంబంధాలకే కాక, సాధారణ వివాహేతర లైంగిక సంబంధాలకు కూడా వర్తిస్తుంది. బలాత్కారం అన్నది “జినా” కు మరో రూపాంతరం. వ్యభిచార నేరానికి బహాఉల్లా ఒకే ఒక శిక్షను విధించాడు (చూ. వివరణ 77); ఇక ఇతరత్రా జరిగే లైంగిక నేరాలకు విధించదగిన దండనల నిర్ణయాధికారాలు న్యాయమందిరానికి ఇవ్వబడ్డాయి.

37. పరోక్షనింద, మిథ్యారోపణ ¶19

పరోక్షనింద, దూషణ, పరుల దోషములను పెద్దవి చేసి చెప్పడం వంటి చర్యలను బహాఉల్లా అనేక పర్యాయాలు ఖండించాడు. నిగూఢార్ధ ప్రవచనములలో ఆయన యిలా స్పష్టంగా వచించాడు : “ఓ అస్తిత్వ పుత్రుడా! నీ దోషాలను మరచి ఇతరుల దోషాల పట్ల నిరతుడవైతే ఎట్లు? ఇ ట్లనుసరించువారు నా శాపాను గ్రస్తులగుదురు.” ఇంకా : “ఓ మానవ పుత్రుడా! నీవు పాపివై యున్నంత వరకు యితరుల పాపములను శ్వాసించకు. ఈ ఆజ్ఞ మీరితివేని శపింపబడుదువు. ఇందుకు నేనే సాక్ష్యం వహింతును,” అని కూడా పేర్కొన్నాడు. తీవ్రమైన ఈ హెచ్చరికను తన కడపటి పవిత్ర లేఖనమైన “ది బుక్ ఆఫ్ మై కవనెంట్” లో యిలా నొక్కిచెప్పాడు: “జిహ్వ యున్నది శుభమును వచియించుటకేనని నేను నిశ్చయముగా చెప్పుచున్నాడను, అయుక్తమగు సంభాషణతో దానిని మలినము గావింపవలదు. భగవంతుడు గతించిన దానిని క్షమియించినాడు. ఇక ముందు ప్రతి యొక్కరును యుక్తమైన దానినీ, సముచితమైన దానినే వక్కాణింపుచూ మానవుల మనస్సుకు దుఃఖకారకములగు దూషణ దుర్భాష లకు దూరముగ నుండవలె.”

38. వారసత్వపుటాస్తిని . . . సప్తవర్గములుగ విభజించినాము. ¶20 

వీలునామా లేని పక్షంలోనే, అంటే - ఏ వ్యక్తి ఐనా వీలునామా వ్రాయకుండా మరణించినప్పుడే బహాయి వారసత్వ శాసనాలు అనువర్తిస్తాయి. ప్రతి విశ్వాసి తన వీలునామాను వ్రాయాలని బహాఉల్లా, కితాబ్-ఇ-అఖ్దస్ (¶109) లో ఆదేశించాడు. ప్రతి వ్యక్తికీ తన ఆస్తిని తనకు నచ్చిన రీతిన విభజించటానికి గాని, నామనిర్దేశం చేయడానికి గాని, బహాయిలను లేదా బహాయేతరులను గానీ తన ఆస్తికి  వారసులను చేయటానికి గానీ సంపూర్ణ స్వేచ్ఛ ఉన్నదని వేరొకచోట స్పష్టంగా ప్రకటించాడాయన (చూ. ప్ర.-జ. 69). ఇందుకు సంబంధించి షోఘి ఎఫెండీ తరఫున వ్రాయబడిన ఒక లేఖ యిలా వివరిస్తుంది: 
 
... ఒక బహాయి వీలునామా ప్రకారం తన ఆస్తిని తన యిష్టానుసారం పంచివేయటానికి అనుమతించబడినప్పటికీ, అతడు తన వీలునామాను వ్రాసేటప్పుడు నైతికంగా, న్యాయంగా కొన్ని అంశాలను ఎప్పుడూ మదిలో ఉంచుకోవలసి ఉంటుంది. అనగా - సంపద సామాజిక ధర్మానికి సంబంధించిన బహాఉల్లా నియమాన్ని సమర్ధించవలసిన అవసరాన్నీ, అదే విధంగా, ఆ సంపద కొందరు వ్యక్తుల లేదా వ్యక్తుల సమూహాల అధీనంలో అధికంగా సమీకరింప బడటాన్నీ, కేంద్రీకరింపబడటాన్నీ అరికట్టవలసిన తక్షణావశ్యకతను గుర్తుంచు కోవాలి.

అఖ్దస్ గ్రంథములోని ఈ దివ్యప్రవచనం, బహాయి వారసత్వ శాసనాన్ని బహాఉల్లా విశదీకరించే సుదీర్ఘ గ్రంథభాగాన్ని మనకు పరిచయం చేస్తుంది. దీనిని పఠించే సమయంలో - మృతుడు పురుషుడు అన్న భావంతో ఈ శాసనం రూపొందించబడిందని - దృష్టి యందుంచుకోవాలి. పరమపదిం చినది స్త్రీ ఐతే తదనుగుణంగా మార్పులు అనువర్తిస్తాయి.
 
పరమపదించిన వాని వారసత్వపుటాస్తిని సప్త (ఏడు) వర్గాలకు చెందిన వారసు (సంతానం, భార్య/భర్త, తండ్రి, తల్లి, సోదరులు, సోదరీమణులు మరియు ఉపాధ్యాయుడు) లకు పంపిణీ చేసే విధానం, బయాన్‌లో బాబ్ పొందుపరచిన నిబంధనలపై ఆధారితమై ఉంది. వీలునామా లేని పక్షంలో వారసత్వపుటాస్తికి అనువర్తించే బహాయి శాసనాల ప్రధాన లక్షణాలు :
 
1. మరణించినవాడు పురుషుడై, అతని ఆస్తిలో గృహం కూడా ఉన్నట్లయితే, ఆ గృహం జ్యేష్ఠ పుత్రునికి అంటే పెద్దకుమారునికి దక్కుతుంది. (చూ. ప్ర.-జ. 34)

2. మృతినొందినవానికి మగసంతానం లేకపోతే, ఆస్తిలో మూడింట రెండు వంతులు స్త్రీ సంతతికి చెందుతుంది. మిగిలిన మూడవ వంతు న్యాయ మందిరానికి మరలించ బడుతుంది (చూ. ప్ర.-జ. 41, 72). న్యాయమందిర వ్యవస్థకు వర్తించే వివిధ స్థాయి లకు సంబంధించిన ఈ శాసనం గురించి చూ. వివరణ 42 (చూ. వివరణ 44 కూడా)

3. మిగిలిన ఆస్తి ఏడు వర్గాల వారసులకు పంపిణీ చేయబడింది. ఒక్కొక్క వర్గానికీ వర్తించే వాటాల సంఖ్యల వివరాలకు, చూ. ప్ర.-జ. 5 ఇంకా సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఇ. 3. అ. 

4. ఏ వర్గానికి చెందిన వారసుల సంఖ్య ఐనా ఒకటికి మించితే, ఆ వర్గానికి వర్తించే ఆస్తిని వారందరికీ - వారు స్త్రీలైనా, పురుషులైనా సరే - సమంగా పంచాలి.

5. సంతానం లేని పక్షంలో పిల్లల వాటా మొత్తం న్యాయమందిరానికి మరలించబడుతుంది (చూ. ప్ర.-జ. 7, 41)

6. సంతానం ఉండి, మిగతా వర్గాల వారసులు కొందరే ఉండటమో, లేదా అసలు లేకపోవడమో జరిగిన పక్షంలో వారి వాటాలలో మూడింట రెండు వంతులు సంతాన వర్గానికి, మూడవ వంతు న్యాయమందిరానికి చెందుతాయి (చూ. ప్ర.-జ. 7).

7. పైన పేర్కొనబడిన ఏ వర్గం వారు కూడా జీవించి ఉండని పక్షంలో, వారసత్వపుటాస్తిలో మూడింట రెండు వంతులు మృతుని అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ పిల్లలకు చెందు తుంది. వారు లేని పక్షంలో ఆ వాటాలు చిన్నాన్న, చిన్నమ్మ, మేనత్తలకు చెందు తుంది; వారూ జీవించిఉండకపోతే వారి పిల్లలకు చెందుతుంది. ఏ సందర్బంలోనైనా మూడవ వంతు మాత్రం న్యాయమందిరానికే మరలింపబడుతుంది. 

8. పైన పేర్కొనబడిన ఏ వర్గానికి చెందిన వారసులూ లేని పక్షంలో యావదాస్తి న్యాయ మందిరానికి చెందుతుంది.

9. బహాయి తల్లిదండ్రుల నుండి, బంధువుల నుండి బహాయేతరులు వారసత్వాన్ని పొందజాలరని బహాఉల్లా వక్కాణించాడు (చూ. ప్ర.-జ. 34). తన తరపున వ్రాయ బడిన ఒక లేఖలో షోఘి ఎఫెండీ : “వీలునామా వ్రాయకుండా మరణించిన వారి ఆస్తి విషయంలోనే కితాబ్-ఎ-అఖ్థస్ లో పేర్కొనబడిన విధంగా వారసత్వపుటాస్తిని విభజించడం జరుగుతుంది. అలా కాక, వీలునామా ద్వారా తన వారసత్వపుటాస్తిని ఎవరికైనా, ఏ మతస్తునికైనా ధారాదత్తం చేసే హక్కు ఒక బహాయికి ఉన్న” దని ఈ నిబంధనల నిర్బంధతను వివరించాడు. బహాయేతరులైన తన భాగస్వామికి, సంతానానికి లేదా బంధువులకు, వీలునామా పూర్వకంగా వారసత్వపుటాస్తి హక్కును కల్పించడం ఒక బహాయికి సదా సాధ్యమే. 

వారసత్వాస్తి శాసనాలకు సంబంధించిన అదనపు వివరాలు సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఇ. 3. అ.- అం. వరకు సంక్షిప్తపరచ బడినాయి.

39. ఐదు భాగములను సోదరులకును . . . నాలుగు భాగములను సోదరీమణులకును . . . ¶20 

స్వర్గస్తుని సోదరీసోదరులకు కేటాయించబడిన వారసత్వపుటాస్తి వాటాల ఏర్పాట్లను ప్రశ్నలు – జవాబులు లో చూడవచ్చు. స్వర్గస్తుని సోదరుడు లేదా సోదరి (ఒకే తండ్రి సంతానం) తనకు కేటాయించ బడిన పూర్తి వాటాను పొందుతారు. అయితే, సోదరుడు లేదా సోదరి వేరొక తండ్రి సంతానమైనపుడు, నిర్ణీత వాటాలో వారికి మూడింట రెండు వంతులు మాత్రమే యివ్వడం జరుగుతుంది; మూడవ వంతు న్యాయమందిరానికి మరలింపబడుతుంది (చూ. ప్ర.-జ. 6). అదే విధంగా మరణించిన వ్యక్తికి సంబంధిం చిన వారసులలో స్వయానా తోడబుట్టిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నట్లయితే, తల్లి పక్షానికి చెందిన మారు సోదరసోదరీమణులు వారసత్వపుహక్కును పొందజాలరు (చూ. ప్ర.-జ. 53). అయితే, వారు స్వంత తండ్రి ఆస్తిలో నుండి పొందవలసిన వాటాకు అర్హులౌతారు.

40. ఉపాధ్యాయులకు ¶20

అబ్దుల్-బహా ఒకానొక దివ్యఫలకములో ఆధ్యాత్మిక శిక్షణ గరపిన గురువును “తన సంతతికి శాశ్వత జీవితాన్ని ప్రసాదించు” నట్టి “ఆధ్యాత్మిక జనకు” నితో పోల్చాడు. అందుకే “దైవశాసనము” నందు “గురువులు వారసుల జాబితాలో చేర్చబడ్డా” రని ఆయన వివరించాడు. 

వారసత్వపుటాస్తిలో ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయిని  పొందే వాటాను బహాఉల్లా ప్రత్యేకంగా సూచించాడు (చూ. ప్ర.-జ. 33).

41. గర్భస్థ శిశువుల యార్తనాదముల నాలకించినయంత, వారి వాటాను ద్విగుణీకృత మొనరించి, మిగిలినవారి వాటాలను తగ్గించినారము. ¶20

బాబ్ ప్రతిపాదించిన వారసత్వ శాసనాలలో 540 వాటాలు గల 9 భాగాలు శిశువులకు కేటాయించ బడ్డాయి. ఈ కేటాయింపు వారసత్వపుటాస్తిలో నాలుగవ వంతుకన్నా తక్కువే. బహాఉల్లా ఆ వాటాను రెట్టింపు చేసి, అంటే 1080 వాటాలకు పెంచి, తక్కిన 6 వర్గాల వారసుల వాటాలను ఆ మేరకు తగ్గించాడు. వారసత్వపుటాస్తి పంపిణీకి సంబంధించిన ఈ దివ్యప్రవచన అంతరార్థాన్ని, దీని అనువర్తన లను సంక్షిప్తంగా వివరించాడాయన (చూ. ప్ర.-జ. 5).

42. న్యాయ మందిరము ¶21

కితాబ్-ఎ-అఖ్దస్‌లో న్యాయమందిర ప్రస్తావనను గావించిన బహాఉల్లా, అది - విశ్వన్యాయ మందిరమా లేక స్థానిక న్యాయమందిరమా అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు; ఈ రెండు వ్యవస్థలు ఆ దివ్యగ్రంథంలో నిర్దేశించబడినవి. ఆయన సాధారణంగా “న్యాయమందిరము” అనే పేర్కొంటూ, ఈ శాసనాన్ని అనువర్తింప చేయవలసిన వ్యవస్థ అంతటికీ వర్తించే స్థాయి లేదా స్థాయిలను, అనంతర కాలంలో విశదీకరించబడేందుకు అనువుగా అవకాశాన్ని కల్పించాడు. 

ఒక దివ్యఫలకంలో స్థానిక కోశాగారానికి సంబంధించిన ఆదాయాలను లెక్కిస్తూ, అబ్దుల్-బహా - వారసులు లేని వారసత్వపుటాస్తులను కూడా విలీనం చేస్తూ, వారసత్వపుటాస్తికి సంబంధించి కితాబ్-ఎ-అఖ్దస్‌లో పేర్కొనబడిన న్యాయమందిరం స్థానిక న్యాయమందిరమేనని వివరించాడు.

43. మృతునకు పిల్లలుండి . . . ఇతర వారసవర్గీయులెవ్వరును లేని యెడల ¶22

“ఈ నియమమునకు సాధారణ, ప్రత్యేక అనువర్తనములు రెండును కలవు. అనగా, తరువాయి వర్గమునకు చెందిన వారసులెవ్వరును లేనిచో, రెండు వంతులు సంతానమునకును, మిగిలిన మూడవ వంతు న్యాయమందిరమునకును చెందు” నని బహాఉల్లా విశదీకరించాడు. (చూ. ప్ర. - జ. 7)

44. మృతుని నివాసమును, వ్యక్తిగత వస్త్రములను, స్త్రీ సంతతికో, అన్యవారసులకో కాక, పురుష సంతతికే ప్రత్యేకించినాము. ¶25

దివంగతుని నివాసం, వ్యక్తిగత వస్ర్తాలు ఆతని మగ సంతతికే మిగులుతాయని ఒకానొక పవిత్ర ఫలకంలో అబ్దుల్-బహా సూచించాడు. అవి అతని జ్యేష్ఠపుత్రుడికి చెందుతాయి; జ్యేష్ఠపుత్రుడు లే నప్పుడు ద్వితీయ జ్యేష్ఠపుత్రుడికి ... అలా జ్యేష్ఠుడికి చెందుతాయి. భగవత్శాసనంతో సుస్థిర పరచ బడిన ఈ నియమం ఒక నిర్ద్వంద్వ భావోక్తి అని వివరించాడాయన. పర్షియాకు చెందిన ఒక అనుయాయికి ఒకానొక ఫలకంలో ఆయన ఇలా వ్రాశాడు : “సమస్త దివ్యావిష్కృత యుగములందు నను జ్యేష్ఠపుత్రునకు అసాధారణ వైశిష్ట్యము లీయబడినవి. ప్రవక్తత్వస్థాయి సహిత మాతని జన్మహక్కై యున్నది.” జ్యేష్ఠపుత్రునికి ఇవ్వబడిన వైశిష్ట్యాలు విద్యుక్తకృత్యానుసరణీయాలు. ఉదాహరణకు, భగవంతుని కొరకు తన మాతృమూర్తిని సంరక్షించడం, తక్కిన వారసుల అవసరాలను తీర్చడం ఆతడి నైతిక బాధ్యత.

ఈ వారసత్వశాసనపు వివిధాంశాలను బహాఉల్లా విశదీకరిస్తాడు. నివాస గృహాలు ఒకటికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధానగృహం మగసంతతికి దక్కుతుంది. మిగిలిన గృహాలను, యితర ఆస్తులతో కలిపి వారసులకు పంపిణీ చేయా (చూ. ప్ర.-జ. 34) లని, మగసంతతి లేని పక్షంలో, దివంతుని నివాస గృహం, అతని వ్యక్తిగత వస్త్రము లలో మూడింట రెండు వంతులు స్త్రీ సంతతికీ, మూడవ వంతు న్యాయ మందిరానికీ చెందుతాయని ఆయన సూచించాడు. అదే విధంగా, మరణించి నది మహిళ అయితే, ఆమె వస్ర్తాలు ఆమె కుమార్తెలకు సమంగా యివ్వాలి. ఆమె ధరించుకొనని వస్ర్తాలను, ఆభరణాలను, సంపత్తిని - కుమార్తెలు లేని పక్షంలో - ఆమె ధరించిన ఉడుపులతో సహా ఆమె వారసులకు పంచాలి (చూ. ప్ర.-జ. 37).

45. మృతుడు జీవించియుండగనే, సంతానవంతుడగు ఆతని కుమారుడు దివంగతుడయ్యెనేని . . . ఆ సంతతి తమ తండ్రి వాటాకు వారసు లగుదురు. ¶26

ఈ శాసనాంశం కేవలం తల్లి లేదా తండ్రికన్నా ముందుగా మరణించిన కుమారుని విషయంలో వర్తిస్తుంది. మృతుని కుమార్తె సంతానవతిగా మరణిస్తే ఆమె వాటాను పరమ పవిత్ర గ్రంథంలో నిర్దేశించబడిన సప్తవర్గ వారసత్వాన్ననుసరించి విభజించాలి (చూ. ప్ర.-జ. 54).

46. మృతుని పిల్లలు పసివారైనచో, వారసత్వపుటాస్తియందలి వారి వాటాను . . . ఒక విశ్వాసపాత్రు నికి . . . అప్పగింపవలె. ¶27

ఈ పేరాలో, “విశ్వాసపాత్రుడు” గా “ధర్మకర్త” గా అనువదింపబడిన “అమీన్‌” అనే పదానికి ముఖ్యంగా విశ్వసనీయతను మాత్రమే కాక విధేయత, విశ్వాసపాత్రత, న్యాయవర్తన, నిజాయితీ మొదలైన లక్షణాలను సూచించే వివిధార్ధాలు ఉన్నాయి; న్యాయశాస్త్ర పరిభాషలో వాడబడిన “అమీన్‌” అనే పదానికి యితరత్రా వచ్చే అర్థాలలో, ధర్మకర్త, పూచీదారు, కాపలాదారుడు, సంరక్షకుడు, రక్షకుడు అనేవి కూడా ఉన్నాయి.

47. హుఖుఖుల్లా చెల్లించబడి, ఋణము లేవైనను పరిష్కృతములై, అంత్యక్రియల, ఖననముల వ్యయములు జరుపబడి మృతుడు సమాధిస్థలికి గౌరవమర్యాదలతో కొనిపోబడిన పిదపనే ఆస్తి పంపిణీ జరుగవలె. ¶28

బహాఉల్లా నిర్దేశించిన వరుసక్రమాన్ననుసరించి, వారసత్వపుటాస్తి నుండి తొలుత అంత్యక్రియల, శవఖననపు వ్యయాలు, అనంతరం దివంగతుని ఋణాలు, తదనంతరం హుఖుఖుల్లా చెల్లింపు జరగాలి (చూ. వివరణ 125) (చూ. ప్ర.-జ. 9). చెల్లింపులన్నీ తక్కిన గృహేతర ఆస్తి నుండి చెల్లించాలి. అది చెల్లింపులకు చాలని పక్షంలో, స్వర్గస్థుని నివాస గృహం, వ్యక్తిగత వస్త్రాల నుండి చెల్లించాలని కూడా ఆయన సూచించాడు (చూ. ప్ర.-జ. 80).

48. తొమ్మిదితో నారంభింపబడుటచే యెన్నడును మార్పునొందని మర్మజ్ఞానమిది. ¶29

వారసత్వానికి సంబంధించిన తన శాసనం “భగవద్గ్రంథము నందలి నిగూఢ పరిజ్ఞానము -- అనగా ఎప్పటికీ మార్పునొందనిదీ, పునఃస్థాపన చేయలేనట్టిదీ నగు పరిజ్ఞానము ననుసరించి యున్న” దని అరబ్బీ బయాన్ లో బాబ్ వర్ణించాడు. వారసత్వపుటాస్తి విభజనకు ఉపకరించే అంకెలు, భగవంతుడు ప్రత్యక్షీకరింప జేయునట్టి ఆయనను గుర్తించటానికి దోహదపడేందుకు ఉద్దేశించిన ఈ అంకెలు, ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని పేర్కొన్నాడాయన.

ఇక్కడ ప్రస్తావించిన “తొమ్మిది” అన్న సంఖ్యకు, అరబ్బీ మూలపాఠంలో “థా” అనే అక్షరం - అబ్జాద్ మూల్యాంకనం ప్రకారం - ప్రాతినిధ్యం వహిస్తున్నది (చూ. పారిభాషిక పదసూచిక). వారసత్వాస్తి పంపిణీలో పిల్లలకు “తొమ్మిది భాగములు” గా ప్రతిపాదించిన బాబ్ విధానానికి ఇదే మూలాధారము. మహోన్నత నామధేయమైన “బహా” సంఖ్యకు సమానమైనందువల్ల తొమ్మిది సంఖ్య ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ పవిత్ర ప్రవచనపు తరువాయి భాగంలో “దృశ్యాదృశ్య సదృశము, అతిక్రమించ నలవిగానట్టి, సమీపించ వీలుగానట్టి మహోన్నత నామధేయ” మని సూచించబడింది (చూ. వివరణ 33).

49. ప్రతి నగరమునను న్యాయమందిరమొక్కటి స్థాపింపబడవలెనని . . . భగవంతు డాదేశించినాడు. ¶30

ఈ న్యాయమందిర వ్యవస్థలో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సమాజ స్థాయిలలో కార్యనిర్వహణ చేసే, ఎన్నుకోబడిన సభలు ఉంటాయి. కితాబ్-ఎ-అఖ్దస్ లో బహాఉల్లా - విశ్వన్యాయ మందిరము, స్థానిక న్యాయమందిరము అనబడే రెండింటినీ నిర్దేశించాడు. అబ్దుల్-బహా తన మరణ శాసనంలో ద్వితీయ (ప్రాంతీయ లేదా జాతీయ) న్యాయమందిరాలను ఏర్పరచి, విశ్వన్యాయ మందిరాన్ని ఎన్నుకోవడానికి అవలంబించవలసిన విధానానికి రూపకల్పన చేశాడు.

పై పవిత్ర ప్రవచనంలో పేర్కొనబడిన స్థానిక న్యాయమందిరం తొమ్మిది లేదా అంతకు మించిన సంఖ్యలో వయోజన బహాయిలు నివసించే ప్రదేశంలో ఎన్నుకోబడ వలసిన వ్యవస్థను సూచిస్తుంది. ఇందు గురించి, వయోజనులకు కనిష్ఠ వయోపరిమితి 21 ఏళ్లని తాను గావించిన తాత్కాలిక నిర్ధారణ,  భవిష్యత్తులో విశ్వన్యాయమందిరము వారిచే మార్పు చేయబడుటకు వీలున్నదని దివ్యధర్మ సంరక్షకుడు సూచించాడు. 

స్థానిక, ద్వితీయ న్యాయ మందిరాలు ప్రస్తుతానికి స్థానిక ఆధ్యాత్మిక సభలుగా, జాతీయ ఆధ్యాత్మిక సభలుగా వ్యవహరించబడుతున్నాయి. ఇది “తాత్కాలిక నామ” మని షోఘి ఎఫెండీ యిలా సూచించాడు:

... బహాయి దివ్యధర్మపు స్థానము, లక్ష్యాలు మరింత సంపూర్ణంగా అవగతమై, గుర్తింపు నొందినప్పుడు క్రమేణా న్యాయమందిరానికి అనుగుణమైన శాశ్వత హోదా కల్పించ బడుతుంది. నేటి స్థానిక ఆధ్యాత్మిక సభలు భవిష్యత్తులో విభిన్నంగా ఉండటమే గాక, బహాఉల్లా దివ్యధర్మపు గుర్తింపు వలన ఏర్పడి, ప్రస్తుతం ఉన్న కార్యాచరణ విధులు, అధికారాలు, ఆధిక్యతల వల్ల అది - కేవలం ప్రపంచ మతవిధానాలలో ఒకటిగా గాక, సార్వభౌమాధికారం గల సర్వస్వతంత్ర అధీకృత మతంగా గుర్తింప బడుతుంది.

50. బహా సంఖ్య ¶30

అబ్జాద్ విధానం ప్రకారం “బహా” అంటే తొమ్మిదికి సమానం. బహాఉల్లా నిర్దేశించిన విధంగా - ప్రస్తుతానికి విశ్వన్యాయ మందిరము, జాతీయ, స్థానిక ఆధ్యాత్మిక సభలలో ఒక్కొక్క దానిలోను, తొమ్మండుగురు కనీస సభ్యులున్నారు.

51. మానవులయందున దయామయుని విశ్వాసపాత్రులుగ వ్యవహ రించుట . . . వారి కనివార్యమై యున్నది. ¶30

విశ్వన్యాయ మందిరము, జాతీయ ఆధ్యాత్మిక సభ, స్థానిక ఆధ్యాత్మిక సభల సాధారణ అధికార విధులు, వాటిలో సభ్యత్వానికి వర్తించే అర్హతలు, బహాఉల్లా, అబ్దుల్-బహాల పవిత్ర రచనలలోను, షోఘి ఎఫెండీ లేఖలలోను, విశ్వన్యాయమందిరము వారి వివరణలలోను పొందుపరచబడినాయి. ఈ వ్యవస్థల ముఖ్యవిధులు, విశ్వన్యాయ మందిర రాజ్యాంగంలోను, అదే విధంగా జాతీయ, స్థానిక ఆధ్యాత్మిక సభల రాజ్యాంగాల లోను పేర్కొనబడి ఉన్నాయి.

52. సంఘటితముగ సమాలోచనలను గావించుట ¶30

బహాఉల్లా సమాలోచనా ప్రక్రియను తన దివ్యధర్మానికి ప్రాథమిక నియమంగా స్థిరీకరించి, విశ్వాసులందరూ “సమస్త విషయములందునను సంఘటితముగ సమాలోచనలను గావింపవలె” నని ఉద్బోధించాడు. సమాలోచన అనగా  “మార్గము జూపు జ్యోతి” అని “అవగాహనా ప్రదాయిని” అని ఆభివర్ణించా డాయన. “సమాలోచనా నియమ మనేది ... బహాయి పరిపాలనా సంవిధాన మౌలిక శాసన మందొక రూప” మని షోఘి ఎఫెండీ వివరిస్తున్నాడు.

ప్రశ్నలు - జవాబులు 99 లో బహాఉల్లా - తుది నిర్ణాయకంలో ఏకాభిప్రాయ సాధనకు గల ప్రాధాన్యతను వివరించి, అది సాధ్యం కాని పరిస్థితిలో, అత్యధికుల అభిప్రాయాన్ని నిర్ణయంగా పరిగణించాలని నొక్కివక్కాణిస్తూ సమాలోచనకు ఒక విధానాన్ని రూపొందించాడు. సమాలోచనకు సంబంధించిన బోధనలపై వేయబడిన ఒక ప్రశ్నకు సమాధానంగా, సమాలోచనకు సంబంధించిన మార్గదర్శకాలు, ఆధ్యాత్మిక సభల సంస్థాపనకు పూర్వమే వెలువరించబడ్డాయని విశ్వన్యాయ మందిరము వారు విశదీకరించారు. సహాయసహకారాలకై మిత్రులు స్థానిక ఆధ్యాత్మిక సభలను సంప్రదించ వచ్చునని, ప్రశ్నలు - జవాబులలో సూచించబడిన విధానాన్ని అవలంబించడానికి ఎలాంటి నిషేధమూ లేదని విశ్వన్యాయమందిరము వారు ధృవీక రించారు. మిత్రులు తమ వ్యక్తిగత సమస్యలను గురించి సంప్రదించ దలిస్తే వా రీమార్గాన్ని అనుసరించవచ్చు.

53. సమస్త భూభాగముల యందుననూ ఆరాధనామందిరములను నిర్మింపుడు. ¶31

బహాయి ఆరాధనా మందిరం దైవసంకీర్తనకు అంకితమైన స్థానము. ఆరాధనా మందిరం అంటే : మష్రిఖుల్-అఝ్కార్ (దైవసంకీర్తనకు ఉషోదయత్ప్రదేశము) కు కేంద్ర ప్రాసాదమని. భవిష్యత్తులో ఈ ఆరాధనా మందిరానికి అదనంగా, సాంఘిక, ప్రజాహితైక, విద్యా వైజ్ఞానిక వృత్తులకు అంకితమయ్యే అనేక అనుబంధ సంస్థల భవనసముదాయం అనుసంధించబడి విరాజిల్లుతుంది. మష్రికుల్-అఝ్కార్‌ని “ప్రపంచమందున అత్యంతావశ్యక వ్యవస్థలయం దొకటి” గా అభివర్ణించాడు అబ్దుల్-బహా. ఇది “బహాయి సేవారాధన” లకు సమైక్యస్వరూపమని షోఘి ఎఫెండీ స్థూలంగా సూచించాడు. ఈ ఆరాధనా మందిరము, దీని అనుబంధ సంస్థలు “బాధితులకు ఉపశమనంగా, పేదలకు జీవనాధారంగా, పథికులకు ఆశ్రయంగా, దీనులకు స్వాంతనంగా, అజ్ఞానులకు శిక్షణాలయంగా భాసిల్లుతా” యన్న దార్శనికతను ఆయన వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో ప్రతి గ్రామంలోను, పట్టణంలోను బహాయి ఆరాధనా మందిరాలు నిర్మితమౌతాయి.

54. మీలో స్తోమతగల వారు పవిత్రగృహమునకు తీర్ధయాత్రను గావింప వలెనని దేవాధిదేవు డాదేశించి నాడు. ¶32

షిరాజ్, బాగ్దాద్ నగరాలలోని బాబ్, బహాఉల్లా గృహాలు రెండింటికీ ఈ నిర్దేశం అనువర్తిస్తుంది. ఈ గృహద్వయంలో ఏ ఒక్కదానిని సందర్శించినా తీర్ధయాత్రాఫలం లభిస్తుందని బహాఉల్లా పేర్కొన్నాడు. (చూ. ప్ర.-జ. 25, 29). సురీహ్-ఇ-హజ్ (చూ. ప్ర.-జ. 10) పేరు గల రెండు వేర్వేరు దివ్యఫలకాలలో బహాఉల్లా ప్రతి తీర్ధయాత్రకు ఆచరింపవలసిన విశేష కర్మలను నిర్దేశించాడు. దీనినిబట్టి చూడగా  గృహద్వయాన్ని మామూలుగా దర్శించి రావడంకన్నా తీర్ధయాత్ర చేయడం మిన్న. 

బహాఉల్లా స్వర్గారోహణం తర్వాత, బహ్‌జీ లోని ఆయన పవిత్ర సమాధిని తీర్ధయాత్రా క్షేత్రంగా పేర్కొన్నాడు అబ్దుల్-బహా. ఒకానొక ఫలకంలో ఆయన “మహాపావన సమాధిని, బాగ్దాద్‌నందలి శుభసౌందర్యుని పవిత్ర గృహమును, షిరాజ్‌నందలి బాబ్ పూజ్యగృహములను తీర్ధయాత్రా క్షేత్రములుగ అంకితము గావించడమైన” దని, “భరించగల, స్తోమత గల వ్యక్తికి దారిలో విఘ్నము లేమియును కలుగనిచో, నిది యనివార్య”మని సూచించాడు. మహాపావన సమాధి సందర్శనకు ఎటువంటి కర్మాచరణలు విధించబడలేదు.

55. ఆయన తన కారుణ్యము కొలది మహిళల నిందుండి మినహాయించినాడు. ¶32

ఆర్ధిక స్తోమత, ప్రయాణం చేయగల స్థితి గల తన అనుయాయులకు - వారు తమ జీవితకాలంలో ఒక పర్యాయం తీర్థయాత్ర చేయవలెనన్న శాసనాన్ని బాబ్ తన బయాన్ గ్రంథంలో విధించాడు. ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందుల నుండి మహిళలను తప్పించాలన్న అభిప్రాయంతో, వారికి దీనిని అనివార్యంగా నిబద్ధీకరించలేదని ప్రవచించాడాయన.

అదే విధంగా, తీర్థయాత్రావశ్యకత నుండి బహాఉల్లా మహిళలను మినహాయించాడు. అయితే, ఈ మినహాయింపు నిషేధం కాదని, స్త్రీలు స్వేచ్ఛగా తీర్ధయాత్రను గావించవచ్చునని విశ్వన్యాయమందిరము వారు స్పష్టం చేశారు.

56. ఏదో ఒక వృత్తి . . . లో ప్రవేశించుట ¶33

స్త్రీ, పురుషులు ఏదేని వృత్తినో, వ్యాపారమునో చేపట్టడం తప్పనిసరి. “అట్టి కార్యమునం దవలగ్నులగుట” – “దైవారాధనా స్ధాయి”కి చెందినదని నుతించాడు బహాఉల్లా. ఈ శాసనానికి గల ఆధ్యాత్మిక, ఆచరణాత్మక ప్రాముఖ్యతలు, దాని ఆచరణలో సమాజం, వ్యక్తుల పరస్పర బాధ్యతల గురించి షోఘి ఎఫెండీ తరఫున వ్రాయబడిన ఒక లేఖలో వివరించబడింది:

విశ్వాసులు ఏదేని వృత్తిలో నిమగ్నం కావడం గురించి బహాఉల్లా యిచ్చిన శాసనమునకు సంబంధించి: ఈ విషయంలో బోధనలు - ప్రత్యేకించి కితాబ్-ఎ-అఖ్దస్ లో నవీన ప్రపంచవిధానక్రమంలో, నిర్వ్యాపారులకు స్థానం లేదని సుస్పష్టంగా చెబుతున్నాయి. తత్ఫలితంగా, భిక్షాటనను నిరుత్సాహ పరచడమే కాక, దానిని సమాజం నుండి సమూలంగా తుడిచి వేయాలని బహాఉల్లా ఈ నియమానికి అనుబంధంగా ప్రవచించాడు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక వృత్తిలో అవసరమైన ప్రావీణ్యతను పొందడానికీ, ఆ ప్రావీణ్యతను సద్వినియోగం చేసుకునేందుకూ మార్గాలను, తమ జీవనోపాధి నార్జించుకోవడానికి అవకాశాలను కల్పించవలసిన బాధ్యత సమాజ నిర్వాహకులపై ఉంది. ఒక వ్యక్తికి ఎంతటి అంగవైకల్యం ఉన్నా, పరిమితులున్నా, ఏదో ఒక పనినో, వృత్తినో చేపట్టడం అవసరం. ఎందుకనగా, సేవాతత్పరతతో చేసే పని బహాఉల్లా బోధనల ప్రకారం ఒక ఆరాధనా స్వరూపమే. అది కేవలం ఉపయుక్తమే కాదు, దానిలో ఎంతో విలువ కూడ దాగి ఉన్నది. ఏలయనగా, అది మనలను దేవుని సన్నిధికి చేర్చి, ఈ ప్రపంచంపట్ల ఆయన ఉద్దేశ్యాన్ని సవ్యంగా గ్రహించేలా చేస్తుంది. వారసత్వపుటాస్తి, ఎవరికిని వారి దైనందిన వ్యావృత్తి నుండి మినహాయింపును ఇవ్వజాలదని విశదమౌతున్నది.
 
“ఒక వేళ ఏ వ్యక్తియైనను భుక్తిని ఆర్జింప నశక్తుడయ్యెనేని, లేక కటిక పేదరికము కృంగదీసెనేని, లేక నిస్సహాయుడయ్యెనేని అతనికి జీవనోపాధిగా నెలవారీ భత్యము నేర్పరచవలసిన బాధ్యత ధనవంతులపై, లేదా ఉపప్రతినిధులపై యున్నది.... ఉపప్రతినిధులనగా ప్రజాప్రతినిధులు అనగా న్యాయమందిర సభ్యు” లని తన ఫలకాలలో ఒక దానిలో అబ్దుల్-బహా ప్రవచించాడు. (చూ. భిక్షాటనపై వివరణ 162)
 
బహాఉల్లా ఆదేశం ప్రకారం - జీవనోపాధికై భార్య, తల్లి, ఇంకా ఆమె భర్త పనిచేయవలసి ఉంటుందా అని ఆడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, మిత్రులు తమకు, సాటివారికి లాభదాయకమగు వృత్తిని చేపట్టవలెనని, గృహస్థ్దావస్థ ఎంతో గౌరవప్రదము, బాధ్యతాయుతము అయిన కార్యమని, సామాజికంగా దానికి ప్రాధాన్యత ఉన్నదనీ బహాఉల్లా నిర్దేశాల సారాంశమని విశ్వన్యాయమందిరము వారు వివరించారు. 
 
ఒక నిర్ణీత వయస్సుకు చేరుకున్నవారు వృత్తినుండి విరమించుకునే విషయంలో - తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో: “కితాబ్-ఎ-అఖ్దస్‌లో ఇందుకు వివరణ లేనందున, ఇది అంతర్జాతీయ న్యాయమందిరం శాసనం చేయవలసిన విషయ” మని వివరించాడు షోఘి ఎఫెండీ.

57. కరచుంబనము దివ్యగ్రంథమున నిషేధింపబడినది. ¶34 

అనేక పూర్వపు మతావిష్కరణలలోనూ, మరికొన్ని సంస్కృతులలోను, మతాధిపతి లేదా ప్రముఖుని కరాన్ని (హస్తాన్ని) భక్తిసూచకంగాను, అటువంటి వ్యక్తులకు తమకు గల తేడాకు సంకేతం గాను, వారి అధికారం పట్ల తమకు గల విధేయతకు ప్రతీకగాను ముద్దిడుకొన వలసి వచ్చేది. బహాఉల్లా కరచుంబనాన్ని ప్రతిషేధించి, ఒకరు మరొకరి ముందర సాష్టాంగపడటాన్ని, ఒక వ్యక్తి కన్న మరో వ్యక్తి గౌరవాన్ని కించపరచే అవమానకర ప్రవర్తనలకు పాల్పడటాన్ని తన దివ్య ఫలకాలలో గర్హించాడు (చూ. వివరణ 58).

58. తమ పాపవిముక్తికై అన్యుల క్షమ నాశించుట కెవ్వరునూ అనుమతింపబడలేదు. ¶34 

ఒక వ్యక్తి మరొక వ్యక్తికి తన పాపాలను నివేదించడం, పాపప్రక్షాళనకై ప్రాధేయపడటం వంటి పనులను బహాఉల్లా ప్రతిషేధించాడు. బదులుగా ఎవరైనా భగవంతుని క్షమాభిక్షను అర్థించాలి. బిషారత్ దివ్య ఫలకంలో ఆయన “వ్యక్తులముం దొనరించు పాపనివేదనము అవమానమునకు, గౌరవభంగము నకు దారితీయు” నని ప్రవచించాడు; “భగవంతుడు తన సేవకుల అవమానము నభిలషింప” డని రూఢిగా పలికా డాయన. 

షోఘి ఎఫెండీ ఈ నిషేధాన్ని సందర్భోచితంగా వివరించాడు. ఆయన తరఫున ఆయన కార్యదర్శి యిలా వ్రాశాడు :

... క్యాథలిక్ మతగురువుల ఎదుట తమ పాపాలను నివేదించుకోవడం, ఇతరత్రా మతోపశాఖలలో ఆచరణలో ఉన్నట్లుగా, తమ పాపకృత్యాలను ప్రజల ముందు బహిర్గతం చేయడం వంటి వాటినుండి మనం నిషేధించబడ్డాము. అయినను, ఏదేని పొరపాటు జరిగిందని తెలిసికొన్నప్పుడు లేదా మన ప్రవర్తనలో లోప మున్నదని అనిపించినప్పుడు క్షమించమని ఇంకొక వ్యక్తిని తక్షణమే అడిగే స్వేచ్ఛ మనకు ఉన్నది.

పాపనివేదనం గురించి బహాఉల్లా విధించిన నిషేధం గురించి విశ్వన్యాయ మందిరమువారు కూడా స్పష్టీకరిస్తూ, ఈ నిషేధం - బహాయి వ్యవస్థల పరిరక్షణలో, సంప్రదింపులలో తమ అతిక్రమణలను అవతలి వ్యక్తికి చెప్పడాన్ని నిరోధించదు అని పేర్కొన్నారు. అదే విధంగా, ఒక సన్నిహిత మిత్రుని నుండి గాని లేదా వృత్తినిపుణుని నుండి గాని సలహా పొందగోరినపుడు తమ విషయాన్ని వివరించే సందర్భంలో ఈ నిషేధం వర్తించదని కూడా వివరించారు.

59. తన మనమునం దగ్రాసనము నపేక్షింపుచు ద్వారసీమ చెంతగల పాదరక్షల మధ్య ఆసీనుడైన వా డొకడు జనులయందు గలడు. ¶36 

ఏదైనా సమావేశంలోకి ప్రవేశించే ముందు చెప్పులను, బూట్లను వెలుపల వదలి వేయడం తూర్పుదేశాల సాంప్రదాయం. గది ద్వారానికి దూరంగా, అభిముఖంగా, గౌరవస్థానంగా పరిగణించబడే చోట, ఉపస్థితులైన వారిలోకెల్లా ప్రముఖులు కూర్చుంటారు. మిగతావారు, చెప్పులు బూట్లు వదలివేయబడిన ద్వారం వైపుకు అవరోహణ క్రమంలో కూర్చుంటారు; మరీ సాధారణ వ్యక్తులు కడపటికి, ద్వారాని కీవలగా కూర్చుంటారు.

60. అంతర్జ్ఞ్ఞానకోవిదుడనని . . . చెప్పుకొనువాడును జనులయందే గలడు. ¶36 

ఇది విశేషజ్ఞానాభినివేశం కలవారమని ప్రకటించుకునే వారిని ఉద్దేశించినది. అటువంటి జ్ఞానసంపర్కం, భగవంతుని దివ్యావతారావిష్కరణను గ్రహించడానికి అవరోధాన్ని కలిగిస్తుంది. “తమ ఊహలు మలిచిన ప్రతిమల నారాధిస్తూ, అదియే అంతఃకరణ జ్ఞానమని భావించువారు యదార్ధమునకు మ్లేచ్ఛులుగ గణియింప బడుదు” రని వేరొకచోట బహాఉల్లా స్పష్టం చేశాడు.

61. భరతఖండపు పర్వతసానువులయం దెందరు సర్వసంగపరిత్యాగులై, కఠోరనియమములను విధియించుకొని, దివ్య పదావిష్కర్త యగు భగవంతుని స్మృతికి దూరులు కాలేదు. ¶36 

ఈ దివ్య ప్రవచనం - సన్యాస, వానప్రస్థ జీవితంపై గల నిషేధానికి అన్వయిస్తుంది. చూ. సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఈ. 1. ఝ. 3-4. బహాఉల్లా స్వర్గ సదృశ పరిభాషలో ఈ నియమాలకు సంబంధిత విశేష వివరణలను ఇచ్చాడు. “ఏకాంతవాసమునో, సన్యాసమునో అవలంబిం చుట భగవంతుని సమక్షమునం దంగీకరింపబడ” వని ప్రబోధించా డాయన. “ఆనందోత్సాహములను కలిగింపు వానిని పాటింపు” డని, దాని నవలంబించు వారికి పిలుపు నిచ్చాడు. “పర్వతగుహలను గృహములుగ గ్రహియించిన” వారిని, “రాత్రులలో స్మశానవాటికలయం దేకాంతవాసము చేయు” వారిని అటువంటి అనుష్ఠానాన్ని పరిత్యజించమని ఆదేశిస్తూ, మానవజాతి నిమిత్తం కల్పింపబడిన “భగవ దౌదార్యముల”ను కోల్పోవద్దని ఆజ్ఞాపించాడు. సన్యాసుల, పూజారుల “భక్తిపూరిత కర్మల” ను వివరిస్తూ, బిషారత్ దివ్యఫలకములో “ఏకాంతవాసమును మాని, బాహ్యప్రపంచము నందడుగిడి, తమకునూ, ఇతరులకునూ లాభదాయకమగు కార్యములను చేపట్టు” డని వారికి పిలుపు నిచ్చాడాయన. అంతేకాక, “భగవంతుని స్మరియించువానికి జన్మమునిచ్చుటకై వివాహితులు కావలె” నన్న వరాన్ని ఆయన వారికి అనుగ్రహించాడు.

62. సహస్రవర్షముల పరిపూర్తికి పూర్వమే భగవదావిష్కరణకర్తగా ప్రకటించుకొనువాడు ¶37

బహాఉల్లా దివ్యసంవిధానము, తదుపరి దివ్యావతారము అవతరించునంత వరకు కొనసాగుతుంది. అట్టి మహనీయుని రాకడ “పూర్తిగ సహస్రవర్షములు” (అంటే వెయ్యి సంవత్సరాలు) గడిచిన పిదపనే తప్ప, అంతకు ముందు సంభవింపదు. ఈ “దివ్యప్రవచనము” యొక్క “విస్పష్టభావము” నకు భిన్నమైన వాదనల గురించి హెచ్చరిస్తూ, ఈ వెయ్యేళ్ల కాలవ్యవధి గురించి ప్రస్తావిస్తూ ఆయన ఒకానొక దివ్యఫలకంలో: “ప్రతి వర్ష” మున “ఖురాన్ ననుసరించి పండ్రెండు మాసములు, బయాన్ ను అనుస రించి పంధొమ్మిది దినములు గల పంధొమ్మిది మాసములు ఉండు” నని పేర్కొన్నాడు. 

1852 సం. అక్టోబర్‌లో తెహరాన్‌లోని సీయాచల్‌లో బహాఉల్లా అందుకున్న భగవదావిష్కరణ సందేశమే ఆయన ప్రవక్తృత్వానికి నాంది. తదుపరి ప్రత్యక్షమయ్యే దివ్యావతారమూర్తి ఆగమనానికి ముందు, వేయి సంవత్సరాలకు పైగా గడవాలి.

63. ఇరాక్ నందు వసియించునప్పుడును, మరి ఆపై మార్మిక భూమి యందుండగను మీకు మేము ముందుగా హెచ్చరిక చేసినదియును, ఇప్పుడీ దేదీప్యమానస్థలినుండి హెచ్చరింపుచున్నది యును ఇదియే. ¶37
 
“మార్మికభూమి” అడ్రియానోపుల్ ను, “ఈ దేదీప్యమాన స్థలి” అక్కా ను సూచిస్తాయి.

64. పాండిత్యముచే గర్వమునొంది . . . తనను వెన్నంటివచ్చు పాదరక్షల సవ్వడిని వినినంతనే స్వీయౌన్నత్యమున . . .తానే యధికుడనని అహంకరించు నాతడు జనబాహుళ్యమున కలడు. ¶41

గతంలో తూర్పు దేశాలలో తమ మతనాయకులకు, తమకు మధ్యగల అంతరానికి సూచనగా, అనుయాయులు వారిని (మతనాయకులను) అనుసరించి, వెనుకగా ఒకటి రెండడుగులు దూరంగా నడవడం ఆనవాయితీగా ఉండేది.

65. నిమ్రోదు ¶41

ఈ దివ్యప్రవచనంలో ప్రస్తావితమైన నిమ్రోదు అనే పదం యూదు, ఇస్లాం సాంప్రదాయాలకు సంబంధిం చింది. ఇది అబ్రహామ్‌ను వేధించిన వాడూ, గర్వాతిశయానికి ప్రతిరూపమూ అయిన ఒక రాజు పేరు.

66. అఘ్సాన్ ¶42

అఘ్సాన్ (‘ఘస్న్’ కు బహువచనం) అంటే ‘శాఖలు’ అనే అర్ధం వచ్చే అరబ్బీ పదము - బహాఉల్లా తన మగసంతతిని ఈ పదంతో సూచించాడు. అది కేవలం వారసత్వాస్తు (మాన్యము)ల స్వభావాలనే కాక బహాఉల్లా, అబ్దుల్-బహాల స్వర్గారోహ ణానంతరం అధికారిక వారసత్వాన్ని కూడా సూచిస్తున్నది (చూ. వివరణ 145). తన ఒడంబడిక గ్రంథంలో బహాఉల్లా తన జ్యేష్ఠపుత్రుడైన అబ్దుల్-బహాను దివ్యధర్మానికి నేతగాను, తన ఒడంబడికకు కేంద్రంగాను, నియమించాడు. అబ్దుల్-బహా తన మరణశాసనంలో తన జ్యేష్ఠదౌహిత్రుడైన షోఘి ఎఫెండీని దివ్యధర్మానికి సంరక్షకునిగా, ప్రధానాధిపతిగా నియమించాడు.

కితాబ్-ఎ-అఖ్దస్‌లోని ఈ గ్రంథభాగం, ఎంచుకోబడిన అఘ్సాన్‌ల ధర్మాధికార వారసత్వం గురించి, ధర్మసంరక్షక వ్యవస్థ గురించి తెలియచేస్తుంది. అలాగే, వాటి క్రమానికి భంగం వాటిల్లే ఆస్కారాన్ని కూడా సూచిస్తుంది. ఈ గ్రంథభాగంలో పేర్కొన్నట్లుగా వ్యవస్థలు రూపుదిద్దుకోవటానికి పూర్వమే, 1963 లో విశ్వన్యాయ మందిర స్థాపనకు ముందే ఈ అఘ్సాన్‌ల వంశక్రమం అంతరించింది (చూ. వివరణ 183).

67. బహాజనులకు . . . మరలింపబడును. ¶42

విశ్వన్యాయ మందిర సంస్థాపనకు మునుపే అఘ్సాన్ వంశక్రమం అంతరించే అవకాశాన్ని బహాఉల్లా ఊహించాడు. అటువంటి పరిస్థితిలో “ధర్మాదాయాలు బహాజనులకు మరలింపబడు” నని ఆయన నిర్ధారించాడు. “బహాజనులు” అను పదము బహాయి పవిత్ర రచనలలో విభిన్నభావాలతో అనేక పర్యాయాలు ఉపయోగించబడింది. ఈ సందర్భంలో బహాజనులు “ఆయన యాజ్ఞతో గాని మాట్లాడని వారు” గా, “దేవుడి ఫలకము నందు నిర్దేశించబడిన దానిని యనుసరించి తప్ప వేరుగా తీర్మానించని వారు” గా వర్ణించబడ్డారు. 1957 లో షోఘిఎఫెండీ మరణానంతరం, 1963లో విశ్వన్యాయ మందిరం ఎన్నికయ్యేంతవరకు, భగవంతుని దివ్యధర్మవ్యవహారాలకు దివ్యధర్మహస్తములు మార్గదర్శకత్వాన్ని వహించారు (చూ. వివరణ 183).

68. మీ శిరములకు సంపూర్ణ ముండన మొనరింపవలదు. ¶44

శిరోముండనము కొన్ని మతాలలో వాంఛనీయ సాంప్రదాయం. అయితే, బహాఉల్లా శిరోముండనాన్ని నిషేధించాడు; కాగా కితాబ్-ఎ-అఖ్దస్‌లోని ఈ దివ్యప్రవచనం, సురీహ్-ఇ-హజ్ అనే ఫలకంలో షిరాజ్‌లోని పావనగృహ సందర్శన నిమిత్తమై శిరోముండనాన్ని చేయించుకోవలెననన్న నియమాన్ని రద్దు చేసినట్లైంది.

69. కేశములను కర్ణసీమలను మించి పెరగనీయుట యుక్తము కాదు. ¶44

కర్ణసీమలను దాటే విధంగా కేశాలను పెంచరాదన్న శాసనం కేవలం పురుషులకు మాత్రమే వర్తిస్తుందని షోఘి ఎఫెండీ వివరించాడు. ఈ శాసనాన్ని అమలు పరచడం గుఱించి విశ్వన్యాయమందిరం వివరణను ఇవ్వవలసి ఉంటుంది.

70. చోరునికి ప్రవాసమును, కారాగారవాసమును శిక్షగా నిర్ణయింప బడినవి. ¶45

నేరతీవ్రతననుసరించి శిక్షలను, జరిమానాలను, నిర్ణయించవలసిన అధికారం న్యాయమందిరమునకు ఉంటుందని బహాఉల్లా వివరించాడు (చూ. ప్ర.-జ. 49). చౌర్యానికి విధింపబడిన శిక్షలు, భావిసమాజ పరిస్థితి దృష్ట్యా నిర్దేశింపబడినాయి. భవిష్యత్తులో విశ్వన్యాయ మందిరము వాటిని పూరించి అమలు చేస్తుంది.

71. నేరము మూడవమారు పునరావృతమయ్యెనేని, భగవంతుని నగరములలోనికిని, ఆయన రాజ్యముల లోనికిని అనుమతింప బడకుండునటుల, ఆతని నుదుటిపై నొక ముద్రను వేయుడు. ¶45

తస్కరుని నుదుటిపై ఒక చిహ్నాన్ని ముద్రించడం ద్వారా, ప్రజలకు అతని వ్యక్తిత్వాన్ని వ్యక్తపర్చడమే దీని ఉద్దేశ్యం. అటువంటి ముద్ర స్వభావం, దానిని ఎలా ముద్రించాలి, ఎంత కాలం పాటు అత డాముద్రను భరించాలి, ముద్రను తొలగించడానికి అనుకూలించే పరిస్థితులు, చౌర్యపు తీవ్రతకు సంబం ధించిన వివిధ స్థాయిలు మొ. అంశాలను విశ్వన్యాయమందిరము వారు నిర్దేశించగలరు.

72. ఎవ్వరైనను సువర్ణ, రజత పాత్రముల నుపయోగింప నెంచినచో స్వేచ్ఛగా వాడుకొనవచ్చును. ¶46

వెండితోను, బంగారంతోను చేయబడిన వంటపాత్రల ఉపయోగాన్ని బయాన్‌లో అనుమతిస్తూ, మత పరంగా వీటి వినియోగంపై గల నిషేధం ఖురాన్ ద్వారా వచ్చిన విస్పష్టాదేశం కాదని, కేవలం ముస్లిమ్ సాంప్రదాయజనితమని త్రోసిపుచ్చాడు బాబ్. ఆయన గావించిన ఈ నిబంధనను బహాఉల్లా ఆమోదించాడు.

73. నలుగురితోకూడి ఆహారస్వీకరణము గావించునపుడు పాత్రముల, పళ్లెరముల యందలి పదార్ధముల లోనికి చేతులను జొప్పింతురేమో, జాగరూకులు కండు. ¶46

షోఘి ఎఫెండీ ఈ నిషేధాన్ని “ఆహారంలో చేతులు జొప్పించుట” అని నిర్వచించాడు. ప్రపంచంలోని అనేక దేశాలలో - అనేకమంది కలిసి ఒకే పాత్రలో ఆహారాన్ని వడ్డించుకుని, చేతులతో తినే ఆనవాయితీ ఉన్నది.

74. అత్యంత పరిశుభ్రతకనువగుతీరుల నవలంబింపుడు. ¶46

నైర్మల్యం, పరిశుభ్రతల ప్రాముఖ్యాన్ని ప్రస్తావించే అనేక గ్రంథభాగాలలో ఇది ప్రథానమైనది. అరబ్బీ మూలపదం ‘అతాఫా’ కు - యిక్కడ ఇవ్వబడిన “నైర్మల్యం” అనే అర్ధమే గాక, మనోజ్ఞం, సౌందర్యం, పరిశుభ్రత, నాగరికత, విధేయత, సౌమ్యత, సున్నితం, ఔదార్యం అనే అర్థాలతోపాటుగా చమత్కృతి, పరిశుద్ధం, పావనం, పవిత్రం అనే విస్తృత భావార్ధశ్రేణి ఉన్నది. కితాబ్-ఎ-అఖ్దస్ లో ఈ పదం, సంద ర్భోచితంగా “నైర్మల్యము” లేదా “పరిశుభ్రత” గా అనువదించబడినది.

75. భగవంతుని దివ్యధర్మపు టుషోదయోత్పన్న స్థానమగు ఆయనకు భాగస్థుడెవ్వడును లేడు. ¶47
 
ఇష్రాఖత్ అనే దివ్యఫలకంలో బహాఉల్లా పరమోన్నత నిష్కళంకత్వము, భగవంతుని దివ్యావతారాల వశమై ఉన్నదని నిర్ధారించాడు.

సమ్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అనే గ్రంథంలోని 45వ అధ్యాయం, కితాబ్-ఎ-అఖ్దస్‌లో ఈ దివ్యప్రవచనానికి అబ్దుల్-బహా ఇచ్చిన వివరణకై వినియోగించబడినది. ఆయన ఈ అధ్యాయంలో ఇతర విషయాలతో పాటు, భగవంతుని దివ్యావతారాలలో నిష్కళంకత్వపు విశేష అవిభాజ్యతను ప్రస్ఫుటంగా ప్రస్తావిస్తూ “వారి నుండి వెలువడునదేదైనను సత్యస్వరూపమూ, యదార్ధానుసరణీయమూ” నని, “వారు పూర్వశాసనముల ఛాయలక్రింద ఉండ” రనీ, అంతే కాక, “వా రేది నుడివిను అది దైవవాక్కేననియు, వా రేదొనర్చినను అది ధార్మిక ప్రక్రియయే” ననీ వివరించాడు.

76. పఠన, లేఖన కళను . . . తన కుమారునికిని, కుమార్తెకును నేర్పింపవలసిన బాధ్యత ప్రతి తండ్రి కిని విధియింపబడినది. ¶48

అబ్దుల్-బహా తన ఫలకాలలో బాలల విద్య అన్నది కేవలం తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల వహించవలసిన బాధ్యతే కాక, బాలికలే రేపటి మాతృమూర్తులు, ఆ తల్లులే నూతనతరానికి ఆదిగురువు లౌతారు కనుక “విద్యా, సంస్కారాలు కుమారులకన్న కుమార్తెలకే అత్యవసర” మని విస్పష్టంగా సూచించాడు. అందుకే ఏ కుటుంబానికైనా పిల్లలందరినీ చదివించడం వీలుకాకపోతే, బాలికల విద్యకే ప్రాధాన్యత నివ్వాలి. ఎందుకంటే, విద్యావతులైన తల్లులవల్ల విజ్ఞాన ఫలాలు అత్యంత ప్రభావంతో, త్వరితగతిన సమాజమంతటా విస్తరిస్తాయి.

77. ప్రతి జారుడును, జారిణియును న్యాయమందిరమునకు చెల్లింపవలసిన అపరాధ రుసుమును . . . తొమ్మిది మిష్కల్‌ల సువర్ణముగా భగవంతుడు నిర్దేశించినాడు. ¶49

ఇక్కడ “జారత్వము” గా అనువదింపబడినా, ఆయన ఫలకాలలో విస్పష్టార్థంలో, వివాహితుల లేదా అవివాహితుల మధ్య అక్రమ లైంగిక సమాగమాన్ని సూచిస్తుంది. (ఈ పదం యొక్క నిర్వచనానికై చూ. వివరణ 36). అవివాహితులమధ్య లైంగిక సంపర్కము జరిగినట్లైతే, అటువంటి వ్యక్తులకు ఇక్కడ విధించబడిన శిక్ష వర్తిస్తుందని అబ్దుల్-బహా వివరించాడు. వివాహితుడు లేదా వివాహితురాలు చేసే వ్యభిచారానికి తగిన అపరాధ శుల్కాన్ని నిర్ణయించే అధికారం విశ్వన్యాయమందిరము వారికి ఉన్నదని కూడా సూచించాడాయన (చూ. ప్ర.-జ. 49).

ఒకానొక ఫలకంలో అబ్దుల్-బహా - నైతిక శాసనోల్లంఘనానికీ, అదే విధంగా ఇక్కడ వివరింపబడిన ఈ అపరాధశుల్కానికీ సంబంధించిన ఆధ్యాత్మిక, సామాజిక అనువర్తనలను పేర్కొన్నాడు. నేరాన్ని నిరూపించి, అపరాధశుల్కాన్ని విధించి, దోషులను బహిర్గతపరచి, ఇటువంటి దుష్కృత్యం భగవంతుని దృష్టిలో లజ్జాకరమని - తద్వారా వారు సమాజం దృష్టిలో అవమానానికి, తలవంపులకు గురౌతారని - అందరకు స్పష్టపరచటమే ఈ శాసనోద్దేశ్యమని ఆయన సూచించాడు. అలా బహిర్గతం చేయబడటమే కఠినశిక్ష అని ఆయన నొక్కిచెప్పాడు. 
 
ఈ దివ్యప్రవచనంలో ప్రస్తావితమైన న్యాయమందిరం బహుశః ఇప్పుడు స్థానిక ఆధ్యాత్మిక సభగా వ్యవహృతమౌతున్న స్థానిక న్యాయ మందిరమే అయి ఉండాలి.

78. తొమ్మిది మిష్కల్‌ల సువర్ణము . . . వారా నేరమును పునరావృత మొనరించిరేని అది రెండింత లగును. ¶49

మిష్కల్ అనేది బరువుకు సంబంధించిన ప్రమాణం. మధ్య ప్రాచ్యంలో చెలామణిలో ఉన్న మిష్కల్, 24 నాఖుద్ లకు సమానం. అయితే బహాయిలు వ్యవహరించే మిష్కల్ మాత్రం “బయాన్ నిర్దేశాన్ని అనుసరించి” (చూ. ప్ర.-జ. 23) 19 నాఖుద్‌లకు సమానము. ఇటువంటి 9 మిష్కల్‌ల బంగారం యొక్క బరువు 32.775 గ్రాములకు లేదా 1.05374 ఔన్సులకు సమానం.

అపరాధ శుల్కాన్ని అనువర్తింపచేయడానికి సంబంధించి బహాఉల్లా విస్పష్టమైన వివరణ నిస్తూ, తదుపరి నేరాలకు విధించే ప్రతి అపరాధశుల్కము, మొదట విధింపబడిన దానికి రెట్టిం పవుతుం దన్నాడు (చూ. ప్ర.-జ. 23). అలా విధింపబడే అపరాధ శుల్కము గుణోత్తర శ్రేఢిలో హెచ్చుతుంది. ఈ అపరాధశుల్కపు విధింపు భావి సమాజ పరిస్థితికై ఉద్దేశించబడింది. అప్పుడు విశ్వన్యాయ మందిరము వారిచే ఈ శాసనశేషం పూరింపబడి అమలు చేయబడుతుంది.

79. సంగీతశ్రవణమును, గానమును మీకు శాసనబద్ధము గావించినాము. ¶51

“కొన్ని ప్రాచ్యదేశముల యందున సంగీతము నిందార్హమైనదిగా గణియింప బడిన” దని అబ్దుల్-బహా వ్రాశాడు. ఈ విషయంపై ఖురాన్‌లో ఎటువంటి మార్గదర్శనమూ లేకపోయినా, కొందరు మహమ్మ దీయులు సంగీతశ్రవణాన్ని శాసనవిరుద్ధంగా పరిగణిస్తున్నారు. మరికొందరు కొన్ని పరిమితులకు, ప్రత్యేక నియమాలకు లోబడి సంగీతాన్ని సహిస్తున్నారు.

బహాయి రచనలలో సంగీతాన్ని సంకీర్తించే గ్రంథభాగాలనేకం ఉన్నాయి. ఉదాహరణకు “గాత్రజనిత మైనను, వాద్యజనితమైనను సంగీతమేదైనను ఆత్మకును, మనస్సునకును ఆహారము వంటి” దని అబ్దుల్-బహా నొక్కిచెప్పాడు.

80. ఓ న్యాయ పురుషులారా ! ¶52

విశ్వన్యాయమందిర సభ్యత్వము పురుషులకు మాత్రమే పరిమితం చేయబడి యుండగా, ద్వితీయశ్రేణి న్యాయమందిరముల (ఇవి ప్రస్తుతం జాతీయ, స్థానిక ఆధ్యాత్మిక సభలుగా పేర్కొనబడుచున్నవి) సభ్యత్వానికి స్త్రీ, పురుషు లిరువురికీ అర్హత ఉన్నదని అబ్దుల్-బహా, షోఘి ఎఫెండీల రచనలు వివరిస్తున్నాయి.

81. ఒకనిని గాయపరచినందుకు లేక కొట్టినందుకు విధియింపబడు అపరాధశుల్కము గాయపు తీవ్రతపై నాధారపడియుండును; ఏలయన దివ్యన్యాయాధీశుడు ప్రతి స్థాయికిని, విశేష పరిహారమును సూచించినాడు. ¶56

గాయపడినవానికి చెల్లింపవలసిన అపరాధశుల్కపు పరిమితి, అతని “గాయపు తీవ్రత” పై ఆధారపడి ఉంటుందని బహాఉల్లా వివరించాడు; అయినా ఆ పరిమితులను గాని, నష్టపరిహార పరిమాణాలను గాని, ఆయన ఎక్కడా వ్రాసిపెట్టినట్టు లేదు. వీటిని నిర్ణయించే బాధ్యత విశ్వన్యాయ మందిరము వారికి సంక్రమింపచేయబడింది.

82. మాసమునకొక్క పర్యాయము విందును గావించుట . . . నిశ్చయముగ మీకు విధియింపబడినది. ¶57 

బహాయి మాసోత్సవాలకూ, 19వ రోజు విందు నియమానికీ ప్రాతిపదిక ఈ ఆదేశమే. అరబ్బీ బయాన్‌లో బాబ్ - ప్రతి పంధొమ్మిది రోజులకొకసారి ఒకచోట సమావేశమై అతిధిసత్కారం గావించాలని, సౌహార్ద్రంతో మెలగాలని తన అనుయాయులకు ఆదేశించాడు. బహాఉల్లా దీనిని ఆమోదించి, సమైక్యతకు దోహదం చేసే ఇటువంటి సందర్భాల పాత్రను ఇక్కడ గుర్తించాడు.

ఆయన అనంతరం అబ్దుల్-బహా, షోఘీ ఎఫెండీలు వ్యవస్థాత్మకంగా ఈ ఆదేశానికి గల ప్రాధాన్యతను విశదీకరించారు. ఈ సమావేశాల ఆధ్యాత్మిక లక్షణాలను అబ్దుల్-బహా ఎంతగానో నొక్కిచెప్పాడు. షోఘి ఎఫెండీ ఈ విందుకు సంబంధించిన ఆధ్యాత్మిక, సామాజిక అంశాలను విస్తృతంగా వివరించడంతోపాటు, ఈ సమావేశాలకు గల పాలనాస్వభావాన్ని ప్రవృద్ధం గావించి, విందులను క్రమరీతిలో వ్యవస్థీకరించి, బహాయి సమాజ వ్యవహారాలపై సమాచారాలు, సందేశాలతో పాటుగా సంప్రదింపులకు కూడా వాటిలో అవకాశాన్ని ఏర్పరిచాడు. ఈ ఆజ్ఞ అనివార్యమా అన్న ప్రశ్నకు బదు లిస్తూ, అనివార్యం కాదన్నాడు (చూ. ప్ర.-జ. 48) బహాఉల్లా. తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో షోఘీ ఎఫెండీ యింకా యిలా అన్నాడు: 

19వ రోజు విందు సమారాధనలకు హాజరు కావడం అనివార్యం కాదు కాని అతి ముఖ్యం; అటువంటి సమావేశములకు హాజరు కావడం తన బాధ్యతగా, సదవకాశంగా ప్రతి విశ్వాసి భావించాలి.

83. మీరు ఆహారయోగ్యములగు మృగములనో, పక్షులనో వేటాడవలసి వచ్చెనేని, వానిని వెన్నంటు నపుడు భగవన్నామమును స్మరియింపవలె; ఏలయన, అటుపై పట్టుబడినదేదైనను - అది విగతజీవిగ దొరికినను సరియే - మీకు ఆమోదనీయమే యగును. ¶60

ఈ శాసనం ద్వారా, వేటకు సంబంధించిన పూర్వమతసాంప్రదాయాలవిధి విధానాలను సులభతరం గావించాడు బహాఉల్లా. వేటకు ఉపకరించే ధనుర్బాణాలు, తుపాకులు వంటి ఆయుధాలు ఈ ఆజ్ఞప్రకారం సయుక్తములు గావింపబడ్డాయని, అయితే, అంతకు మునుపే వలలలో, బోనులలోబడి మృతి చెందిన వాని మాంసాన్ని ఆరగించడం నిషిద్ధమని కూడా ఆయన పేర్కొన్నాడు (చూ. ప్ర.-జ. 24).

84. మితిమీరి వేటాడతగదని ¶60

వేటాడటాన్ని బహాఉల్లా నిషేధించకపోయినా, అవసరానికి మించి వేటాడవద్దని హెచ్చరించాడు. కాలక్రమంలో విశ్వన్యాయమందిరం, ‘మితిమీరి వేటాడట’ మంటే ఏమిటో నిర్ధారిస్తుంది.

85. కాని అన్యుల యాస్తిపై వారికెట్టి హక్కును ఆయన యనుగ్రహింప లేదు. ¶61

బంధువర్గం పట్ల వితరణ చూపాలన్న బహాఉల్లా ఆదేశం, పరుల ఆస్తిపై వారికి (బంధువులకు) ఎటువంటి హక్కును సంక్రమింపచేయదు. మహమ్మదు ప్రవక్త వంశస్థులైన వారసులకు, సుంకములలో కొంత భాగానికి హక్కును కల్పించబడిన షియా ముస్లిం ఆచారానికి ఇది విరుద్ధమైనది.

86. ఎవ్వడైనను ఉద్దేశ్యపూర్వకముగ నొక గృహమును అగ్నికి ఆహుతి గావించెనేని, మీరును వాని నట్లే దహియింపుడు; బుద్ధిపూర్వకముగ నెవ్వడైనను యింకొకని ప్రాణమును తీసెనేని మీరును వానిని పరిమార్పుడు. ¶62

హత్యకు, గృహదహనానికి మరణశిక్షను కాని, దాని స్థానంలో ఆజన్మ కారాగారవాసాన్ని కాని విధించవచ్చునని బహాఉల్లా సూచించాడు (చూ. వివరణ 87).

కక్షకు, శిక్షకు గల భేదాన్ని అబ్దుల్-బహా తన ఫలకాలలో వివరించాడు. ప్రతీకారం తీర్చుకునే హక్కు వ్యక్తులకు లేదని, ప్రతీకారం భగవంతుని దృష్టిలో నీచమైనదని, శాసనబద్ధమైన దండన ఉద్దేశ్యం చేసిన నేరానికి పగతీర్చుకోవడం కాదని, చేసిన నేరానికి అపరాధశుల్కాన్ని విధించడం ఉంటుందని ధృవీకరించాడాయన. సమాజ సభ్యులను, సమాజపు మనుగడను కాపాడేందుకై నేరస్తులను శిక్షించే హక్కు సమాజానికి ఉంటుందని సమ్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ లో ఆయన నిర్ధారణగా పేర్కొన్నాడు.
 
ఈ ఏర్పాటుకు సంబంధించి, షోఘి ఎఫెండీ, తన తరఫున వ్రాయబడిన లేఖలో ఇలా వివరణ నిచ్చాడు :

అఖ్దస్‌లో బహాఉల్లా నరహత్యకు మరణ దండన విధించాడు. అయినప్పటికీ, దానికి ప్రత్యామ్నాయంగా జీవితఖైదును కూడా అనుమ తించాడు. ఈ రెండింటి ఆచరణము ఆయన శాసనాన్ని అనుసరించే జరుగుతుంది. మన పరిమిత పరిజ్ఞానానికందనపుడు, మనలో కొందరం, దీని వివేకాన్ని అవగాహన చేసుకోలేక పోవచ్చు; కాని ఈ సమస్త ప్రపం చానికి ముక్తిప్రదాయకాలైన ఆయన వివేకము, ఆయన కారుణ్యము, ఆయన న్యాయములు పరిపూర్ణములని తెలిసిన మనం దానిని సమ్మతించవలె. ఏ మానవుడైనా పొరపాటున మరణానికి గురికావించబడితే, సర్వశక్తివంతుడైన దేవుడు అనంతర ప్రపంచంలో, ఈ మానవ తప్పిదానికి, వేనవేల ప్రతిఫలాలనొసగునని విశ్వసింపలేమా? కేవలం ఎంతో అరుదైన సందర్భాలలో అమాయకులు శిక్షింపబడతారన్న నెపంతో శ్రేయస్కరములైన శాసనాలను విడనాడలేము. 

భావి సమాజపు స్థితికై నిర్దేశింపబడిన బహాయి శిక్షా శాసనంలో నరహత్య, గృహదహన నేరాలకు విధింపబడే శిక్షల వివరాలను బహాఉల్లా పేర్కొనలేదు. నేర సమవస్థ, పరిహారం చేయదగిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవచ్చునా, నిర్దేశింపబడిన రెండు శిక్షలలో ఏది సమంజసం వంటి వివిధ వివరాలను, పరిస్థితుల ప్రాబల్యాన్ని బట్టి, శాసనాలు చేయవలసివచ్చినప్పుడు, విశ్వన్యాయ మందిరము వారు నిర్ణయిస్తారు. శిక్షను ఏ విధంగా నిర్వహించాలన్నది కూడా విశ్వన్యాయమందిర నిర్ణయానికే వదలివేయబడింది.

ఇక గృహదహనానికి సంబంధించి : అది - దగ్థం గావించబడిన గృహం ఏది అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఖాళీగా ఉన్న గిడ్డంగిని తగబెట్టడానికీ, బాలబాలికలతో నిండిఉన్న పాఠశాలను తగలబెట్టడానికీ మధ్య - నేరతీవ్రత పరంగా - నిస్సందేహంగా, ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

87. గృహదగ్ధ కారకునకును, హంతకునకును ఆజన్మ కారావాసమును మీరు విధియించినచో నది దివ్యగ్రంథ నియమముల ప్రకార మామోదనీయమే. ¶62

అఖ్దస్‌లోని ఈ దివ్యప్రవచనం గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా షోఘి ఎఫెండీ, మరణదండన అనుమతించబడినప్పటికీ, “దండన తీవ్రతను తగ్గించటానికి” దాని స్థానంలో “ఆజన్మకారాగారశిక్ష” విధించబడిందని ధృవీకరించాడు. “మన వివేచన నుపయోగించి, తన శాసనం విధించిన పరిమితులకు లోబడి వీటిలో దేనినైనా నిర్వర్తించే అవకాశాన్ని బహాఉల్లా మనకిచ్చా” డనికూడా ఆయన వివరించాడు. ఇందుకు సంబంధించిన బహాయి శాసనాన్ని అమలు చేయటానికి విశేష మార్గదర్శనం లేనప్పుడు భవిష్యత్తులో ఈ విషయంలో విశ్వన్యాయమందిరం శాసనం చేయవలసి ఉంటుంది.

88. పరమేశ్వరుడు మీకు వివాహమును నిర్దేశించినాడు. ¶62

భగవంతుడు ఈ శాసనమును స్థాపించి, దీనిని “సంక్షేమ మోక్షాలకు దుర్గంగా చేశా” డని తన దివ్యఫలకాలలో ఒకదానిలో బహాఉల్లా వివరించాడు.

వివాహానికి, వివాహానికి అనుమతింపదగిన పరిస్థితుల గురించి సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఇ. 1. అ.-అం. , కితాబ్-ఎ-అఖ్దస్ లోని నియమాలను సంక్షిప్త పరుస్తుంది. ఇంకా ప్రశ్నలు - జవాబులు (చూ. ప్ర.-జ. 3, 13, 46, 50, 84, 92) లోను, వివాహ నిశ్చితార్థ శాసనము (చూ. ప్ర.-జ. 43) లోను, భార్య లేదా భర్త సుదీర్ఘకాలం పాటు అగుపించని పక్షంలో పాటించవలసిన విధానం (చూ. ప్ర.-జ. 4, 27) లోను, ఇంకా వివిధ ఇతర పరిస్థితులలోను (చూ. ప్ర.-జ. 12, 47) (ఇంకా చూ. వివరణలు 89-99) కూడా గమనించవచ్చు.

89. ఇరువురుకన్న ఎక్కువమంది భార్యలను వివాహమాడుదురేమో, జాగ్రత్త. ఎవ్వడైనను భగవంతుని పరిచారికలయం దొక్కరిని జీవితభాగస్వామిగా పరిగ్రహించి సంతుష్టి నొందెనేని ఆతడు, ఆమె - యిరువురును సామరస్యముతో జీవింతురు. ¶63

కితాబ్-ఎ-అఖ్దస్ ద్విభార్యత్వాన్ని అనుమతించినా, ఏకపత్నీత్వం వల్లనే సంతుష్టీ, సామరస్యమూ ఒనగూడుతాయని బహాఉల్లా ఉద్బోధిస్తున్నాడు. మరో దివ్యఫలకంలో: “తనకు తన భాగస్వామికి సౌఖ్యమును కలిగించు” రీతిన వ్యక్తి వ్యవహరించ వలసిన ఆవశ్యకతను నొక్కిచెప్పా డాయన. కితాబ్-ఎ-అఖ్దస్ లో ఏకపత్నీత్వమే విధించ బడిందని బహాయి పవిత్ర రచనలకు అధీకృత వ్యాఖ్యాత అయిన అబ్దుల్-బహా వివరించాడు. ఈ ఫలకంతో సహా మరెన్నో ఫలకాలలో ఆయన ఈ అంశాన్ని వివరించాడు :

ఒకే అర్ధాంగితో తృప్తినొందుట స్పష్టంగా ఏర్పరచడమైనది కాన భగవంతుని శాసనందృష్ట్యా బహుభార్యాత్వము అనుమతింపబడలేదని మీరు గ్రహించండి. ద్వితీయార్ధ్దాంగిని స్వీకరించడమన్నది యిరువురు భార్యలకు సర్వావస్థల యందునను సమముగా సమతా న్యాయములను అందించు అంశముపై ఆధారపడి యుండును. భార్యలిరువురకు సమానన్యాయుమును, ధర్మమును నెరవేర్చుట ఖచ్చితముగా దుస్సాధ్యము. కావున బహుభార్యాత్వము నిషేధింప బడినదనుటకు స్పష్టమైన ఆధారం ఈ దుస్సాధ్య నియమమే. అందుకే ఒక పురుషునికి ఒకరికంటే అధికంగా భార్యలుండుట అనుమతింపబడలేదు.

బహు భార్యాత్వమన్నది మానవసమాజంలో ఎక్కువగా పాటింపబడుతున్న అత్యంత పురాతనాచారం. భగవంతుని దివ్యావతారమూర్తులు, క్రమేపీ ఏకపత్నీత్వాన్ని ప్రవేశపెట్టి సాధించారు. ఉదాహరణకు : ఏసుక్రీస్తు - బహుభార్యత్వాన్ని నిషేధించలేదు, కాని - వ్యభిచరించిన పక్షంలో తప్ప - విడాకులను రద్దుపరిచాడు. మహమ్మద్ - పత్నుల సంఖ్యను నాలుగుకు పరిమితం చేసినా బహు భార్యాత్వ నియమాన్ని న్యాయసంభావ్యత ఆధారంగా చేశాడు; అంతేకాక విడాకులను పునఃప్రవేశపెట్టి అనుమతించాడు; బహాఉల్లా - ముస్లిం సమాజంలో ఉంటూనే, దినదినాభివృద్ధి చెందుతున్న తన సంకల్పావిష్కరణను, తన వివేక సిద్ధాంతాలను అనుసరించి, క్రమేపీ ఏకపత్నీత్వాన్ని ప్రతిపాదించాడు. ఆయన వాస్తవానికి, తన అనుయాయులకు తన దివ్యరచనల అర్థాన్ని వివరించేందుకై నిష్కళంక వ్యాఖ్యాతను ప్రసాదించి, కితాబ్-ఎ-అఖ్దస్‌లో బాహ్యంగా ఇరువురు భార్యలను గైకొనడానికి అనుమతిని ఇచ్చినప్పటికీ, అందుకు వర్తించే నియమాల దృష్ట్యా, ఈ శాసనపరమార్థం ఏకపత్నీత్వమేనని విశదీకరిం చేందుకు అబ్దుల్-బహాకు వీలు కలిగింది.

90. తన సేవకై యొక సేవికను గైకొను నాతడు సముచితరీతిన వర్తింపవలె. ¶63

ఇంటిపనులకై పురుషుడు ఒక సేవికను నియమించుకొనవచ్చునని బహాఉల్లా సెలవిచ్చాడు. షియా ముస్లిం సంప్రదాయం ప్రకారం ఇది ఆమెతో వైవాహిక ఒప్పందం కుదుర్చుకుంటే తప్ప వీలయ్యేది కాదు. “ఏ యితర భృత్యవర్గమైనను - యువతిగాని, వృద్ధురాలు గాని - వేతన లేదా వస్తువినిమయముగ చేయునట్టిదే” నని “సేవ” ను ఉగ్గడిస్తూ బహాఉల్లా ఈ ప్రవచనంలో సూచించాడు. (చూ. ప్ర.-జ. 30). తన సేవికపై యజమానికి ఎటువంటి లైంగికపరమైన అధికారాలు లేవు. స్త్రీని కొనుగోలు చేయడం నిషిద్ధం (చూ. ప్ర.-జ. 30) కనుక, ఆమె “తన యిచ్చ వచ్చినపుడు తనకొక భర్త నెంచుకొనవచ్చును”.

91. మీకిది నాయానతి; మీకు సహాయకారియగుటకై దీనిని స్థైర్యముతో పాలింపుడు. ¶63

కితాబ్-ఎ-అఖ్దస్ నందు వివాహం విధించబడినప్పటికీ, అది అనివార్యం కాదని బహాఉల్లా స్పష్టీకరించాడు (చూ. ప్ర.-జ. 46). షోఘి ఎఫెండీ కూడా, తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో, “వివాహం ఏ విధంగాను అనివార్యము కా” దని ప్రకటించి, “వైవాహిక జీవితం నెరపుటయా, బ్రహ్మచర్యము నవలంబించుటయా అన్నది ఆయా వ్యక్తులు నిర్ణయించుకోవలసిన అంశం” అని కూడా ధృవీకరించాడు. ఎవరైనా తన భాగస్వామిని ఎంచుకునేందుకై సుదీర్ఘకాలం వేచి ఉండవలసి రావడం, లేదా చివరికి ఒంటరిగానే ఉండిపోవడం సంభవిస్తే, దాని అర్ధం - ఆతను తన ఆధ్యాత్మిక జీవన పరమార్ధాన్ని పరిపూర్తిచేయలేకపోయాడని కాదు.

92. అది వారి జననీజనకుల సమ్మతిన జరుగవలెనని మేము నియమబద్ధము గావించినాము. ¶65

తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో, షోఘి ఎఫెండీ ఈ శాసననియమం గురించి యిలా వ్యాఖ్యానించాడు :
 
జీవించియున్న తల్లిదండ్రుల సమ్మతి బహాయి వివాహానికి అత్యవసరమని బహాఉల్లా వెల్లడిపచాడు. తల్లిదండ్రులు బహాయిలైనా, బహాయేతరులైనా, విడాకులు తీసుకున్నా, తీసుకొనకపోయినా ఈ నియమం వర్తిస్తుంది. సమాజపు కట్టుబాట్లకు, కుటుంబంలో అనుబంధాలను పటిష్టపరచడానికి, తమకు జన్మ నిచ్చి, తమ ఆత్మలను సృష్టికర్త వైపుకు అనంతయానానికి పురికొల్పిన తల్లిదండ్రుల యెడ పిల్లలు కృతజ్ఞతాభావాన్ని ప్రదర్శిం చేందుకూగాను ఈ మహాశాసనాన్ని రూపొందించా డాయన.

93. వివాహశుల్క సమర్పణ లేకుండ ఏ వివాహమును కుదర్పబడరాదు ¶66

సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఇ. 1. ఏ. 1-5 వరకు గల అంశాలు వివాహ శుల్కమునకు సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరిస్తాయి. బయాన్‌లో ఈ ఏర్పాట్లు ఇంతపు పూర్వమే పేర్కొనబడినాయి. 

వరుడు వధువుకు వివాహ శుల్కాన్ని సమర్పించాలి. ఈ శుల్కం నగరవాసులకు 19 మిష్కల్‌ల బంగారం గాను, గ్రామవాసులకు 19 మిష్కల్‌ల వెండి గాను నిర్ణయించబడింది (చూ. వివరణ 94). వివాహ సమయంలో వరుడు పూర్తి శుల్కాన్ని చెల్లించే స్థితిలో లేనపుడు వధువుకు ఒక వాగ్దాన పత్రాన్ని వ్రాసి యివ్వవచ్చునని బహాఉల్లా సూచించాడు (చూ. ప్ర.-జ. 39). 

బహాఉల్లా ఆవిష్కరణతో - ఎన్నో భావాలు, సాంప్రదాయాలు, వ్యవస్థలు పునర్నిర్వచింప బడ్డాయి, కొంగ్రొత్త అర్థాలు ఇవ్వబడ్డాయి. వాటిలో వివాహశుల్కం ఒకటి. ఈ వ్యవస్థ అతి ప్రాచీనమైనది, బహురూపములు గలది. కొన్ని దేశాలలో ఇది - వధువు తల్లిదండ్రులు వరునికి ఇచ్చే “వరకట్నం”; కాగా, మరికొన్ని దేశాలలో వధువు తల్లిదండ్రులకు, వరుడు చెల్లించే “కన్యాశుల్కం”; ఈ రెండు సందర్భాలలోను చెల్లింపబడే సొమ్ము తరచూ ఎక్కువగానే ఉంటుంది. బహాఉల్లా అలాంటి వైరుధ్యాలను రూపుమాపి, దానినొక లాంఛనంగా, ఒక పరిమిత విలువను వరుడు - వధువుకు ఇచ్చే కానుకగా మార్పు చేశాడు.

94. నగరవాసులకు పంధొమ్మిది మిష్కల్‌ల స్వచ్ఛమైన సువర్ణముగను, గ్రామీణులకు అంతే పరిమాణముగల రజతముగను.  ¶66 

వివాహశుల్కపు చెల్లింపును నిర్ధారించటానికి ప్రామాణికంగా తీసుకోవలసింది వరుని శాశ్వత నివాస ప్రదేశమని, వధువుది కాదని బహాఉల్లా పేర్కొన్నాడు.

95. ఈ మొత్తము నెవ్వరేని పెంచనెంచిన, దానినాతడు తొంభైఐదు మిష్కల్‌ల పరిమితికి హెచ్చింప తగదు. . . అయినను, అత్యల్పస్థాయి చెల్లింపుతో సంతుష్టుడయ్యెనేని, దివ్యగ్రంథానుసార మది యాతనికి సముచితమే యగును. ¶66 

వివాహశుల్కం గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా బహాఉల్లా యిలా ప్రవచించాడు : 

నగరముల యందుననూ, గ్రామముల యందునను వసియించు వారి  విషయమున, బయాన్ గ్రంథమునందు వెలువరించబడినదంతయును ఆమోదించబడినది. కావున దానిననుసరింపవలె. అయితే, కితాబ్-ఎ-అఖ్దస్ నందు కనిష్ఠస్థాయి ప్రస్తావితమైనది. బయాన్ గ్రంథమునందు గ్రామవాసులకు నిర్దేశింపబడినట్లు రజతమేనని దీని ఉద్దేశ్యము. ఇరుపక్షములును యిందుకు సమ్మతించినచో భగవంతునికి అత్యంతానందమగును. సమస్తప్రజల సౌఖ్యమును పెంపొందించి, వారి మధ్య ఐక్యత, ఒద్దికలను ఒనగూర్చుటయే దీని ఆశయం. కావుననే, ఈ విషయము నందెంత ఎక్కువ యోచించిన అంత యుచితము. బహా జనులు పరస్పరానురాగములను, నీతినిజాయితీలను కలిగి మెలగవలె. ప్రతియొక్కరి గౌరవమును, ప్రత్యేకించి దైవమిత్రుల ప్రయోజనములను దృష్టి యందుంచుకొన వలె.

తాను వెలువరించిన ఒకానొక ఫలకములో, అబ్దుల్-బహా వివాహశుల్కపు కనిష్ఠస్థాయి నిర్ధారణ గురించిన సముచిత విధానాలను సంక్షిప్త పరిచాడు. దిగువ ఉల్లేఖనములో ప్రస్తావించబడిన ఏకమాత్రపు చెల్లింపు “వాహెద్‌”. ఒక వాహెద్ 19 మిష్కల్ లకు సమానం. ఆయన యిలా అన్నాడు : 

నగరవాసులు బంగారమును, గ్రామవాసులు రజతమును చెల్లింపవలె. అది వరుడు ఇవ్వగలిగే వనరులపై ఆధారపడి యుండును. అతను పేదవాడైన ఒక వాహెద్‌ను చెల్లిస్తాడు. ఒక మోస్తరు వనరులుంటే రెండు వాహెద్‌లు, సంపన్నుడైతే నాలుగు వాహెద్‌లు, మిక్కిలి సంపన్నుడైతే ఐదు వాహెద్‌లు చెల్లిస్తాడు. వాస్తవానికి ఈ విషయం, వధూవరులకు, అటులనే, వారి తల్లిదండ్రుల మధ్య కుదరవలసిన ఒప్పందము. చేసికొనిన యొడంబడిక యేదైనను దానిని నెరవేర్చుట సముచితము. 

ఈ వివాహశుల్క విషయమైన ప్రశ్నలను శాసనాధికారం౎ గల విశ్వ న్యాయ మందిరము నకు విన్నవించుకోవాలని కూడా, ఈ ఫలకంలోనే విశ్వాసులకు సూచించాడు అబ్దుల్-బహా. “ద్వితీయ శ్రేణి అంశాలకు, గ్రంథములో లిఖిత పూర్వకంగా లేనట్టి ఇతర అంశములకు సంబంధించి శాసనములు చేయగల కూటమి ఇది” అని కూడా ఆయన ప్రస్ఫుటంగా పేర్కొన్నాడాయన.

96. తన సేవకులయం దెవడైనను ప్రయాణము చేయనెంచిన, ఆతడు తాను గృహమునకు తిరిగి వచ్చు సమయమును తన యర్ధాంగికి నిర్దుష్టముగ తెలుపవలె. ¶67

భర్త తాను తిరిగివచ్చే సమయాన్ని భార్యకు తెలియజెప్పకనే, ఇల్లు వీడి వెళ్లిపోతే భార్యకు అతని సమాచారం అందక, జాడ తెలియరానప్పుడు -- కితాబ్-ఎ-అఖ్దస్‌లో నిర్దేశింప బడిన ఈ శాసనం గురించి భర్తకు తెలిసిఉన్న పక్షంలో, భార్య ఒక సంవత్సర కాలం నిరీక్షించి, పునర్వివాహం చేసుకోవచ్చునని బహాఉల్లా సెలవిచ్చాడు. అయితే ఈ శాసనం గురించి భర్తకు తెలిసి ఉండని పక్షంలో, అతని జాడ తెలిసేంత వరకు భార్య నిరీక్షించాలి (చూ. ప్ర.-జ. 4).

97. . . . ఆమె నవమాసముల పర్యంతము నిరీక్షించుట యుక్తము; తదనంతర మామె పున ర్వివాహము చేసుకొనుట కెట్టి యవరోధమును ఉండబోదు. ¶67

భర్త నిర్ణీత సమయానికి తిరిగి రాకపోవడమో, లేదా ఆలస్యానికి కారణాన్ని భార్యకు తెలియపరచడంలో విఫలుడు కావడమో జరిగితే, నవమాసములు (అంటే తొమ్మిది నెలలు) నిరీక్షించి, ఆ పై పునర్వివాహం చేసుకోవడానికి - మరికొంత కాలంపాటు ఎదురు చూడటం సముచితమే అయినప్పటికీ - ఆ భార్య స్వతంత్రురాలు. (బహాయి పంచాంగం కొరకై చూ. వివరణ 147).

అలాంటి పరిస్థితులలో తన పతి మరణ లేదా హత్యాసమాచార ౎ మా భార్యకు అందిన సందర్భంలో , ఆమె పునర్వివాహమాడే ముందు, తొమ్మిది మాసాలపాటు నిరీక్షించాలని బహాఉల్లా వివరించాడు (చూ. ప్ర.-జ. 27). నవమాస నిరీక్షణాకాలం, భర్త తన గృహాన్ని వదిలివెళ్లి ఇంకెక్కడో మరణించినపుడే తప్ప, గృహంలోనే ఉండి మరణించినపుడు వర్తించదని అబ్దుల్-బహా ఒక ఫలకంలో మరింత స్పష్టంగా వివరించాడు.

98. శ్లాఘనీయవిధానమునామె యవలంబింపవలె. ¶67
 
“శ్లాఘనీయమైన విధానమనగా - ఓరిమిని వహియించుటయే” నని బహాఉల్లా నిర్వచించాడు (చూ. ప్ర.-జ. 4).

99. ధర్మపరులగు యిరువురు సాక్షులు ¶67

సాక్షులకు సంబంధించి, వారి నిజాయితీ నిరూపణకు ప్రజలలో వారికి గల గౌరవమును౎ ప్రాతిపదిక గావించాడు బహాఉల్లా. “భగవత్సేవకులు ఏ మతము వారైనను, తెగవారైనను వారి సాక్ష్యము ఆయన సింహాసనము ఎదుట అంగీకృతమే” కనుక సాక్షులు బహాయిలే అయి ఉండనవసరం లేదని బహాఉల్లా వివరించాడు (చూ. ప్ర.-జ. 79).

100. భార్యాభర్తల మధ్య రోషద్వేషములు తలయెత్తెనేని, యాతడామెకు విడాకులనివ్వక ఒక సంవత్సర కాలము ఓరిమిని వహియింపవలె ¶68

బహాయి బోధనలలో విడాకులు తీవ్రంగా గర్హింపబడ్డాయి. ఏమైనప్పటికీ, ఒక వేళ వైవాహిక పక్షాల మధ్య రోషద్వేషములు తలయెత్తితే, ఒక పూర్తి సంవత్సరకాల నిరీక్షణానంతరం విడాకులు అనుమతింపదగును. ఈ నిరీక్షణ కాలంలో భర్త, తన భార్యాపిల్లలకు ఆర్ధికపరమైన మద్దత్తును అందించాలి. అంతేకాక, భార్యాభర్తలిద్దరూ కూడా తమ మధ్యగల భేదాభిప్రాయాలను పరిష్కరించు కోవడానికి గట్టిగా ప్రయత్నించాలి. కలిసి కాపురం చేయడం దుస్సాధ్యమని, “విడాకులు తీసుకోక తప్ప” దని ఏ ఒక్కరు భావించినా, “విడాకుల నడగడానికి సమానహక్కు” భార్యాభర్త లిద్దరికీ ఉన్నదని షోఘి ఎఫెండీ వివరించాడు.

నిరీక్షణా సంవత్సరం, దాని అనుసరణ (చూ. ప్ర.-జ. 12), ఆ సంవత్సర ఆరంభ దిననిర్ధారణ (చూ. ప్ర.-జ. 19,40), రాజీ పడటానికి సంబంధించిన నియమాలు (చూ. ప్ర.-జ. 38), సాక్షుల పాత్ర, స్థానిక న్యాయమందిరం పాత్ర (చూ. ప్ర.-జ. 73, 98) వంటి వివిధ వివాదాంశాలను ప్రశ్నలు - జవాబులలో బహాఉల్లా విపులీకరించాడు. సాక్షులకు సంబంధించి - ప్రస్తుతం, విడాకుల వ్యాజ్యములలో స్థానిక ఆధ్యాత్మిక సభలే సాక్షుల పాత్రను నిర్వహిస్తాయని విశ్వన్యాయ మందిరము వారు స్పష్టీకరించారు. 

విడాకులకు సంబంధించిన బహాయి నియమావళి వివరాలు సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఇ. 2 అ.-ఎ. లో క్లుప్తపరుపబడినవి.

101. మీరు ముమ్మారు పలికి స్త్రీకి విడాకులనిచ్చు పూర్వవిధానము నవలంబించుటను పరమాత్ముడు . . . నిషేధించినాడు. ¶68

ఇది : ఒక వ్యక్తి కొన్ని పరిస్థితుల దృష్ట్యా, తాను విడాకులిచ్చిన భార్యను పునర్వివాహ మాడటానికి - ఆమె వేరొకడిని వివాహమాడి విడాకులీయబడితే తప్ప - వీలుకాదని సూచించే ఖురాన్ గ్రంథంలోని ఇస్లాం శాసనానికి సంబంధించినది. ఇటువంటి ఆచరణ కితాబ్-ఎ-అఖ్దస్‌లో నిషిద్ధమని బహాఉల్లా నొక్కి చెప్పాడు (చూ. ప్ర.-జ. 31).

102. ఒక్కొక్క మాసము గడచుకొలది పరస్పరానురాగమును, అభీష్టమును ఒనగూడినపుడు, విడాకులిడినవాడు తన యర్ధాంగిని, ఆమె వేరెవ్వరినీ మనువాడియుండనిచో, పునరుద్వాహ మగుటకు నిర్ణయించుకొన వచ్చును. ఆమె మరల వివాహిత కాకపోయిన పక్షంలోనూ, ఆమె పరిస్థితి మారనట్లు స్పష్టమైతేనూ తప్ప ¶68

షోఘీ ఎఫెండి తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో వివరణను ఇస్తూ, “ఒక్కొక్క మాసము” అనడంలో ఉద్దేశ్యం కాలపరిమితిని సూచించడం కాదని, విడిపోయిన దంపతులు వారిలో ఏ ఒక్కరూ ఇతరులను వివాహమాడనంత వరకు, ఎప్పటికైనా పునర్వివాహానికి వీలున్నదని పేర్కొన్నాడు.

103. వీర్యము ఏహ్యకరమైనది కాదని ¶68

అనేక మత సాంప్రదాయాలలోను, షియా ముస్లిం మతాచారం గాను వీర్యం ఆచారపరంగా ఏహ్యకరమైనదిగా ప్రకటించబడింది. ఇక్కడ బహాఉల్లా, ఈ భావనను త్రోసిపుచ్చాడు. చూ. దిగువ వివరణ 106.

104. పారిశుధ్యపాశమును దృఢముగ చేబూనుడు ¶74

“స్వచ్ఛతా పవిత్రతల, పరిశుభ్రతా నిర్మలత్వముల” ప్రభావం “మానవస్థితి గొప్పతనము” “ఆంతరిక వాస్తవికతల” అభివృద్ధిపై ఎంతో ఉంటుందని అబ్దుల్-బహా సూచిస్తున్నాడు. “ నిర్మలమైన, మచ్చరహిత దేహము, మానవాత్మను ఎంతో ప్రభావితం చేస్తుం” దని కూడా ఆయన వ ర్ణించాడు (చూ. వివరణ 74).

105. మలినమైన ప్రతిదానిని, పేర్కొనబడిన మువ్విధములయందే విధముచేతను మార్పునొందని జలముతో ప్రక్షాళనమొనరింపుడు ¶74

ఈ ప్రవచనములో ప్రస్తావించిన “మువ్విధములు” - నీటి రంగు, రుచి, వాసనలను సూచిస్తుంది. అదే విధంగా స్వచ్ఛమైన జలం గురించీ, దానిని ఏ స్థాయిలో నిరుపయోగమైన జలంగా పరిగణించాలో, అందుకు  సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా బహాఉల్లా అనుగ్రహించాడు (చూ. ప్ర.-జ. 91).

106. భగవంతుడు తన యౌదార్యసమక్షము నుండి వెలువడిన యనుగ్రహముగ, వివిధాంశములకును, జనులకును అశుచిని ఆపాదింపుచున్న “మలినత్వ” భావన నుద్వాసించినాడు.¶75

ఆచారకర్మలను అనుసరించే కొన్ని తెగలు, పూర్వమతాచారాలు పరిగణించిన “మలినత్వ” భావనను బహాఉల్లా త్రోసిపుచ్చాడు. తన దివ్యావిష్కరణముతో “సమస్త సృష్టియును విమలాంబుధి యందున స్నానమాడిన” దని ఉద్ఘోషించాడు (చూ. వివరణలు 12, 20, 103).

107. రిద్వాన్ ప్రథమ దివసము ¶75

ఇది బహాఉల్లా తన సహచరులతో సహా, బాగ్దాద్ నగరం వెలుపలనున్న, తరువాయి కాలంలో రిద్వాన్ ఉపవనంగా బహాయిలచే ప్రస్తావింపబడిన  నజిబియ్యా ఉపవనానికి విచ్చేయటాన్ని సూచిస్తుంది. నౌరూజ్ అనంతరం ముప్ఫైఒక్క రోజుల పాటు, 1863 ఏప్రిల్ లో జరిగిన ఆ సంఘటన బహాఉల్లా తన సహచరులకు తన దివ్యధర్మాన్ని ప్రకటించిన కాలానికి ప్రారంభ ప్రతీకగా నిలిచింది. ఒకానొక ఫలకంలో “సర్వోన్నత పురస్కార దిన”మని తన ప్రకటనను, “ఏ ప్రదేశం నుండి సమస్తసృష్టి పైన ఆయన నామోద్భవశోభ వెదజల్లబడినదో ఆ ప్రదేశమిదియే” నని రిద్వాన్ ఉపవనాన్ని ఆయన అభివర్ణించాడు. తాను బహిష్కరింపబడిన ఇస్తాంబుల్‌కు బయలుదేరడానికి ముందుగా బహాఉల్లా ఈ దివ్యోపవనంలో 12 రోజులపాటు గడిపాడు. 

పండ్రెండు రోజుల రిద్వాన్ పండుగగా ఏటేటా జరుపుకోబడుతున్న బహాఉల్లా ప్రకటనాదినాన్ని “బహాయి పండుగలన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది, ప్రధానమైనది” గా షోఘీ ఎఫెండి వర్ణించాడు (చూ. వివరణలు 138, 140).

108. బయాన్ ¶77 

బాబీ దివ్యధర్మపు మాతృగ్రంథానికి బాబ్ ‘బయాన్’ అని నామకరణం చేశాడు. అది ఆయన సమస్త పవిత్రరచనా సముదాయానికి వర్తిస్తుంది. పారశీక బయాన్ అనబడేది బాబ్ ప్రణీతమైన సైద్ధాంతిక గ్రంథము, ఆయన నిర్దేశించిన శాసనాలకు ప్రధాన మంజూషము. అరబ్బీ బయాన్ కూడా విషయపరంగా తత్సమానమైనదే అయినా, స్వల్పావశ్యకమైనది. గాడ్ పాసెస్ బై గ్రంథంలో షోఘి ఎఫెండి పారశీక బయాన్ ను వర్ణిస్తూ, అది : “భావి తరాలకు శాశ్వత మార్గదర్శనముగా వెలువరింప బడిన శాసన నిర్దేశ సంహితగా గాక, ప్రధానంగా వాగ్దత్తపురుషునికి సంకీర్తనగా పరిగణించ బడవలె” నన్నాడు. 
 అబ్దుల్-బహా యిలా వ్రాశాడు: “కితాబ్-ఎ-అఖ్దస్ నందు ప్రస్తావించబడి, ఆమోదింపబడిన శాసనములకు సంబంధించి తప్ప, బయాన్ గ్రంథస్థానమునకు కితాబ్-ఎ-అఖ్దస్ ఆదేశంబైనది.”

109. గ్రంథ వినాశనము ¶77 

బాబ్ తన బయాన్ శాసనములను తన ఆమోదమునకు లోబడే చేశాడన్న వాస్తవాన్ని వెల్లడిస్తూ, తాను బాబ్ శాసనాలలో “కొన్నింటిని కితాబ్-ఎ-అఖ్దస్ నందు వేర్వేరు పదములలో పొందుపరుస్తూ” మిగిలిన వాటిని విస్మరించడం జరిగిందని బహాఉల్లా తన ఇష్రాఖత్ ఫలకములో వెల్లడించాడు. 

 గ్రంథముల విధ్వంసమునకు సంబంధించి : దివ్యధర్మానికి, దైవమతానికి అనుకూలముగ వ్రాయబడిన గ్రంథాలను తప్ప తక్కిన వాటినన్నింటినీ ధ్వంసం చేయవలసిందిగా బయాన్ బాబ్ అనుయాయులను ఆదేశించింది. బయాన్ లోని ఈ విశేషశాసనాన్ని బహాఉల్లా తొలగించాడు.

 బయాన్ శాసనముల స్వభావం, తీవ్రతల గురించి, తన తరఫున వ్రాయబడిన ఒకలేఖలో షోఘి ఎఫెండి ఈ వ్యాఖ్యను చేశాడు : 

బాబ్ వెలువరించిన కఠోర శాసనములను, ఆజ్ఞలను, ఆయన దివ్యధర్మ స్వభావము, పరమార్థము, లక్షణముల గురించిన ఆయన స్వీయవ్యాఖ్యల దృష్ట్యా వ్యాఖ్యానించినపుడే సవ్యంగా అవగతం చేసుకొనవచ్చును. ఈ వ్యాఖ్యలు ప్రస్ఫుటంగా వెలువరించినట్లుగానే, బాబీ దివ్యధర్మము - స్వాభావికంగా మత, సాంఘిక విప్లవం; అందుచేతనే దాని కాలపరిమితి కూడా స్వల్పమే. కాని     విస్తృతములూ, కఠినములూ అయిన అనేక సంస్కరణలతో, విషాదమయ సంఘటనలతో కూడిన కాలం అది. బాబ్, ఆయన అనుయాయులు పటిష్టంగా అమలు పరచిన కఠిన చర్యలు షియా ఛాందసవాదాన్ని కూలద్రోసి, తద్వారా బహాఉల్లా ఆగమనానికి మార్గాన్ని ఏర్పరిచాయి. నవీన స్వతంత్ర దైవధర్మాన్ని ప్రకటించటానికీ, రానున్న బహాఉల్లా దివ్యావిష్కరణకు రంగం సిద్ధం చేయటానికీ బాబ్ అటువంటి కఠిన శాసనాలను చేయవలసి వచ్చింది. కాని వాటిలో అనేకాన్ని అనుయాయులపై బలవంతంగా రుద్దలేదు. వాస్తవానికి, అవి ఆయన దివ్యధర్మపు స్వతంత్ర ప్రతిపత్తిని చాటేందుకై వెలువరించబడిన శాసనాలు; అవి - విస్తృతమైన ఆందోళన రేకెత్తించి, ఛాందసులైన మతనాయకుల వ్యతిరేకతకు కారణమై, చివరికి ఆయన బలిదానానికి దారితీశాయి.

110. వ్యర్థవివాద కారకములు గాక, మీకుపయుక్తములగు శాస్త్రముల నధ్యయనము గావించుట కనుమతించినాము ¶77 

జ్ఞాన సముపార్జనను, కళల, శాస్త్రాల అధ్యయనాన్ని బహాయి బోధనలు ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. బహాయి పండితులను, విద్యావేత్తలను గౌరవించాలని, కేవలం వివాదాస్పద, నిరర్ధక అధ్యయనాలను కొనసాగించరాదని కూడా సూచించడం జరిగింది. 
 విశ్వాసులు సమాజపు “అభివృద్ధికీ, పురోగతికీ”, “ఉపయోగకరమైన” శాస్ర్తాలనూ, కళలనూ అభ్యసించాలనీ, “కేవలం మాటలతో మొదలై మాటల తోడనే ముగిసే” శాస్ర్తాలను అభ్యసించ కూడదని హెచ్చరిస్తూ, వాటి అధ్యయనం కేవలం “నిరర్ధక వివాదము” నకు దారితీస్తుందని బహాఉల్లా తన దివ్యఫలకములలో ఉపదేశించాడు. షోఘి ఎఫెండి తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో “మాటలతో మొదలై మాటలతోడనే ముగిసే” శాస్త్రాలను “నిష్ఫల అప్రస్తుత ప్రశంసలతో, తత్త్వవిచారణ సంబంధమైన వితండ వాదముల” తో పోల్చాడు. మరొక లేఖలో అటువంటి “శాస్త్రాల” గురించి బహాఉల్లా ప్రధానోద్దేశ్యాన్ని వివరిస్తూ, వేదాంత గ్రంథాలు, వ్యాఖ్యానాలు సత్యాన్ని తెలుసుకోవటానికి సహాయపడకపోగా, మానవ మేధస్సును తికమక పెడుతున్నాయని వివరించాడాయన.

111. భగవంతునితో సంభాషించిన యాతడు ¶80

యూదు, ఇస్లాం సాంప్రదాయాలలో మోజెస్‌కు గల బిరుదనామం. తన దివ్యావిష్కరణా గమనంతో “భగవంతునితో సంభాషించిన యాతడు సైనాయ్ పై వినినట్టి దానిని ఆలకించు భాగ్యము మానవ శ్రవణములకు కల్పింపబడిన” దని బహాఉల్లా ప్రవచించాడు.

112. సైనాయ్ ¶80

ఈ పర్వతం పైనే భగవంతుడు మోజెస్‌కు తన దివ్యశాసనాలను వెలువరించాడు.

113. పరమాత్ముడు ¶80

ఇస్లాం పవిత్ర రచనలలోను, బహాయి పవిత్ర లేఖనాలలోను ఏసుక్రీస్తును ప్రస్తావించడానికి ఉపయోగించిన బిరుదనామధేయాలలో యిదొకటి.

114. కార్మెల్ . . . జియోన్ ¶80

పవిత్రభూమిలో “భగవంతుని ద్రాక్షోపవన” మైన కార్మెల్ పర్వతం పైనే బాబ్ పవిత్రసమాధి, దివ్యధర్మపరిపాలనా కేంద్రస్థానం నెలకొని ఉన్నాయి. 

 ఇక జియోన్ అనేది జెరుసలెమ్‌లోని ఒక కొండ. జెరుసలెమ్ నగర పవిత్రతకు ప్రతీక ఐన చారిత్రాత్మక దావీదు సమాధి ఉన్న ప్రదేశం.

115. శోణమహానౌక ¶84

“శోణమహానౌక” బహాఉల్లా దివ్యధర్మాన్ని సూచిస్తుంది. ఆయన అనుయాయులను బాబ్ -- ఖయ్యాముల్-ఆస్మాలో “శోణమహానౌక నందలి సహచరులు” గా పేర్కొని, ప్రశంసించాడు.

116. ఓ ఆస్ట్రియా చక్రవర్తీ: నీవు అఖ్సా మసీదు సందర్శనార్థ్దమై వెడలి నప్పుడు, భగవజ్జ్యోతిఃప్రత్యూషమగు ఆయన అక్కా కారాగార వాసిగ నున్నాడు. ¶85

ఆస్ట్రియా చక్రవర్తీ, హంగేరి రాజూ అయిన ఫ్రాన్సిస్ జోసెఫ్ (ఫ్రాంజ్ జోసెఫ్ 1830-1916) జెరూసలెమ్‌కు 1869లో తీర్థయాత్ర చేశాడు. పవిత్రభూమిలో ఉన్నప్పుడు - అక్కడ అక్కా (ఆక్రే) లో ఖైదీగా ఉన్న - బహాఉల్లాను గురించి అడిగి తెలుసుకునే భాగ్యానికి దూరమయ్యాడు. 

 అఖ్సా మసీదు అంటే, “బహుదూరానగల”  మసీదు అని అర్థం. ఖురాన్‌లో దీని ప్రస్తావన ఉంది. జెరుసలెమ్‌లో ఇది పర్వత దేవళంగా ప్రసిద్ధి చెందింది.

117. ఓ బెర్లిను రాజా! ¶86
 
ఒకటవ కైజర్ విలియమ్ (విల్‌హెల్మ్ ఫ్రెడ్రిక్ లుడ్విగ్, 1797-1888) ప్రష్యా ఏడవ రాజు, ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధ్దంలో ఫ్రాన్స్ పైన జర్మనీ విజయం సాధించిన మీదట, 1871 జనవరిలో ఫ్రాన్స్‌లోని వర్సెయిల్స్ లో జర్మనీ దేశానికి తొలి చక్రవర్తిగా గౌరవించబడ్డాడు.

118. నిన్ను మించిన యధికారముగల, నిన్ను మించిన స్థాయినొందిన యాతడు ¶86 

ఇది ఫ్రెంచ్ చక్రవర్తి ఐన మూడవ నెపోలియన్ (1808-1873)కు అన్వయిస్తుంది. సమకాలీన పాశ్చాత్యచక్రవర్తులలో గొప్పవాడని చరిత్రకారులెందరో అతనిని ప్రస్తుతించారు.

 తాను మూడవ నెపోలియన్‌కు వెలువరించిన దివ్యఫలకములలో, రెండవ దానిలో - అతని (నెపోలియన్) రాజ్యం “అయోమయావస్థలోకి త్రోయబడుతుం” దని, అతని “సామ్రాజ్యం చేజారిపోతుం” దని, అతని ప్రజలు తీవ్ర “సంక్షోభము” నెదుర్కొంటారని బహాఉల్లా స్పష్టంగా భవిష్యదర్శనం గావించాడు.

 ఒక ఏడాది కాలంలోనే, మూడవ నెపోలియన్, ఒకటవ కైజర్ విలియమ్ చేతిలో 1870 లో జరిగిన సెడన్ యుద్ధంలో ఘోర పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత అతను ఇంగ్లండుకు ప్రవాసం వెళ్ళి, మూడేళ్ల తరువాత అక్కడే మరణించాడు.

119. ఓ కాన్‌స్టాంటినోపుల్ ప్రజలారా! ¶89

“కాన్‌స్టాంటినోపుల్‌” గా ఇక్కడ అనువదించబడిన ఈ పదం మూల స్వరూపం: “అర్-రుమ్‌” లేదా “రోమ్‌”. మామూలుగా ఇది - మధ్య ప్రాచ్యంలో, కాన్‌స్టాంటి నోపుల్‌ను తూర్పు రోమన్ సామ్రాజ్యాన్ని; ఆపై బైజాంతియమ్ నగరాన్ని, దాని సామ్రాజ్యాన్ని; తదనంతరం అట్ట్టోమాన్ సామ్రాజ్యాన్ని ప్రస్తావించేందుకై ఉపయోగించ బడుతూ వచ్చింది.

120. సముద్రద్వయ తీరములపైనున్న యో దివ్యస్థలీ! ¶89

ప్రస్తుతం ఇస్తాన్‌బుల్‌గా పిలువబడుతున్న ఒకనాటి కాన్‌స్టాంటినోపుల్‌కు ఇది అన్వయిస్తుంది. నల్ల సముద్రాన్నీ, మర్మరా సాగరాన్ని కలిపే 31 కి. మీ., పొడవున్న బోస్ఫోరస్ జలసంధి వద్ద, తుర్కిఓడరేవు ఒడ్డున గల పెద్ద నగరమిది. 

 1453 నుండి 1922 వరకు కాన్‌స్టాంటినోపుల్ అట్టోమాన్ సామ్రాజ్యానికి రాజధానీ నగరంగా ఉంది. బహాఉల్లా ఈ నగరంలో ప్రవాసజీవితం గడుపుతున్న కాలంలో, కౄరుడైన సుల్తాన్ అబ్దుల్ అజీజ్ సింహాసనాన్ని ఆక్రమించాడు. అట్టోమాన్ సుల్తానులు, సున్నీ ముస్లింలకు నాయకులైన ఖలీఫాలు కూడా ! 1924 లో రద్దు గావింపబడిన ఖలీఫా వ్యవస్థ పతనాన్ని బహాఉల్లా ముందే గ్రహించాడు.

121. ఓ రైన్ నదీతీరములారా! ¶90

మొదటి ప్రపంచ యుద్ధా (1914-1918) నికి పూర్వం, తాను వెలువరించిన ఒకానొక ఫలకంలో అబ్దుల్-బహా - రైన్ నదీ తీరములు “రక్తపంకిల”మగుటను వీక్షించితిమన్న బహాఉల్లా వ్యాఖ్యను ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధానికి (1870-1871) అన్వయించి, మరిన్ని క్లేశాలు వచ్చిపడనున్నాయని సూచించాడు. 

 షోఘి ఎఫెండి తన గాడ్ పాసెస్ బై లో - మొదటి ప్రపంచ యుద్ధంలో పరాజయంపాలైన తర్వాత జర్మనీపై విధించబడిన “దురన్యాయపూరిత ఒప్పందము”, “బెర్లిన్ ఆక్రందనలను మరింత ఉధృతం చేసిన”దని “ఈ సంఘటన అర్ధ శతాబ్దానికి ముందే, అశుభ సూచకంగా భవిష్యదర్శనం గావించబడిన” దని వివరించాడు.

122. ఓ తా ధాత్రీ! ¶91

ఇరాన్ రాజధాని తెహరాన్ లోని ప్రథమాక్షరమే “తా”. బహాఉల్లా తరచుగా, ఆయా ప్రదేశాలకు వాటి మొదటి అక్షరాన్ని అన్వయింప చేసేవాడు. అబ్జద్ గణక విధానం ప్రకారం ‘తా’ సాంఖ్యక విలువ 9; ఇది – ‘బహా’ నామపు సాంఖ్యక విలువకు సమానం.

123. తన దివ్యవైభవావతారము నీ యందావిర్భవించుటచే ¶92

ఇది 1817 సం. నవంబర్ 12 న తెహరాన్ లో జరిగిన బహాఉల్లా జననానికి అన్వయిస్తుంది.

124. ఓ ఖా ప్రదేశమా! ¶94

పర్షియాకు చెందిన ఖురాసాన్ ప్రాంతానికీ, దాని పరిసర ప్రదేశాలకూ - ఇష్కాబాదు (అష్కాబాదు) నగరంతో సహా - ఇది అన్వయిస్తుంది.

125. ఎవ్వడేని శతమిష్కల్‌ల స్వర్ణము నార్జించినచో, అందలి పంధొమ్మిది మిష్కల్‌లు, భూస్వర్గముల స్రష్టయగు భగవంతునివి; ఆయనకు సమర్పింపవలసినవి. ¶97

ఈ దివ్యప్రవచనం, దేవుని హక్కైన హుఖుఖుల్లా ను, విశ్వాసులు తమ సంపాదనల నుండి ఒక నిర్ణీత భాగాన్ని చెల్లించవలసిన విలువను వెల్లడిస్తుంది. భగవంతుని దివ్యావతారమూర్తి గా బహాఉల్లాకు చేయబడిన ఈ సమర్పణలు, ఆయన స్వర్గారోహణానంతరం ఒడంబడిక కేంద్రమైన ఆబ్దుల్-బహాకు చేయబడేవి. ఆయన తన వీలునామా - మరణశాసనంలో హుఖుఖుల్లా – “దివ్యధర్మ సంరక్షకుని ద్వారా” సమర్పింపబడాలని సూచించాడు. ప్రస్తుతం, సంరక్షకుడు లేని కారణంగా, దివ్యధర్మానికి ఆధిపత్యం వహిస్తున్న విశ్వన్యాయ మందిరము వారికి సమర్పించబడుతున్నాయి. ఈ నిధి దివ్యధర్మ పురోభివృద్ధికీ, ధర్మప్రయోజనాలకూ, అదేవిధంగా వివిధ దాతృత్వ కార్యక్రమాలకూ వినియోగించబడుతుంది. హుఖుఖుల్లా సమర్పణ ఒక ఆధ్యాత్మిక బాధ్యత. దానిని నెరవేర్చడమన్నది ప్రతి బహాయి మనస్సాక్షికే వదలి వేయబడినది. హుఖుఖుల్లా శాసనావశ్యకతను సమాజానికి తెలియచెప్పినప్పటికీ, దాని చెల్లింపునకై ఏ విశ్వాసిని కూడా వ్యక్తిగతంగా సమీపించరాదు.

 ప్రశ్నలు - జవాబులలో అనేకం ఈ శాసనాన్ని విశదీకరించాయి. హుఖుఖుల్లా లెక్కింపు, వ్యక్తి సంపాదన విలువ పై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి సంపద విలువ పంధొమ్మిది మిష్కల్‌ల బంగారం విలువకు సమానమైతే (చూ. ప్ర.-జ. 8), ఆ మొత్తంలో పంధొమ్మిది శాతాన్ని, కేవలం ఒకే ఒకసారి, హుఖుఖుల్లాగా అర్పించడం ఆధ్యాత్మిక కర్తవ్యం (చూ. ప్ర.-జ. 89). ఆ తర్వాత, ఖర్చులన్నీ పోను, తర్వాత ఆతడి సంపాదన విలువ పెరిగి పంధొమ్మిది మిష్కల్‌లకు సమాన మైనపుడు, ఆ పెరుగుదలపై పంధొమ్మిది శాతం హుఖుఖుల్లా గా చెల్లించవలసి ఉంటుంది. ఆపై ప్రతి పెరుగుదల మీద, ఇలాగే చెల్లించవలసి ఉంటుంది. (చూ. ప్ర.-జ. 8, 90)

 నివాసగృహం వంటి కొన్ని రకాల సంపదలకు హుఖుఖుల్లా చెల్లింపునుండి మినహాయింపు ఉంది (చూ. ప్ర.-జ. 8, 42, 95). అలాగే, ఆర్ధికనష్టం (చూ. ప్ర.-జ. 44, 45), లాభార్జనలో విఫలమైన పెట్టుబడుల (చూ. ప్ర.-జ. 102) విషయంలోను, మరణ సందర్భం (చూ. ప్ర.-జ. 9, 69, 80) లోను హుఖుఖుల్లా చెల్లింపుకు సంబంధించి కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను ప్రకటించడం జరిగింది. (ఈ చివరి అంశం గురించి చూ. వివరణ 47).

 దివ్య ఫలకముల నుండి, ప్రశ్నలు - జవాబుల నుండి, ఇంకా ఇతర పవిత్ర రచనల నుండి హుఖుఖుల్లా ఆధ్యాత్మిక విశిష్టతనూ, దానిని అనుసరించవలసిన విధి విధానాలను వివరించే రచనాభాగాల సంకలనం ఒకటి హుఖుఖుల్లా పేరిట చిన్న పుస్తకంగా ఆంగ్లంలో ప్రచురించబడింది.

126. . . . దేవదేవుని శాసనముల గురించి ఎన్నియో విజ్ఞాపనములు విశ్వాసుల నుండి మా సింహాసన సమక్షమునకు వచ్చినవి. పర్యవ సానముగా, మేమీ పావన ఫలకము నావిష్కరించి, జనులదృష్టవశమున తమ ప్రభుని యాజ్ఞల ననుసరింతురని, దానిని ఆయన శాసనవస్త్రములో నిక్షిప్తము గావించినాము. ¶98

“అనేక వత్సరములపాటు, విభిన్న ప్రదేశముల నుండి, భగవత్శాసనముల కొఱకు, పరమ పవిత్ర సమక్షమునకు, విన్నపములు జేరవచ్చినవి, కాని నియమిత సమయమాసన్నమగునంత వరకు మా లేఖినిని నిలిపి యుంచితి” మని బహాఉల్లా తన ఫలకములయందొక దానిలో వివరించాడు. తెహరాన్‌లోని సీయాచల్ లో తన ప్రవక్తృత్వ మహోద్యమం ఆవిర్భవించిన ఇరవై ఏళ్లవరకు, తన దివ్యధర్మశాసనాలకు కోశాగారతుల్యమైన కితాబ్-ఎ-అఖ్దస్‌ను వెలువరించలేదాయన. వెలువరించిన తరువాత, పర్షియాలో ఉన్న మిత్రులకు పంపించటానికి పూర్వం, కొంత కాలం దానిని ఆయన తన వద్దనే ఉంచుకున్నాడు. ఈ యుగానికి అనువర్తించే శాసనాలను వెలువరించడంలో దైవికంగా జరిగిన ఈ ఆలస్యం, ఆపైన క్రమేపి వాటి నియమాలు ఆచరణలోకి తీసుకు రాబడటాన్నీ, ప్రతి ప్రవక్త పరిధిలోనూ జరిగే గతిశీల ఆవిష్కరణనూ తేటతెల్లం చేస్తున్నది.

127. శోణితస్థలి ¶100

కారాగార నగరం  ‘అక్కా’ కు ఇది వర్తిస్తుంది. “శోణిత” మనే పదం బహాయి పవిత్ర రచనలలో అనేకచోట్ల రూపకాలంకారంగాను, సంజ్ఞా వాచకం గాను ఉపయోగించ బడినది. (చూ. వివరణ 115)

128. సద్రత్-ఉల్-ముంతహా ¶100

“సుదూర దివ్యవృక్ష” మని అర్థం వచ్చే ఈ పదాన్ని  షోఘి ఎఫెండి “తదుపరి తెరువేదియులేని తరు” వని అనువదించాడు. ఇది ఇస్లాం మతంలో - ఉదాహరణకు మహమ్మద్ తన రాత్రి ప్రయాణ వర్ణనలో, స్వర్గంలోని ఒక స్థానాన్ని వర్ణిస్తూ భగవంతుని సామీప్యాన్ని చేరడం మానవులకు, దేవదూతలకు సైతం సాధ్యం కాదనడానికీ, అదే విధంగా మానవాళికి అనుగ్రహింపబడిన దివ్యజ్ఞానమునకు అవధిరాహిత్యాన్ని చూపించడానికీ - ఒక సంకేతంగా ఉపయోగించబడింది. అందుకే బహాయి పవిత్ర రచనలలో తరచు భగవంతుని దివ్యావతారాన్ని ప్రస్తావించేందుకై వినియోగించబడింది (చూ. వివరణ 164 కూడా).

129. మాతృగ్రంథము ¶103

ఏ దివ్యమత సంవిధానానికి సంబంధించిన ప్రధానగ్రంథమైనా సాధారణంగా, “మాతృగ్రంథ”మని వ్యవహరించబడుతుంది. ఖురాన్‌లోను, ఇస్లాం హదీజ్ లోను - ఖురాన్ మాతృగ్రంథంగా పేర్కొనబడినది. బాబీ మతావిష్కరణ కాలంలో బయాన్ మాతృగ్రంథమైతే, బహాఉల్లా మతావిష్కృత యుగంలో మాతృగ్రంథము - కితాబ్-ఎ-అఖ్దస్. తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో షోఘి ఎఫెండి ఈ అంశాన్ని వివరిస్తూ, “బహాఉల్లాచే వెలువరించబడిన బోధనల సముదాయాన్నంతటినీ సూచించే ఏకీ కృత పద” మని కూడా అన్నాడు. విశాల దృక్పథంతో, దివ్యావిష్కరణా మంజూషానికి సంకేతంగా కూడా ఈ భావన వినియోగించబడింది.

130. దివ్యావిష్కరణాస్వర్గమునుండి యనుగ్రహీతమైన దానిని అనుచితముగ వ్యాఖ్యానించి, దాని వాస్తవార్థమును వక్రీకరించు నాతడు ¶105

మనస్సుకు హత్తుకునేలా వ్యాఖ్యానించేందుకు వీలయ్యే దృష్టాంత ప్రవచనాలకూ, అదే విధంగా, సాక్షీభూత అర్థం కలిగి, విశ్వాసుల సమ్మతి అవసరమయ్యే శాసనాలకూ, నిర్దేశాలకూ, ఇంకా ఆరాధన, మతాచారాల కు సంబంధించిన ప్రవచనాలకూ మధ్య గల వైశిష్ట్యాన్ని అనేక దివ్యఫలకములలో బహాఉల్లా స్పష్టంగా వివరించాడు.

 వివరణలు 145, 184 లలో వివరించినట్లుగా, బహాఉల్లా - తన జ్యేష్ఠపుత్రుడైన అబ్దుల్-బహాను తనకు ఉత్తరాధికారిగాను, తన దివ్యబోధనలకు వ్యాఖ్యాతగాను పేర్కొన్నాడు. తన వంతుగా అబ్దుల్-బహా, పవిత్ర రచనలకు వ్యాఖ్యాతగా తన వారసత్వాన్ని చేపట్టేందుకై, తన జ్యేష్ఠపౌత్రుడైన షోఘి ఎఫెండిని దివ్యధర్మానికి సంరక్షకునిగా నియమించాడు. అబ్దుల్-బహా, షోఘి ఎఫెండీల వ్యాఖ్యానాలు దైవమార్గదర్శకత్వాన్ని పొందినవి గానూ, బహాయిలు తప్పనిసరిగా అనుసరించవలసినవి గానూ పరిగణించబడినాయి. 
 ఒక వ్యక్తి దివ్యబోధనలను అధ్యయనం చేసి, తానొక స్వీయాభిప్రాయానికి వచ్చి, ఆత్మావలోకనం చేసుకోకుండా అధీకృత వ్యాఖ్యానాలు నిరోధించవు. అయినప్పటికీ, అధీకృత వ్యాఖ్యానాలకు, స్వీయాధ్యయనం వలన కలిగిన అవగాహనకు మధ్య స్పష్టమైన వైవిధ్యం ఉంది. బోధనల పట్ల వ్యక్తి ఏర్పరచుకున్న అవగాహనపై ఆధారపడిన వ్యక్తిగత వ్యాఖ్యానాలు మనిషి జ్ఞానశక్తి ఫలితానికి తోడ్పడతాయి. అంతేకాక ధర్మాన్ని బాగా అర్థం చేసుకోవడానికి వీలును కల్పిస్తాయి. అయినా, అలాంటి అభిప్రాయాలలో సాధికారత లోపిస్తుంది. వ్యక్తులు తమ ఆలోచనలను ప్రస్తావించే టప్పుడు, ఆవిష్కృత దివ్యప్రవచనాల అధికారాన్ని నిరాకరించకుండా అధీకృత వ్యాఖ్యానాలతో వివాదపడకుండా, తర్కానికి పూనుకోకుండా జాగ్రత్త వహించాలనీ, వాస్తవానికి వారు తమ ఆలోచనలను జ్ఞానానికి ధారపోసి - తాము వెల్లడించినవి తమ స్వీయ అభిప్రాయాలు మాత్రమేనని స్పష్టీకరించాలి.

131. పారశీక ప్రజాస్నానవాటికలను సమీపింపవలదు ¶106

సాంప్రదాయక ప్రజాస్నానవాటికలలో ఉండే జలాశయాల వినియోగాన్ని బహాఉల్లా నిషేధించాడు. ఈ జలాశయాలలో అనేకమంది స్నానం చేయడం ఆచారం; అదీ కాక, వాటిలోని నీటిని మార్చడం చాలా అరుదు. పర్యవసానంగా వాటిలోని నీరు వివర్ణమై, మలినమె,ై అనారోగ్యహేతువై, భరింపశక్యంగాని దుర్గంధ పూరితమౌతుంది.

132. అవ్విధముగనే, పారశీక గృహ ప్రాంగణముల యందలి దుర్గంధ భూయిష్టములగు జలాశయములను వర్జించి ¶106

స్నానాలకూ, శుభ్రపరచుకోవడానికీ, ఇంకా యితర గృహావసరాలకూ వాడుకునేందుకై పర్షియాలో ఎక్కువ గృహప్రాంగణాల ముంగిళ్లలో జలాశయాలు ఉండేవి. వాటిలో నీరు నిలవచేయబడి ఉండటం వల్లను, ఆ నీటిని వారాల తరబడి మార్చకపోవడం వల్లను, ఆ నీటి మడుగులు ఎంతో అసహ్యకరమైన దుర్వాసనకు కారణమయ్యేవి.

133. మీ తండ్రుల పత్నులను పరిణయమాడుట మీకు నిషేధించ బడినది ¶107
సవతి తల్లిని వివాహమాడటం ఇందులో స్పష్టంగా నిషేధించబడింది. సవతి తండ్రిని వివాహమాడటానికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. బహాఉల్లా వెల్లడించిన శాసనం అనువర్తించేచోట్ల, దీనిని - సందర్భం అసాధ్యం గావించనంత వరకు - అవసరమైన మార్పులతో స్త్రీ పురుషులకు వర్తించు శాసనముగా వ్యవహరించవచ్చు. 

 బంధువర్గాలకు సంబంధించి కేవలం సవతి తల్లులు మాత్రమే దివ్యగ్రంథంలో ప్రస్తావించబడినంత మాత్రాన కుటుంబంలోని ఇతర బంధువులతో సంయోగాలు అనుమతింపబడినట్లు అర్థం కాదని అబ్దుల్-బహా, షోఘి ఎఫెండి ధృవీకరించారు. “స్వబాంధవులను వివాహం చేసుకోవడంలో గల ఔచిత్యం లేదా అనౌచిత్యం గురించి” న ధర్మశాసనాలు విశ్వన్యాయ మందిరము వారినుండి వెలువడతాయని బహాఉల్లా వివరించాడు (చూ. ప్ర.-జ. 50). దంపతుల మధ్య రక్తసంబంధం ఎంతదూరమైతే అంత మంచిది, అటువంటి వివాహాలు మానవమనుగడకు శ్రేయోదాయకాలై, మానవజాతిలో సౌహార్ద్రభావనకు సహకరిస్తాయని అబ్దుల్-బహా వ్రాశాడు.

134. బాలుర విషయచర్చ ¶107

ఈ సందర్భంలో, “బాలురు” గా ఇక్కడ అనువదింపబడిన పదం అరబ్బీ మూలంలో ‘బాలురతో గుహ్యసంపర్కం’ అనే అర్థాన్ని ధ్వనిస్తుంది. షోఘి ఎఫెండి దీనిని స్వలింగ సంపర్కానికి సంబంధించిన అంశాలన్నింటికీ అనువర్తించే నిషేధంగా వ్యాఖ్యానించాడు.

 లైంగిక నైతికతను గురించిన బహాయి బోధనలు వివాహం మీద కేంద్రీ  కృతమై, పరివార జీవనం సమస్త మానవ సమాజానికి పునాదిరాయి అయ్యేలా, ఆ దివ్యవైవాహిక వ్యవస్థను కాపాడి, దృఢపరచేలా రూపొందించబడింది. బహాయి శాసనం ప్రకారం : స్త్రీ పురుషులకు మధ్య అనుమతింపదగిన లైంగిక సమాగమం - పురుషునికీ అతడు వివాహమాడిన స్త్రీ కి మాత్రమే పరిమితం.

 తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో షోఘి ఎఫెండి ఇలా వివరించాడు:

స్వలింగ వ్యక్తుల మధ్య ఎంతటి ప్రేమానురక్తులున్నప్పటికీ, అది లైంగిక చర్యల ద్వారా వ్యక్తం కాబడడం తప్పు. అది ఆదర్శబంధమనడం క్షమార్హం కాదు. యదార్ధానికి బహాఉల్లా నీతి బాహ్యమైన ప్రతిదానినీ నిషేధించాడు; స్వలింగ సంపర్కాన్ని ప్రకృతివిరుద్ధమైనదిగా పరిగణించాడు. ఈ రకమైన వ్యసనానికి గుఱికావడం వివేచన గల ఆత్మకు పెనుభారం వంటిది. కాని వైద్యుని సలహా, సహకారాలతో, దృఢ సంకల్పంతో, కృషితో, ప్రార్థన ద్వారా ఈ బలహీనతను అధిగమించ వచ్చు. 

 వ్యభిచార, స్వలింగసంపర్క నేరాలకు - నేర తీవ్రతననుసరించి - తగిన అపరాధశుల్కాలను నిర్ణయించే అవకాశాన్ని బహాఉల్లా విశ్వన్యాయ మందిరమునకు ఏర్పరిచాడు (చూ. ప్ర.-జ. 49).

135. జనబాహుళ్యము వీక్షింప, వీధుల వెంట, విపణియందున విహ రింపుచు దివ్యప్రవచనములను వల్లించుటకెవ్వరును అనుమతింప బడలేదు ¶108

పూర్వపు మతధర్మాలలో కొందరు మతాధిపతులు, మతనాయకులు, కపట నాటకాలతో తమ ఆనుయాయుల ప్రశంసలనందుకునేందుకై, బాహ్యాడంబరాన్ని చూపుతూ, జనసంచారంగల ప్రదేశాలలో ప్రార్థనలను వల్లిస్తూ తమ భక్తిని ప్రదర్శించే ఆచారానికి ఇది ఒక నిదర్శనం. బహాఉల్లా ఇటువంటి ప్రవర్తనను నిషేధించాడు; వినయానికి, భగవంతునియెడ నిష్కళంకభక్తిని కలిగిఉండటానికి గల ప్రాముఖ్యాన్ని దృఢంగా ప్రబోధించాడు.

136. వీలునామా వ్రాయుట ప్రతి యొక్కరికిని విధియుక్తమై యున్నది. ¶109

బహాఉల్లా దివ్యబోధనల ప్రకారం, ప్రతి వ్యక్తి - వీలునామాను, మరణ శాసనాన్ని వ్రాయవలసిన బాధ్యతను కలిగియుండి, తానెంచుకొన్న ప్రకారం  తన ఆస్తిని వితరణ చేయడానికి స్వతంత్రుడు (చూ. వివరణ 38).

 “తనకనుగ్రహీతమైన దానితో తన యిచ్చవచ్చిన రీతిని వ్యవహరించుటకు భగవంతుడాతనిని నిశ్చయముగ ననుమతించినా” డని భగవంతుడు వ్యక్తికి అనుమతినిచ్చినాడు కనుక, తన వీలునామాను వ్రాయుటలో, “వ్యక్తికి తన యాస్తిపై సంపూర్ణాధికారమున్న” దని బహాఉల్లా ధృవీకరించాడు (చూ. ప్ర.-జ. 69). ఎవరైనా వీలునామా వ్రాయకుండా చనిపోతే వారసత్వపుటాస్తి పంపిణీకి కితాబ్-ఎ-అఖ్దస్ లో నిబంధనలు పొందుపరుప బడినాయి (చూ. వివరణలు 38-48).

137. మహోన్నత నామము ¶109

వివరణ 33 లో వివరించినట్లు, భగవంతుని మహోన్నత నామము “బహా” అనే పదం ఆధారముగా పలురూపాలను దాలుస్తుంది. ప్రాగ్దేశీయులైన బహాయిలు, తమ వీలునామాల పైభాగాన “ఓ సకల మహిమాన్విత మహిమా”, “సకల మహిమాన్వితుడైన దేవుని నామధేయమున”, “ఆయనే సకల మహిమాన్వితుడు” వంటి శీర్షికలను వ్రాస్తూ కితాబ్-ఎ-అఖ్దస్ లోని ఈ ఆజ్ఞను ఆచరణలో పెట్టారు.

138. సమస్త పర్వదినములును మహోన్నత పర్వదినద్వయమునను, దినద్వయమున సంభవించు మరి రెండు పండుగలయందునను సమ్మిళితమైనవి ¶110

ఈ గ్రంథ భాగం బహాయి సంవత్సరంలోని నాలుగు మహా పర్వదినాలను (పెద్ద పండుగలను) నిర్ధారిస్తుంది. “మహోన్నత పర్వదినద్వయం” గా బహాఉల్లా పేర్కొన్న వాటిలో మొదటిది - 1863 ఏప్రిల్/మే లో బహాఉల్లా బాగ్దాదు లోని రిద్వాన్ ఉద్యానవనంలో పండ్రెండు రోజులు బసచేసిన కాలంలో, ఆయన గావించిన      ప్రవక్తృత్వ సముద్యమ ప్రకటనను సంస్మరిస్తూ జరుపుకునేది – “పర్వదిన వల్లభు” నిగా ఆయనచే సూచితమైనది అయిన రిద్వాన్ పండుగ; రెండవది 1844 లో షిరాజ్ లో సంఘటిల్లిన బాబ్ ప్రకటన. రిద్వాన్ పర్వకాలానికి సంబంధించి మొదటి, తొమ్మిదవ, పండ్రెండవ దినములు బాబ్ ప్రకటనా దినము మాదిరిగానే పరమ పవిత్రమైనవి (చూ. ప్ర.-జ. 1).

మరో “రెండు పండుగలు” - బహాఉల్లా , బాబ్ ల జన్మదిన వార్షికోత్సవాలు. ముస్లిం చాంద్రమాన పంచాంగం ప్రకారం, ఈ దినములు ఒకదాని వెంట ఒకటిగా అంటే బహాఉల్లా జననం 1233 హిజ్రి మొహర్రం మాసం రెండవదినాన (1817 నవంబర్ 12), బాబ్ జననము 1235 హిజ్రి అదే మాసం (మొహర్రం) మొదటి దినాన (1819 అక్టోబర్ 20) వరుసక్రమంలో వస్తాయి. అలా, ఆ రెండు రోజులూ కలిసి “జన్మదిన ద్వయం” గా వ్యవహరించబడ్డాయి. భగవంతుని దృష్టిలో ఈ రెండు రోజులు ఒకే దినముగా పరిగణింపబడినాయని బహాఉల్లా వివరించాడు. ఈ దినములు ఉపవాస మాసంలో వచ్చినట్లైతే, ఆ రోజులలో ఉపవాస నియమం వర్తించదని వెల్లడించా డాయన (చూ. ప్ర.-జ. 36). బహాయి పంచాంగం (చూ. వివరణలు 26, 147) సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక, ఈ రెండు పవిత్ర దినోత్సవాలను జరుపుకోవలసింది సౌరమానం ప్రకారమా, చాంద్రమానం ప్రకారమా అనే  అంశాన్ని విశ్వన్యాయ మందిరము వారు నిర్ణయిస్తారు.

139. ‘బహా’ మాసపు తొలిదినము ¶111

బహాయి పంచాంగం ప్రకారం సంవత్సరంలోని తొలి మాసానికీ, అలాగే, ప్రతి మాసపు తొలి దినానికీ “బహా”
 అని నామకరణం చేయబడింది. బహా మాసపు తొలి రోజే బహాయి నూతన సంవత్సరాది అయిన నౌరూజ్. ఇది బాబ్ చే పర్వదినంగా నిర్దేశితమై, బహాఉల్లా చే ఆమోదించబడింది (చూ. వివరణలు 26, 147).

కితాబ్-ఎ-అఖ్దస్‌లోని ఈ గ్రంథ భాగాలలో నిర్దేశింపబడిన ఈ 7 పర్వ దినాలేగాక, బహాఉల్లా జీవితకాలంలో, బాబ్ బలిదాన వార్షికోత్సవాన్ని కూడా పర్వదినంగా జరుపుకోవడం జరిగింది; దీనికి అనుబంధంగా, బహాఉల్లా స్వర్గారోహణాన్ని కలుపుతూ, మొత్తం తొమ్మిది పండుగలు చేశాడు అబ్దుల్-బహా. ఇవి కాక, మరో రెండు వార్షికోత్సవాలను - ఒడంబడిక దినం, అబ్దుల్-బహా అస్తమయ దినాలను - కూడా జరుపుకోవడం ఉన్నది కాని, ఆరోజులలో దైనందిన వృత్తి వ్యాసంగాలను మానుకో నవసరం లేదు. చూ. బహాయి వరల్డ్, 18వ సంపుటంలో  బహాయి పంచాంగాన్ని గురించిన విభాగం.

140. యదార్ధమునకు, మహోన్నత పర్వదినమన, ‘పర్వదినవల్లభుడే’¶112

ఇది రిద్వాన్ పండుగకు అన్వయిస్తుంది (చూ. వివరణలు 107, 138).

141. ఇతఃపూర్వము - విశ్వాసులలో ప్రతి యొక్కడును తన సముపార్జనల యందలి యమూల్య పురస్కృతులను మా యాసనము మ్రోల సమర్పింప వలెనను కర్తవ్యమును భగవంతుడు విధియించి యున్నాడు. ప్రస్తుతం . . . ఈ యనివార్యత కుద్వాసన చెప్పినాము. ¶114

భగవంతుడు ప్రత్యక్షీకరింపజేయునతడు సాక్షాత్కరించినపుడు ఆయనకు అమూల్య ములైన వస్తువులను సమర్పించాలని బయాన్‌లో ప్రస్తావితమైన గ్రంథ భాగాన్ని ఇది రద్దుచేస్తున్నది. భగవంతుని దివ్యావతారమూర్తి వర్ణనాతీతుడు కనుక - ఆయన మరొక విధంగా ఆదేశించకపోతే - అమూల్యమైన వాటిని, ఆయనకు సమర్పించేందుకై న్యాయసమ్మతంగా సమీకరించి ఉంచాలని బాబ్ వివరించాడు.

142. ప్రత్యూషఘడియ ¶115 

బహాయి ఆరాధనా మందిరమైన మష్రిఖుల్-అఝ్కార్‌లో ప్రభాత ప్రార్థనలలో పాల్గొనడానికి సంబంధించి భగవంతుని దివ్యగ్రంథంలో వాస్తవ సమయం “ప్రత్యూషవేళ” గా పేర్కొనబడినప్పటికీ, “సూర్యోదయత్పూర్వం (అనగా తొలిసంధ్యవేళ), లేదా సూర్యోదయానంతరం రెండు గంటల వరకు” ఏ సమయమైనా ఆమోదయోగ్యమే నని బహాఉల్లా వివరించాడు.

143. భూ స్వర్గముల నడుమ తన వాణిని వెలువరించునాతడును, ఉషోదయ కారకుడును అగు ఆయన ముద్రచే ఈ దివ్యఫలకము లలంకృతములైనవి. ¶117 

తన పవిత్రరచనల పరిపూర్ణ అభిన్నత్వమే భగవత్ప్రవచనమని పలుమార్లు ఉద్ఘాటించాడు బహాఉల్లా. ఆయన ఫలకాలలో కొన్ని ఆయన ముద్రలలో ఒకదానితో అంకితమై ఉన్నాయి. ది బహాయి వరల్డ్, 5వ సంపుటంలోని 4వ పుటలో బహాఉల్లా కు చెందిన వివిధ ముద్రల తో కూడిన ఫొటో ఒకటి ఉంది.

144. విచక్షణాజ్ఞానవరప్రసాదియగు మానవుడు, ఆ జ్ఞానమును హరియించు దానిని గ్రహియింపతగదు. ¶119

మధుపానాన్నీ, మరికొన్ని ఇతర మత్తుపానీయాల సేవనాన్నీ నిషేధిస్తున్నవీ, అదే విధంగా, అటువంటి మాదకద్రవ్యాలు మానవుడిపై చూపే దుష్ర్పభావాన్ని వివరిస్తున్నవీ అయిన సూచనలు బహాయి పవిత్ర రచనలలో ఎన్నో ఉన్నాయి. బహాఉల్లా తన దివ్యఫలకం ఒకదానిలో ఇలా ప్రవచించాడు:

భగవదామృత సేవనమును, మీ స్వీయమధువుకై మార్పిడి చేసుకునేరు జాగ్రత్త, అది మీ మేధస్సులను స్మృతి దప్పించి, మహిమాన్వితుడును, అసమానుడును, దుర్లభుడునగు దేవుని ముఖారవిందము నుండి మిమ్ములను విముఖులను గావించును. మహోన్నతుడును, సర్వశక్తిమంతుడును అగు భగవంతుని యానతిచే నది నిషేధింపబడినందున మీరు దాని దరిజేరవలదు. 

“తేలికపాటివి, ఘాటైనవి అయిన మద్యపానీయాలు రెండింటినీ” అఖ్దస్ గ్రంథము నిషేధిస్తుందని అబ్దుల్-బహా వివరించాడు. మత్తుపానీయాల నిషేధానికి గల కారణాన్ని గురించి ఆయన యింకా యిలా అంటాడు: “మద్యం మెదడును పెడదారి పట్టించి, దేహాన్ని బలహీనపరుస్తుంది.”

షోఘి ఎఫెండి తన తరఫున వ్రాయబడిన లేఖలలో - ఈ నిషేధం, మద్యపానానికే కాక మెదడును వ్యత్యస్తపరచే ప్రతి పదార్థము౎ నకు వర్తిస్తుందని వివరించాడు. వివేచనాశీలి, సమర్థుడు ఐన వైద్యుని సలహామేరకు వైద్యచికిత్సలో భాగంగా, ఒక విశేష వ్యాధి నివారణకు నిర్ణయించినపుడు ఆల్కహాలు వాడుటకు అనుమతింపబడిన౎ దని కూడా ఆయన స్పష్టీకరించాడు.

145. దైవసంకల్పితుడును, ఈ ప్రాచీనమూలోద్భవుడును అగు ఆయన వంకకు మీ వదనములను సారింపుడు. ¶121 

అబ్దుల్-బహాను తన వారసునిగా సూచిస్తూ, విశ్వాసులను ఆయన వంకకు అభిముఖులను కమ్మన్నాడు బహాఉల్లా. ఒడంబడిక గ్రంథములోను, తన వీలునామా, మరణశాసనములోనూ బహాఉల్లా ఈ ప్రవచనాల ప్రయోజనాన్ని యిలా వివరించాడు : “ఈ పవిత్రవాక్యోద్దేశ్యము మహత్తరశాఖయే దక్క వేరెవ్వరును కారు.” “మహత్తరశాఖ” అనే బిరుదాన్ని అబ్దుల్-బహాకు బహాఉల్లా ప్రసాదించాడు (చూ. వివరణలు 66, 184 లను కూడా).

146. మీరు మమ్ము ప్రశ్నలనడుగుట బయాన్‌నందు నిషేధించ బడినది. ¶126

భగవంతుడు ప్రత్యక్షీకరించునతడిని అనగా బహాఉల్లాను గురించి : అడిగే ప్రశ్నలు లిఖితపూర్వకంగా సమర్పించబడి, ఆయన స్థానౌచిత్యానికి తగినట్లుగా ఉంటే తప్ప, ఆయనను విశ్వాసులు ప్రశ్నించకుండా బాబ్ వారిని నిషేధించాడు. చూ. బాబ్ రచనల నుండి సంగ్రహింపబడిన గ్రంథభాగములు.

బాబ్ ఏర్పరచిన ఈ నిషేధాన్ని బహాఉల్లా తొలగించాడు. “అడగ దగిన” ప్రశ్నలను అడిగేందుకై విశ్వాసులను ఆయన ఆహ్వానించాడు. “పూర్వీకులు అలవాటుగా” వేస్తూఉండిన “వ్యర్ధప్రశ్నలను” వేయవద్దని వారిని హెచ్చరించాడు.

147. ఒక సంవత్సరమందలి మాసముల సంఖ్య పంధొమ్మిదియని భగవంతుని దివ్యగ్రంథమున నిర్దేశితమైనది. ¶127

బహాయి పంచాంగం ప్రకారం, బహాయి సంవత్సరానికి పంధొమ్మిది మాసాలని నిర్ధారించడం జరిగింది. అదే విధంగా, ప్రతి మాసానికీ పంధొమ్మిది రోజులుగాను, మిగిలిన దినాలను అధిక దినాలుగాను (సాధారణ సంవత్సరంలో నాలుగు, లీపు సంవత్సరంలో ఐదు) నిర్ణయించి, వీటిని 18వ మాసానానికీ, 19వ మాసానికీ మధ్యగా, సౌరమాన పంచాంగానికి అనువుగా, సర్దుబాటు చేయడం జరిగింది. బాబ్ ఈ మాసాలన్నింటికీ దైవలక్షణాలతో కూడిన పేర్లను పెట్టాడు. బహాయి నూతన సంవత్సరాది అయిన నౌరూజ్, మార్చి మాసానికి ముందుగా సంభవించే విషువత్తుతో కలిసి వచ్చేలా, ఖగోళశాస్ర్తానుగుణంగా స్థిరపరచబడింది (చూ. వివరణ 26). వారములోని రోజుల పేర్లకూ, ఇంకా మాసాలకూ సంబంధించిన ఇతర వివరాలకై చూ. ది బహాయి వరల్డ్, 18వ సంపుటం లో బహాయి పంచాంగానికి చెందిన విభాగం.

148. వీనియందలి ప్రథమ మాసము సమస్త సృష్ట్యావృతమగు ఈ దివ్యనామముచే నలంకృత మైనది. ¶127

సంవత్సరములోని ప్రథమ మాసానికి, పారశీక బయాన్ లో బహా౎ అనే నామాన్ని బాబ్ అనుగ్రహించాడు (చూ. వివరణ 139 ).

149. మృతులను . . . శవపేటికల యందుంచవలెనని . . . పరాత్పరుడు నిర్దేశించినాడు. ¶128

మరణించిన వ్యక్తిని గాజుతో కాని, మెఱుగు పెట్టబడిన రాతితో కాని చేయబడిన శవపేటికలో ఉంచాలని బయాన్‌లో బాబ్ నిర్దేశించాడు. షోఘి ఎఫెండీ తన తరపున వ్రాయబడిన ఒకలేఖలో, ఒకప్పుడు మానవుని అనంత జీవాత్మచే మహనీయత నొందిన౎ మానవశరీరం పట్ల గౌరవాన్ని ప్రదర్శించడమే ఈ ఏర్పాటు యొక్క ఉద్దేశ్యమని వివరించాడు. 
మృతదేహాన్ని, మరణించిన స్థలం నుండి ఒక గంట ప్రయాణానికి మించి పట్టేంత దూరానికి తరలించరాదని - బహాయి శవఖనన శాసనం సంక్షిప్తంగా చెబుతున్నది; దేహాన్ని పట్టువస్త్రంలో గానీ, లేదా నూలుగుడ్డలో గానీ చుట్టి, “నేను దైవము నుండి ఆగమించి, దయాళువును, కరుణాళువును అగు ఆయన దివ్యనామమును దృఢముగ చేబూని, ఆయన వినా సర్వమును త్యజియించి, ఆయన కడకే తిరోగమించుచుంటి”నన్న ప్రవచనాలు చెక్కబడియున్న ఉంగరాన్ని వ్రేలికి ధరింపచేయాలి. శవపేటికను గాజుతో గాని, రాతితో గాని, దృఢమైన మేలుజాతి కలపతో గాని తయారుచేయించాలి. దివంగతునికై విశేష ప్రార్థన నిర్దేశించబడినది (చూ. వివరణ 10). శవాన్ని ఖననం చేయడానికి (పూడ్చిపెట్టడానికి) ముందే ఈ ప్రార్థనను చేయాలి. అబ్దుల్- బహా, షోఘీ ఎఫెండీలు ధృవీకరించినట్లు, ఈ శాసనం       మృతదేహదహనాన్ని నిషేధిస్తుంది. నిర్ణీత ప్రార్థనను పఠించడం, వ్రేలికి ఉంగరాన్ని ధరింపచేయడం వంటి ప్రక్రియలు కేవలం యుక్త వయస్సు అనగా 15 సంవత్సరాల ప్రాయం వచ్చి మరణించిన వారికే ఉద్దేశించబడినాయి (చూ. ప్ర.-జ. 70).

శవపేటిక తయారీకి వాడవలసిన మూల పదార్ధానికి సంబంధించి : అది శవపేటికను వీలైనంత దీర్ఘకాలం మన్నేలా ఉంచేది కావాలన్నదే ఈ శాసనం ఉద్దేశ్యం. అదే విధంగా అఖ్దస్ గ్రంథములో ప్రస్తావించబడిన పదార్థాలతోనే కాక, బాగా దృఢమైన కలపతో గాని, కాంక్రీటు మిశ్రమంతో గాని పేటికను తయారు చేయించడానికి అభ్యంతరం లేదని విశ్వన్యాయమందిరము వారు స్పష్టీకరించారు. ప్రస్తుతం బహాయిలకు ఈ విషయంలో, తమ అభిరుచికి తగినట్లు వ్యవహరించే స్వేచ్ఛ ఉంది.

150. బయాన్ కేంద్రము ¶129

బాబ్ తనకు అన్వయించుకొన్న బిరుదనామాలలో “బయాన్ కేంద్రము” ఒకటి.

151. పట్టు లేదా నూలు వస్త్రము లైదింటి యందున మృతుని చుట్టవలె ¶130

మృతదేహాన్ని ఐదు పట్టు వస్త్రములలొ లేదా ఐదు నూలు వస్త్రములలో చుట్టి ఉంచాలని బయాన్ లో బాబ్ పేర్కొన్నాడు. బహాఉల్లా ఈ నియమాన్ని ఆమోదిస్తూ, “పరిమిత వనరులు గలవారు వీటియందే రకముదైనను ఒక్క వస్త్రములో చుట్టిన చాలు” నన్న నిబంధనను జోడించాడు.

 ఈ శాసనంలో ప్రస్తావించబడిన “ఐదువస్త్రములు”, “పూర్తి నిడివిగల ఐదు గుడ్డలా” లేక “ఇప్పటి వరకు ఆచారముగా వాడుకలోనున్న ఐదు గుడ్డలా” అన్న ప్రశ్నకు బహాఉల్లా బదులిస్తూ: “ఐదు వస్త్రముల నుపయోగించుటే” దాని ఉద్దేశ్యమన్నాడు. (చూ. ప్ర.-జ. 56)

 దేహాన్ని వస్త్రములో చుట్టి వేసే విధానానికి సంబంధించి : బహాయి పవిత్ర రచనలలో దేహమును ఎలా చుట్టాలి - “ఐదు వస్త్రముల” లోనా లేక “ఒకే వస్త్రము” లోనా అన్నది నిర్వచింపబడలేదు. ప్రస్తుతం, తమకు సముచితమైన విధిని అనుసరించే స్వేచ్ఛ బహాయిలకు ఉంది.

152. నగరము నుండి ప్రయాణకాలము ఒక గంటకు మించునట్టి దూరమునకు మృతదేహమును తరలించుట మీకు నిషేధింపబడినది ¶130

మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించడానికై ఎంపిక చేసుకున్న వాహనంతో నిమిత్తం లేకుండా, ఈ ప్రయాణాన్ని పట్టే వ్యవధిని ఒక గంట కు పరిమితం చేయడమే ఈ శాసన పరమార్ధం. ఎంత త్వరగా అంత్యక్రియలు జరిగితే “అంత సముచితము, సమ్మతము” అని బహాఉల్లా ధృవీకరించాడు (చూ. ప్ర.-జ. 16).

ఒక వ్యక్తి పట్టణంలోనో, నగరంలోనో మరణించినట్లైతే, మరణించిన ప్రదేశం నుండి కాక, ఆ పట్టణం లేదా నగరం యొక్క వెలుపలి సరిహద్దునుండి శ్మశానానికి గల దూరమే పరిగణనలోకి తీసుకోబడుతుంది. మృతులకై బహాఉల్లా నిర్దేశించిన శాసనంలోని ఆంతర్యం : అతడు లేదా ఆమె మరణించిన చోటుకు సమీపంలోనే ఖననం చేయబడాలన్నదే.

153. ప్రయాణమునకు సంబంధించి బయాన్ గ్రంథమునందు విధియింపబడిన ఆంక్షలను దేవుడు తొలగించినాడు. ¶131

ప్రయాణానికి సంబంధించి బాబ్ కొన్ని పరిమితులను విధించాడు. అవి బయాన్ వాగ్దత్తపురుషుని ఆగమనం వరకు అమలులో ఉండేవి. ఆ కాలంలో విశ్వాసులు కాలినడకన పయనించి ఆయనను సందర్శించుకునే వారు; ఎందుకంటే, ఆయన దర్శనభాగ్యమే తమ ఉనికికి ఫలమనీ, లక్ష్యమనీ వారి భావన.

154. పావనప్రదేశములు రెండింటియందునను గల గృహ ద్వయమును, సకల దయామయుడగు మీ దేవుని సింహాసనము సంస్థాపితమైన యితర స్థలములను ప్రవృద్ధమొనరించి, ప్రస్తుతింపుడు. ¶133

 బహాఉల్లాచే “మహత్తరగృహ”మని పేర్కొనబడిన బాగ్దాదులోని ఆయన (బహాఉల్లా) గృహము, షిరాజ్ లోని బాబ్ గృహము - ఈ రెండూ కూడా “గృహద్వయము”గా బహాఉల్లాచే గుర్తించబడి, తీర్థయాత్రాక్షేత్రాలుగా నిర్దేశింపబడినాయి. (చూ. ప్ర.-జ. 29, 32, వివరణ 54). 

“మీ దేవుని సింహాసనము సంస్థాపితమైన యితర స్థలము” లనగా భగవంతుని దివ్యావతారమూర్తి నివసించిన యితర ప్రదేశాలని షోఘి ఎఫెండి వివరించాడు. “అవి నెలకొనియున్న ప్రాంతలవాసులు, దివ్యధర్మ సింహాసన ప్రతిష్ఠిత స్థలములయందన్నిటినీ, లేదేని ఒక్క దానినైనను సంరక్షింప సమకట్టవలె” నని  బహాఉల్లా ఉద్బోధించాడు (చూ. ప్ర.-జ. 32). బహాయి వ్యవస్థలు - భగవంతుని దివ్యావతారమూర్తు లిరువురితోను సంసర్గం గల ప్రదేశాలను గుర్తించి, వీలున్న సందర్భాలలో లిఖిత రూపేణా పత్రాలను ఏర్పరచి, ఆ విధంగా అనేక చారిత్రాత్మక ప్రదేశాలను స్వాధీనపరచుకుని, పూర్వస్థితికి తీసుకువచ్చాయి.

155. ఈ సజీవ దివ్యగ్రంథము చెప్పుదానిని ఆలకింపనీక, దివ్య గ్రంథమున పొందుపరచబడిన ఇంకేదైనను మీకు అవరోధము కలిగించు నేమో జాగరూకులై వర్తింపుడు. ¶134

“దివ్యగ్రంథము” అనగా భగవంతుని దివ్యావతారమూర్తిచే వెలువరింపబడిన ప్రవచన గ్రంథము. “సజీవ దివ్యగ్రంథము” అవతారమూర్తికి అన్వయిస్తుంది. 

 ఈ పదాలు బాబ్ తన పారశీక బయాన్‌లో - భగవంతుడు ప్రత్యక్షీకరింప జేయునాతడిని “సజీవ దివ్యగ్రంథ” మని సంకీర్తిస్తూ వెలువరించిన ప్రవచనాలకు అన్వయిస్తాయి. “భగవంతుని దివ్యగ్రంథము ఈ యువకుని రూపేణా అనుగ్రహీత మైన” దని తన దివ్యఫలకములలో ఒకదానిలో బహాఉల్లా స్వయంగా వివరించాడు.

 అఖ్దస్ గ్రంథము లోని ఈ దివ్యప్రవచనంలోనూ, ఇంకా 168వ పేరా లోను, బహాఉల్లా తననే స్వయంగా “సజీవ దివ్యగ్రంథము” గా వ్యవహరించుకున్నాడు. “సజీవ దివ్యగ్రంథము” లోని ప్రవచనాలను ఖండించేందుకై  “తమ పవిత్ర గ్రంథాలలో హేతువుల”ను వెతకకుండా జాగరూకులు కమ్మని ఆయన “ప్రతి యితర మత ధర్మానుయాయు” లను హెచ్చరిస్తాడు. ఆయన స్థాయిని గుర్తించడానికీ, ఈ నవీనావిష్కరణములోని దానిని దృఢంగా అవలంబించడానికి “దివ్యగ్రంథము” నందు పొందుపరచబడిన అంశాలు మిమ్ము ఆటంకపరచకూడదని ఆయన జనావళికి ఉపదేశించాడు.

156. నా యగ్రదూతయగు ఆయన లేఖిని నుండి, ఈ దివ్యావిష్కరణకు నివాళి ¶135

ఈ గ్రంథభాగంలో బహాఉల్లా ఉల్లేఖించిన నివాళి౎అనే పదం అరబ్బీ బయాన్ లోది.

158. బయాన్ విశ్వాసిని దక్క అన్యులను వివాహమాడుట శాసన విరుద్ధము. వివాహకాలమునకు కేవలమొక పక్షమే దివ్యధర్మము నవలంబించి యుండెనేని, అతని లేదా ఆమె సంపదలు రెండవ పక్షము నకు - దివ్యధర్మములోనికి పరివర్తనమొందనంత వరకును - శాసన విరుద్ధములగును. ¶139

ఇక్కడ బహాఉల్లా ప్రస్తావించిన బయాన్ గ్రంథభాగం “భగవంతుడు ప్రత్యక్షీకరించు నాతని” ఆగమనం ఆసన్నమైందన్న అంశాన్ని విశ్వాసుల దృష్టికి తీసుకువస్తుంది. బాబీ కాని స్త్రీని/పురుషుని వివాహమాడటం నిషేధం; ధర్మాన్ని అవలంబించిన భార్య/భర్త యొక్క ఆస్తి శాసనబద్ధ్దంగా బాబీ అయి ఉండనిభార్య/భర్తకు చెందదు - అన్న శాసనాన్ని బాబ్ తన వద్దనే నిలిపి ఉంచాడు; అది కాలక్రమంలో ఆచరణలోకి రాక పూర్వమే, బహాఉల్లాచే రద్దు చేయబడింది. ఈ శాసనాన్ని గురించి దీనిని వెలువరించడంలోని ఆంతర్యాన్ని స్పష్టీకరిస్తూ, బహాఉల్లా - తన (బహాఉల్లా) దివ్యధర్మపు పురోగతిని, అది తన (బాబ్) స్వీయధర్మంకనాన్న ముందుగా సాధింపబడటానికి గల సంభావ్యతను బాబ్ గ్రహించాడని వివరించాడు.

 షోఘి ఎఫెండి గాడ్ పాసెస్ బై లోబయాన్ గురించి వ్రాస్తూ : “దానిని భావితరాల వారికి శాశ్వత మార్గదర్శకమైన శాసన నిర్దేశముల నియమావళిగా పరిగణించుట కంటే, వాగ్దత్త పురుషుని శ్లాఘిస్తూ వ్రాసిన సంకీర్తనాగ్రంథంగా పరిగణించా” లని అన్నాడు. “ఉద్దేశ్యపూర్వకంగా అది ఏర్పరచిన నియమ నిబంధనలు చాలా కఠోరమైనవి. అది స్థాపించిన సిద్ధాంతములు ఉద్యమమై తరముల తరబడి జడత్వముందున్న మతాధిపతులను, ప్రజలను మేల్కొలుపుటకు ఎంచుకొని, పనికిరాని దోషపూరిత వ్యవస్థలకు వినాశకరమైన ఆకస్మిక విఘాతాన్ని కలిగింపజేసి, దైవప్రవక్త తనకు పూర్వమున్న విధానాలను త్రోసిపుచ్చిన చందమున, తనకు ముందున్న దానిని విధ్వంసము చేయునని న్యాయాధిపతి సమక్షమునకు రమ్మని ఆజ్ఞాపించువాడు, నిష్కర్ష ప్రకర్షము నెఱపు దినమావిర్భవించెనని ఘోషించిన”దని ఆయన వివరించాడు.

159. బయాన్ కేంద్రము ¶140

బాబ్ బిరుదనామాలలో ఒకటి.

160. యదార్ధమునకు, ఏకైకుడను, తుల్యరహితుడను, సర్వజ్ఞుడను, సకల ప్రాజ్ఞుడను అగు నేను తప్ప వేరొక దేవుడు లే’డని . . . ¶143

భగవంతుని దివ్యావతారమూర్తి స్వభావాన్నీ, భగవంతునితో ఆయనకు గల సంబంధాన్నీ వర్ణించే గ్రంథభాగాలు అనేకం బహాయి పవిత్ర రచనలలో ఉన్నాయి. దైవత్వపు భావాతీత స్వభావాన్నీ, ఏకత్వాన్నీ బహాఉల్లా బలపరిచాడు. ఆయన యిలా వివరిస్తాడు: “తన సృష్టితో సత్యదేవునికి ప్రత్యక్షానుబంధం వుండనందున, భగవంతుడు ప్రతి యుగము నందునను విమలము, నిష్కళంకమునగు ఆత్మను, భూస్వర్గముల సామ్రాజ్యముల యందున సాక్షాత్కరింప జేయును.” “అగోచరుడును, గ్రహణసాధ్యుడును కాని” ఈ దివ్యావతారమూర్తి, “భౌతిక ప్రపంచము” నకు వర్తించు మానవీయ స్వభావమును, భగవదాత్మజనిత పదార్థమగు ఆధ్యాత్మిక స్వభావమును కలిగి యుంటాడు. ఆయనకు “రెండు స్థానములు” సైతము అనుగ్రహింపబడతాయి. 

ఆయన అంతఃకరణ సత్యస్వరూపాన్ని ప్రతిబింబించి భగవద్వాణియే ఆయన వాణియని నిర్థారించేదే ఆయన ప్రథమస్థాయి ... దిగువ దివ్య ప్రవచనములచే వైశిష్ట్యమునొందిన మానవీయ స్థాయి ద్వితీయస్థాయి: “నేను మీ వలె మనిషినే.” “వచించు: నా దేవుడు సంకీర్తితుడగు గాక ! నేను మనిషి కంటే అధికుడైన దైవప్రవక్తనా?”

ఆధ్యాత్మిక లోకంలో సమస్త దివ్యావతారమూర్తుల మధ్య “విశిష్ట సమైక్యత” ఉన్నదని బహాఉల్లా ధృవీకరించాడు. వారందరూ “భగవంతుని సౌందర్యమును” వెలువరించి, ఆయన స్వభావ నామధేయములను సాక్షాత్కరింపచేసి, ఆయన దివ్యావిష్కరణాన్ని ఎలుగెత్తి చాటుతారు. ఇందుకు సంబంధించి, ఆయన యిలా అంటాడు: 

సమస్త దివ్యావతారములయందలి ఏ యవతారమైనను “నేనే దేవుడ!”నని ప్రకటించునేని, ఆయన నిక్కముగా సత్యమునే వచియించినట్లు. వారి దివ్యావిష్కరణ మూలమున వారి స్వభావ నామధేయముల ద్వారా భగవదావిష్కరణము, ఆయన స్వభావ నామధేయములూ, ప్రపంచమున పలుమారులు ప్రత్యక్షీకృతములైనవని విదితమైనది. 

భగవంతుని దివ్యావతారములు భగవంతుని నామాలనూ, ఆయన సద్గుణాలనూ ప్రతిఫలిస్తూ, మానవాళి పొందిన దైవజ్ఞానానికీ, ఆయన ఆవిష్కరణ పరిజ్ఞానానికీ కారణభూతులయ్యారు. అవతారపురుషులను ఎన్నటికీ “అగోచర సత్యంతో, స్వయంగా దైవసారమే అయిన వారిని ఎరుగనలవి కా” దని షోఘి ఎఫెండి వివరించాడు. బహాఉల్లాకు సంబంధించి ధర్మసంరక్షకుడు యిలా వ్రాశాడు : “మహత్తరమైన దైవావిష్కరణమునకు వాహనమై యుండిన మానవ దేవాలయమును” భగవంతుని “నిత్యత్వము” తో పోల్చరాదు.

బహాఉల్లా అద్వితీయతను, ఆయన దివ్యావిష్కరణపు ఘనతను ఉగ్గడిస్తూ షోఘి ఎఫెండి “దైవ దినం” గురించి పూర్వయుగాల పవిత్ర మతగ్రంథాలలో ప్రవచించబడిన ప్రవక్తృత్వ వాగ్దానాలన్నీ బహాఉల్లా ఆగమనంతో నెరవేరినాయని ఉద్ఘాటించాడు :
 
ఇజ్రాయల్‌కు ఆయన నిక్కముగా “దశసహస్రసిద్ధు”లతో భువికి దిగివచ్చిన “ఆద్యంతరహిత పితరుడు” “దివ్యదండనాథుని” అవతార సదృశుడు ; క్రైస్తవలోకానికి “పరలోకమందున్న తండ్రి మహిమతో” తిరిగి వచ్చిన క్రీస్తు; షియా ముస్లిమ్‌లకు ఇమాం హుస్సేన్ పునరావిర్భావం; సున్నీ ముస్లిమ్‌లకు దిగివచ్చిన “దైవాత్మ” (యేసుక్రీస్తు); జొరాస్ట్రియన్లకు వాగ్దత్తుడైన “షా బహ్రాము”; హిందువులకు శ్రీకృష్ణుని అవతారం; బౌద్ధ్దులకు పంచమ బుద్ధుడు.

దివ్యావతారమూర్తులందరికీ తనకూగల “దివ్యత్వ” స్థాయిని బహాఉల్లా ఇలా వర్ణించాడు :

...తనయందు గతించి భగవంతుని యందు జీవించు స్థాయి దివ్యత్వమును గురించి నేనెప్పుడు ప్రస్తావించినను అది నా పరిపూర్ణ అత్మోపేక్షతను చూపును. నా శ్రేయస్సుపై గాని, నా శోకముపై గాని, నా పునరుత్థానముపై గాని నా నియంత్రణ లేని స్థాయి యిది. 

ఇక భగవంతునితో తనకు గల అనుబంధాన్ని గురించి ఆయన యిలా ధృవీరిస్తున్నాడు:

ఓ నా దేవా! నన్ను నీతో అనుసంధించి యుంచే సంబంధాన్ని నేను తలచుకొనినప్పుడు “నిశ్చయముగా నేనే దేవుడ!” నని సమస్త జీవకోటికి ప్రకటింప నెంతును. ఎప్పుడైతే నా స్వీయతను పరిగణించుకొందునో, ఏమని చెప్పను, మట్టికన్నా హీనమైనదని భావింతును.

161. జకాత్ సమర్పణ ¶146

క్రమబద్ధముగ చెల్లింపవలసినదిగా ఖురాన్ లో ముస్లిమ్‌లకు విధించబడిన దాన సమర్పణకు అన్వయమే ఈ జకాత్. కాలక్రమంలో ఈ కల్పన దానశుల్కంగా ప్రవృద్ధమై, కొన్ని ఆదాయవర్గాల వారికి, తమ ఆదాయాలలో కొంత భాగాన్ని సమర్పించవలసిన బాధ్యతగా, నియమిత పరిమితులకు అతీతంగా, పేదల ఉపశమనానికి, వివిధ దానకార్యాలకు, దైవధర్మావసరాలకు వినియోగించేందుకు వీలుగా విధించబడింది. మినహాయింపు పరిమితి వివిధ వస్తువులకు వేర్వేరుగా, చెల్లింపుకు అర్హమయ్యే మొత్తంపై కొంత శాతంగా ఉంటుంది.

బహాయి జకాత్ శాసనం “ఖురాన్ నందావిష్కృతమైనదాని” ననుసరించి ఉంటుందని బహాఉల్లా స్పష్టీకరించాడు (చూ. ప్ర.-జ. 107). మినహాయింపు పరిమితి, సంబంధిత ఆదాయ వర్గాలు, చెల్లింపులు ఎన్ని సార్లు చేయాలి, వివిధ వర్గాలకు జకాత్ అనువర్తించే వెలల తులనకు సంబంధించి ఖురాన్‌లో ప్రస్తావించ బడనందువల్ల, ఈ అంశాలను భవిష్యత్తులో విశ్వన్యాయమందిరము వారు నిర్ధారించవలసి ఉన్నది. అటువంటి శాసనము ఇంకా చేయవలసిఉన్నందువల్ల విశ్వాసులు తమతమ వీలును, వనరుల ననుసరించి యధాశక్తి బహాయి నిధికి విరాళాలను సమర్పిస్తూ ఉండాలని షోఘి ఎఫెండి సూచించాడు.

162. భిక్షాటన శాసనవిరుద్ధము, భిక్షువునకిడుట నిషిద్ధము. ¶147

ఒకానొక దివ్యఫలకంలో అబ్దుల్‌బహా, ఈ దివ్యప్రవచన పరమార్ధాన్ని యిలా వ్యాఖ్యానించాడు : “భిక్షాటనం నిషేధించబడినది, భిక్షాటనమును వృత్తిగా చేపట్టిన వారికి దానము చేయుట కూడా నిషేధించబడినది.” అదే ఫలకంలో ఆయన యింకా ఇలా సూచించాడు : “భిక్షాటనను సమూలంగా రూపుమాపుటే లక్ష్యం. అయినప్పటి కిని, నిస్సహాయతవల్లనో, కటికపేదరికం వల్లనో జీవనోపాధిని ఆర్జించుకొనుట ఒక వ్యక్తికి దుర్లభమైనపుడు, ఆతనికి జీవనాధారముగ నెలసరి భత్యమును ఏర్పాటు చేయవలసిన బాధ్యత ధనవంతుల కులేదా ఉపప్రతినిధులకు విధించబడినది . . . ఉపప్రతినిధులనగా ప్రజాప్రతినిధులని అర్థం. న్యాయ మందిర సభ్యులని కూడా చెప్పవచ్చు.”

పేదవారికి, అవసరంలో ఉన్నవారికి వ్యక్తులు లేదా ఆధ్యాత్మిక సభలు ఆర్థిక సహాయం చేయడానికి కాని, వారికి తమ జీవనోపాధిని ఆర్జించుకొనే నైపుణ్యాన్ని పొందే అవకాశాలను కల్పించడానికి గాని - దానసంబంధమైన ఈ నిషేధం అవరోధం కాజాలదు.

163. పరుల దుఃఖమునకు కారకులైన వారెవ్వరి కైననుఇతఃపూర్వము . . . అపరాధరుసుము . . . విధియింప బడినది ¶148

పొరుగు వానికి దుఃఖం కల్గించిన వ్యక్తి నష్టపరిహారంగాచెల్లించవలసిన అపరాధ రుసుమునకు సంబంధించి, పర్షియన్ బయాన్‌లో నిర్దేశితమైన శాసనాన్ని బహాఉల్లా రద్దుపరిచాడు.

164. పవిత్ర జీవనవృక్షము ¶148

“పవిత్ర జీవనవృక్షము” అనబడేది “తదుపరి తెరువేదియులేని తరు” వైన సద్రతుల్-ముంతహాకు అన్వయిస్తుంది. (చూ. వివరణ 128). బహాఉల్లాను సూచించడానికి ఇక్కడ వాడబడింది.

165. ఉదయ సాయంసంధ్యలయందున భగవత్ప్రవచనముల నాలపింపుడు. ¶149

“భగవత్ప్రవచనము” లను ఆలపించడానికి విశ్వాసులకు ఉండవలసిన “ప్రథమావశ్యకత” “భగవత్ప్రవచనమును పఠింపవలెనను ఆసక్తి, ప్రేమ” అని బహాఉల్లా వివరిస్తున్నాడు (చూ. ప్ర.-జ. 68).

“భగవత్ప్రవచనములు” అనే పదానికి నిర్వచనానికి సంబంధించి వివరిస్తూ, “దివ్యోచ్చారణాస్వర్గము నుండి అనుగ్రహీతమైన సర్వస్వము” నకు ఇది అన్వయిస్తుందన్నాడు బహాఉల్లా. ప్రాచ్యదేశాలకు చెందిన ఒక విశ్వాసికి వ్రాసిన లేఖలో షోఘీ ఎఫెండి “భగవత్ప్రవచనములు” అనే పదాన్ని విశదీకరిస్తూ, అందులో అబ్దుల్-బహా రచనలు అంతర్భాగం కావన్నాడు. అదే విధంగా, తన స్వీయరచనలకు కూడా ఆ పదం వర్తించదని ఆయన సూచించాడు.

166. ప్రతి పంధొమ్మిది సంవత్సరములు గడిచిన పిదప, మీ గృహోప కరణములను నవీకరించుకొనుట మీకు నిర్దేశితమైనది  ¶151

ప్రతి పంధొమ్మిది సంవత్సరాలకు ఒకసారి గృహోపకరణాల నవీకరణకు సంబంధించి అరబ్బీ బయాన్‌లో గల ఆదేశాన్ని ఆచరణకు శక్యమైతే ఆచరించవలసిందిగా   బహాఉల్లా ఆమోదించాడు. అబ్దుల్-బహా ఈ నిర్దేశాన్ని శుచిశుభ్రతల పెంపుదలకు వర్తింపజేశాడు. గృహోపకరణాలు పాతబడిపోయి, శోభావిహీనములై, అసహ్యతను కలిగించకుండా ఉండేలా నవీకరించాలన్నదే ఈ శాసనోద్దేశ్యమని ఆయన వివరించాడు. అరుదైన లేదా నిక్షిప్త వస్తువులకు, పురాతన కళాఖండాలు, ఆభరణాలకు ఇది వర్తించదు.

167. మీ పాదములను ప్రక్షాళనమొనరింపుడు. ¶152

సక్రమంగా స్నానంచేసి, పరిశుభ్రమైన దుస్తులను ధరించి, సాధారణంగా శుచి, శుభ్రతలకు మూలంగా ఉండాలని విశ్వాసులకు కితాబ్-ఎ-అఖ్దస్‌లో ఉపదేశించ బడింది. సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఈ. 3. ఝ. 1-7 తత్సంబంధిత నియమాలను క్లుప్తంగా వివరిస్తుంది. పాద ప్రక్షాళనకు గోరువెచ్చని నీటిని ఉపయోగించడం వాంఛనీయమైనప్పటికీ, చల్లని నీటిని కూడా ఉపయోగించ వచ్చునని బహాఉల్లా వివరించాడు. (చూ. ప్ర.-జ. 97).

168. మీరు అధ్యాసనములను ఉపయోగించ నిషేధించబడినారు. మీకై దైవప్రవచనము నాలపింపనెంచిన యాతడు వేదికపై నేర్పరుపబడిన కుర్చీలో కూరుచుండి, సమస్త మానవజాతికిని, తనకును ప్రభువగు దేవదేవుని స్తుతియించు గాక. ¶154

ఈ నియమాలకు పారశీక బయాన్ లో పూర్వప్రస్తావన ఉన్నది. ధర్మోపన్యాసాలను చేయడానికీ, దివ్యగ్రంథ పఠనానికీ గాను అధ్యాసనాలను (బాగా ఎత్తుగా ఉండే ఆసనాలను) ఉపయోగించడాన్ని నిషేధించాడు. అందుకు బదులుగా, భగవత్ప్రవచ నాన్ని స్పష్టంగా అందరూ ఆలకించేందుకు వీలుగా ఉపన్యాసకునికై ఒక కుర్చీని వేదికపై ఏర్పాటు చేయవచ్చునని పేర్కొన్నాడాయన.

 ఈ శాసనం గురించి అబ్దుల్-బహా, షోఘి ఎఫెండీలు వ్యాఖ్యానిస్తూ, ఆరాధనా మందిరములలో (అంటే ధర్మోపన్యాసాలు నిషేధింపబడి కేవలం పవిత్ర గ్రంథపఠన చేయవలసినటువంటి చోట్ల) పాఠకుడు నిలిచి కాని, కూర్చొని కాని ఉండాలని, అందరికీ చక్కగా వినబడేందుకై - అవసరమైతే చరసాధనమైన చిన్న వేదికను ఉపయోగించేందుకు అనుమతించవచ్చునని వివరించారు. అలాగే, ఆరాధనా మందిరములో కాకుండా, యితర ప్రదేశాలలో జరిగే సమావేశాల విషయంలో కూడా కూర్చొనడానికి, నిలిచిఉండటానికి, వేదికను ఉపయోగించడానికి ఉపన్యాసకుని అనుమతించవచ్చు. ఏ ప్రదేశంలోనైనా, అధ్యాసనాలను ఉపయోగించడం మాత్రం నిషిద్ధమని పునరుద్ఘాటిస్తూ, సమావేశాలలో ప్రసంగించేటప్పుడు బహాయిలు అత్యంత వినయపూర్వకమూ, పరిత్యాగ పూరితమూ అయిన వైఖరిని అవలంబించాలని అబ్దుల్-బహా ఒక ఫలకంలో నొక్కి చెప్పాడు.

169. జూదము ¶155

ఈ నిషేధంలో చేర్చబడిన కృత్యాలు బహాఉల్లా పవిత్ర లేఖనాలలో సంక్షేపింపబడిలేవు. ఈ నిషేధానికి వర్తించే వివరాలను ప్రత్యేకించే బాధ్యత విశ్వన్యాయమందిరానిదేనని అబ్దుల్-బహా, షోఘి ఎఫెండి ఇరువురూ సూచించారు. లాటరీలు, గుర్రపు పందెములు, ఫుట్‌బాల్ క్రీడలు, బింగో వంటి వాటిపై పందెములు కాయడం వంటివి ఈ నిషేధంలో చేర్చబడ్డాయా అన్న ప్రశ్నకు - ఈ అంశం భవిష్యత్తులో సవివరంగా పరిశీలించబడుతుందని విశ్వన్యాయ మందిరము వారు బదులిచ్చారు. అలాగే - ఈ విషయాలను వివాదాస్పదం చేయక విశ్వాసుల వివేచనకే వదలివేయడం మంచిదని స్థానిక ఆధ్యాత్మిక సభలకు, వ్యక్తులకు సలహా ఇవ్వడం జరిగింది. 
 
దివ్యధర్మం కోసమని లాటరీలు, చీట్లు వేయటం, అదృష్టవశమై ఉన్న ఆటలు మొ. వాటి ద్వారా నిధులను సేకరించడం సముచితం కాదని విశ్వన్యాయ మందిరము వారు నిబంధన చేశారు.

170. నల్లమందు సేవనమును . . . మానవ దేహమునకు మాంద్యము ను, భారమును కలిగించి, హానిచేయు ఎట్టి పదార్ధమును . . . ¶155

కితాబ్-ఎ-అఖ్దస్ లోని చివరి పేరా లో గంజాయి వినియోగంపై నిషేధం బహాఉల్లాచే పునరుద్ఘాటించబడింది. ఇందుకు సంబంధించి షోిఘి ఎఫెండి, “నిష్కళంక, పవిత్రజీవనము” నకు వలసిన అవశ్యకాలలో ఒకటి “గంజాయి సేవనమును, అలాంటి దురలవాటుకు దారితీసే మరికొన్ని మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా వర్జించడం” అని చెప్పాడు. గంజాయి ఉత్పత్తులైన హెరాయిన్, హాషిష్, మార్జువానా వంటి యితర ఉత్ప్రేరకాలు, అలాగే ఎల్.ఎస్.డి. వంటి భ్రాంతికారకాలు, పెయోట్ (అమెరికన్ దేశాలలో పెరిగే ఒక విధమైన జెముడు మొక్కలనుండి తయారయ్యే మాదకద్రవ్యం) వంటి పదార్థాలు ఈ నిషేధం క్రిందికి వచ్చేవిగా పరిగణించబడతాయి. 

అబ్దుల్-బహా యిలా వ్రాశాడు : 

గంజాయికి సంబంధించి - అదొక దుర్గంధపూరితమూ, అసహ్యకరమైనదిన్నీ. అలాంటి దానిని వినియోగించే వానికి విధించబడే శిక్ష నుండి భగవంతుడు మనలను రక్షించు గాక. విస్పష్ట పరమ పవిత్ర గ్రంథము ప్రకారం ఇది నిషేధించబడినది. దీని వినియోగం నిష్కర్షగా గర్హింపబడినది. గంజాయిసేవనమొకవిధమగు ఉన్మాదము. దానిని వినియోగించువాడు పూర్తిగా మానవ ప్రపంచము నుండి తొలగిపోవునని సహేతుకముగ స్పష్టమగుచున్నది. మానవత్వపు పునాదిని శిధిలాలలోనికి నెట్టి, దానిని వినియోగించు వానిని శాశ్వతముగ నిర్వీర్యుని గావించు ఈ అత్యంత అసహ్యకరమగు అలవాటునుండి భగవంతుడు అందరినీ కాపాడు గాక. గంజాయి ఆత్మను బంధించి వేస్తుంది. కనుక దానిని పానం చేసిన వాని విచక్షణ క్షయిస్తుంది. అతని మేధస్సు ఒత్తిడికి గురై, అతని గ్రాహ్యశక్తులు హరిస్తాయి. అది ఆతనినిజీవచ్ఛవముగా మార్చివేయును; సహజోష్ణతను తగ్గించి వేయును. గంజాయి చేయు హాని కన్న గొప్పహానిని కలిగించున దేదియును లేదు. దాని పేరును సైతము పలుకనొల్లనివారు ధన్యులు; మరి, దానిని సేవించు వాడెంతటి భాగ్యవిహీనుడో ఒకింత యోచింపుడు. 
ఓ భగవత్ప్రేమికులారా ! సర్వశక్తుడైన దేవుని ఈ యుగము నందు హింసాదౌర్జన్యములును, నిర్బంధదమనకాండలు మున్నగునవన్నియును గర్హింపబడినవి. అయితే, ఏ విధముగానైనా గంజాయి వినియోగమును నిర్మూలించుట కాజ్ఞయైనది, తద్వారా దైవవశమున మానవజాతి శక్తివంతమగు ఈ మహమ్మారి నుండి విముక్తిని పొందవచ్చు. అట్లు చేయలేని వాడు భగవంతుని యెడ తన బాధ్యతను విస్మరించినవాడై దుఃఖ, దౌర్భాగ్యముల పాలగును. 

తన ఫలకములయం దొకదానిలో అబ్దుల్-బహా గంజాయిని గురించి యిలా వివరించాడు : “వినియోగదారుడు, క్రయదారుడు, విక్రయదారుడు - అందరును భగవంతుని వదాన్యతకును, ఔదార్యమునకును దూరులే.”

ఇక, వేరొక ఫలకములో అబ్దుల్-బహా యిలా వ్రాశాడు :

కొందరు పారశీకులు హషిష్‌ను వాడుట కలవడినారని నీవు  వ్రేలెత్తి చూపిన దాని గురించి. దేవుడు దయామయుడు ! ఇది మాదక ద్రవ్యములలోకెల్లా తుచ్ఛమైనది, దీని ఉపయోగం విస్పష్టంగా నిషేధింప బడినది. ఇది యాలోచనను శైధిల్యము గావించి , ఆత్మకు సంపూర్ణ మాంద్యమును కలుగజేయును. ఎవ్వడైనను ఈ పైశాచిక వృక్షఫలము నాశించి, తన వంతు నంది, రాక్షస ప్రవృత్తులకు దృష్టాంతముగ నెటుల నిలువగలడు? ఈ నిషిద్ధ మాదకద్రవ్యమును వినియోగించి, సకల దయామయుని అనుగ్రహమున కేల దూరము కాదలచినాడు ?

సారాయి మేధస్సును క్షీణింపచేసి మానవునిచే ననుచిత కృత్యములకు పాల్పడజేయును. కాని గంజాయి - ఈ పైశాచిక వృక్ష ఫలము, దుష్ట హాషిష్ మెదడును నాశము గావించి, జీవనమును ఘనీభవింప జేసి ఆత్మను పాషాణతుల్యము గావించి కాయమును వ్యర్ధపరచి మనిషిని సర్వనాశనము చేసి వదలివేయును.

అయితే, ఈ నిషేధం - అర్హులైన వైద్యులు చికిత్సలో భాగంగా కొన్ని రకాలకు చెందిన మాదకద్రవ్యాల వినియోగాన్ని సూచించిన సందర్భాలలో అనువర్తించదని గమనించాలి.

171. “మహావ్యత్యస్తమర్మము సార్వభౌమ చిహ్నముగ” ¶157

“బాబ్ దివ్యధర్మాగమనమును ముందుగానే చాటిన తేజస్వీద్వయంలో ప్రథముడు,” షేఖ్ సాంప్రదాయ స్థాపకుడూ అయిన షేఖ్ అహ్మద్-ఇ-అహ్సాయి (1753-1831) - వాగ్దత్త పురుషుని సాక్షాత్కారంతో సర్వమును తారుమారై మొదటిది చివరిదిగా, చివరిది మొదటిదిగా మారిపోతాయని భవిష్యదర్శనం చేశాడు. తన దివ్య ఫలకముల యందొక దానిలో బహాఉల్లా “మహావ్యత్యస్తమర్మము సార్వభౌమ సంకేతము” యొక్క “చిహ్నమును సాదృశ్యము” ను సూచిస్తూ, “ఈ వ్యత్యస్తత ద్వారా ఆయన ఉచ్చమును నీచముగను, నీచమును ఉచ్చముగను చేయు”నని వివరించాడు. “యేసుక్రీస్తు రోజులలో ఘనత వహించిన జ్ఞానకోవిదులు, విద్యాసంపన్నులు, మతాధిపతులు ఆయనను తృణీకరింప, విధేయులైన జాలరులు దివ్యసామ్రాజ్యప్రవేశప్రాప్తికి త్వరపెట్టబడ్డా” రని గుర్తుచేశాడాయన (చూ. వివరణ 172 కూడా). షేఖ్ అహ్మద్-ఇ-అహ్సాయి గురించిన అదనపు సమాచారానికై చూ. ది డాన్ బ్రేకర్స్ లోని 1 నుండి 10 వరకు గలఅధ్యాయాలు .

172. ‘ధర్మబద్ధమైన’ ఈ ‘అలీఫ్’ సద్గుణముచే పెంపొందింపబడిన “షష్ఠి” ¶157

షేఖ్ అహ్మద్-ఇ-అహ్సాయి, తన రచనలలో అరబ్బీ అక్షరం “వవ్‌” ను గురించి నొక్కి వక్కాణించాడు.  ఈ అక్షరం గురించి ది డాన్ బ్రేకర్స్ లో వివరిస్తూ, నబీల్: ఇది - బాబ్ కూ, నవీన దివ్యావిష్కరణ యుగాగమనానికీ సంకేతం గాను, కితాబ్-ఎ- అఖ్దస్ లో బహాఉల్లా చే “మహావ్యత్యస్త మర్మము” నకు “సార్వభౌమచిహ్నము” నకు సాదృశం గాను చెప్పబడిందని పేర్కొన్నాడు. 

 “వవ్‌”  అక్షరనామంలో వవ్, అలీఫ్, వవ్ (వ, అ, వ) అను మూడు అక్షరాలు ఉన్నాయి. అబ్జాద్ గణనను అనుసరించి, ఈ మూడింటి సాంఖ్యక విలువలు క్రమంగా - 6, 1, 6. ప్రాగ్దేశీయుడైన ఒక విశ్వాసికి షోఘి ఎఫెండి తరపున వ్రాయ బడిన ఒక లేఖలో, కితాబ్-ఎ-అఖ్దస్ లోని ఈ దివ్యప్రవచనం వ్యాఖ్యానించబడింది. ‘ధర్మబద్ధమైన’ ఈ అలీఫ్* బాబ్ ఆగమనానికి అన్వయిస్తుందని, సాంఖ్యక విలువ 6 గా గల మొదటి అక్షరం అలీఫ్‌కు ముందుగా వస్తూ, బాబ్‌కు పూర్వ యుగాలను భగవంతుని అవతారాలను సూచిస్తుండగా, సాంఖ్యక విలువ 6 గా కలిగి అలీఫ్ తర్వాత వచ్చే మూడవ అక్షరం - ప్రత్యక్షీకృతుడైన బహాఉల్లా పరమావిష్కరణకు వర్తిస్తుందని ఆయన వివరించాడు.

173. అత్యవసరమైతే తప్ప సాయుధులై చరియించుట మీకు నిషేధించబడినది ¶159

అత్యవసర పరిస్థితులలో తప్ప ఆయుధధారణ శాసనవిరుద్ధమన్న బయాన్ ఆదేశాన్ని బహాఉల్లా ఆమోదించాడు. విశ్వాసికి ఆయుధాలను ధరించి ఉండవలసిన “అత్యవస” రాన్ని - ప్రమాదకర పరిస్థితులలో ఆత్మరక్షణ నిమిత్తమై- అబ్దుల్-బహా అనుమతించాడు. తన తరపున వ్రాయబడిన ఒక లేఖలో, షోఘి ఎఫెండి కూడా - అత్యవసర పరిస్థితులలో, విజ్ఞాపన చేయడానికి చట్టబద్ధమైన అధికార వ్యవస్థ అందుబాటులో లేనప్పుడు బహాయిలు తమను తాము రక్షించుకోవడం న్యాయబద్ధమేనని వివరించాడు. ఆయుధాలను ధరించి, శాసనబద్ధంగా వాటిని వినియోగించే సందర్భాలెన్నో ఉన్నాయి; ఉదాహరణకు కొన్ని దేశాలలో ప్రజలు తమ అన్నవస్త్రాలకై సాగించే వేట. అదే విధంగా అస్త్రవిద్య, విలువిద్య, సాముగరిడీల సాధనల వంటి విషయాలలో ఆయుధధారణ అవసరమౌతుంది.

బహాఉల్లా చే విశదపరచబడి, షోఘీ ఎఫెండీ చే విస్తృతపరచ బడిన సామాజిక స్థాయిలో సామూహిక భద్రతా సూత్రము (చూ. గ్లీనింగ్స్ ఫ్రమ్ ది రైటింగ్స్ ఆఫ్ బహాఉల్లా, 117వ పరిచ్ఛేదము), (చూ. ది వరల్డ్ ఆర్డర్ ఆఫ్ బహాఉల్లా లో సంరక్షకుని లేఖలు) సేనల రద్దు విషయంలో పూర్వోహ చేయదు; అయితే, “సేనను న్యాయసేవకునిగా చేయు విధానమును నిర్దేశిస్తుంది.” “ప్రజా ప్రభుత్వం యొక్క వివిధాంగముల సమగ్రతను” కాపాడే అంతర్జాతీయ శాంతిసేన ఏర్పాటును కల్పిస్తుంది. బిషారత్ అనే ఫలకములో బహాఉల్లా - యుద్ధములో ఉపయోగించే “ఆయుధము లన్నియు పునర్నిర్మాణోపకరణములుగా పరివర్తితములై, మానవుల మధ్యనున్న కలహములు, విరోధములు తొలగిపోవలె”నన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు.

అదే ఫలకములో ఆయన సకల మతానుయాయులతో సౌహార్ద్రభావనతో వ్యవహరించడానికి గల ప్రాధాన్యతను నొక్కి చెప్పాడు; “పవిత్రయుద్ధ భావన యనునది - దివ్యగ్రంథము నుండి తొలగించి వేయబడిన” దనికూడా వివరించాడాయన.

174. పట్టువస్త్రములను ధరియించుకొనుట మీకనుమతింప బడినది. ¶159
ముస్లిం సాంప్రదాయం ప్రకారం పురుషులు పట్టు వస్ర్తాలను ధరించడం సాధారణముగా - ధర్మరక్షణార్ధమై చేసే యుద్ధసమయంలో తప్ప - నిషేధించ బడింది. ఖురాన్ గ్రంథప్రవచనాలు ప్రాతిపదికగా గావింపబడని ఈ నిషేధాన్ని, బాబ్ రద్దు చేశాడు.

175. దేవదేవుడు . . . వస్త్రధారణ, గడ్డపు కత్తిరింపుల విషయమున పూర్వానువర్తిత ప్రతిబంధకముల నుండి మిమ్ము విముక్తులను గావించినాడు. ¶159

ప్రపంచ మత సాంప్రదాయాలలో వస్త్రధారణకు సంబంధించిన నియమాలెన్నో ఉన్నాయి. ఉదాహరణకు షియా మతాధిపతులు తమకై విశేషమైన పొడవాటి అంగీని ధరించడానికి ఎంచుకొన్నారు; ఒకప్పుడు ప్రజలకు ఐరోపా వస్త్రధారణను నిషేధించారు. ముస్లిం ఆచారంలో తమ ప్రవక్త ఆచారానికి సమతూగేలా ఉండాలని మీసాల కత్తిరింపులోను, గడ్డపు నిడివి విషయంలోను రకరకాల నిబంధనలను ప్రవేశపెట్టారు.

వస్త్రధారణ, గడ్డం విషయంలో ఉన్న అటువంటి పరిమితులనన్నింటిని బహాఉల్లా తొలగించాడు. ఆయా అంశాలను వ్యక్తుల నిర్ణయానికే వదలివేసినా, విశ్వాసులు ఔచిత్యావధులు దాటకుండా ప్రతి విషయంలోను మితాన్ని పాటించాలని ఉద్బోధించాడు.

176. ఓ కాఫ్, రా భూభాగమా! ¶164

ఇరాన్‌లోని ఒక మారుమూల ప్రదేశమైన కిర్మాన్ పేరులోని మొదటి రెండు అక్షరాలే -- కాఫ్ (కి), రా (ర్).

177. నీ నుండి గోప్యముగ, అపహృతమై వెలువడు దానిని సైతము గ్రహియింతుము. ¶164

ఇది కిర్మాన్ నగరంతో సంబంధాన్ని కలిగియుండి, అజలీలుగా పిలువబడే మీర్జా యాహ్యా (చూ. వివరణ 190) అనుచర బృందపు కుతంత్రాలకు అన్వయిస్తుంది. ఆ బృందంలో ముల్లా జాఫర్, అతని కుమారుడు షేఖ్ అహ్మద్-ఇ-రూహీ, మీర్జా ఆఖా ఖాన్-ఇ-కిర్మాని (ఈ ఇద్దరూ మీర్జా యాహ్యా అల్లుళ్లు), ఇంకా మీర్జా అహ్మద్- ఇ-కిర్మానీలు కలిసి ఉన్నారు. వారు దివ్యధర్మాన్ని అణగద్రొక్క డానికి సమకట్టడమే కాక, నసీరుద్దీన్ షా పై హత్యాయత్నానికి దారి తీసిన రాజకీయకుట్రలలో భాగస్వాము లయ్యారు.

178. మహమ్మద్ హసన్ నామధేయము గల షేఖ్‌ను స్ఫురణకు దెచ్చికొనుడు. ¶166

బాబ్‌ను షియా ముస్లిం వర్గానికి చెందిన ప్రముఖ ప్రబోధకులలో ఒకడైన షేఖ్ మహమ్మద్ -హసన్ తిరస్కరించాడు. అనేక షియా ధర్మశాస్త్ర సంపుటాలకు కర్త ఐన ఈ హసన్ 1850 ప్రాంతంలో మరణించినట్లు తెలుస్తున్నది. 

 నజఫ్‌లో ముల్లా అలీహ్ బస్తామికీ, జీవాక్షరులలో ఒకడైన షేఖ్ మహమ్మద్ హసన్‌కు మధ్య జరిగిన ముఖాముఖి సమావేశాన్ని ది డాన్ బ్రేకర్స్ లో నబీల్ వర్ణించాడు. సమావేశం జరిగే సమయంలో ముల్లా అలీ, బాబ్ సాక్షాత్కారాన్ని ప్రకటించి ఆయన ఆవిష్కరణ శక్తిని కొనియాడాడు. షేఖ్ దుర్బోధల వల్ల - ముల్లా అలీ ధర్మవిరోధిగా ప్రకటింపబడి తక్షణమే సభనుండి వెలివేయబడ్డాడు; న్యాయవిచారణకు గురై, ఇస్తాన్‌బుల్‌కు పంపబడి, వెట్టిచాకిరీకి గురిచేయబడ్డాడు.

179. గోధుమలను, బార్లీని జల్లించు నాతడొక్కడు ¶166

ఇస్ఫహాన్ నగరంలో బాబీ ధర్మాన్ని స్వీకరించిన ప్రప్రథముడు ముల్లా మహమ్మద్ జాఫర్ గ్యాండమ్-పాక్-కున్ కు ఇది వర్తిస్తుంది. అతడు పారశీక బయాన్‌లో ప్రస్తావితుడై, “శిష్యత్వ వస్త్రభూషితు” డని ప్రశంసింపబడ్డాడు. ఈ “గోధుమలు జల్లించువా” డు దైవసందేశాన్ని నిస్సంకోచంగా సమ్మతించడాన్ని,  ఈ నవీన దివ్యావిష్కరణను  ఉత్సాహంగా సమర్థించడాన్ని ది డాన్ బ్రేకర్స్ లో నబీల్ వర్ణించాడు. ఇతడు షేఖ్ తబర్సి దుర్గరక్షకులతో కలిసి, ఆ కోట ముట్టడిలో మరణించాడు.

180. “ప్రవక్త” యను పదము ఈ పరమోన్నత ప్రకటన నుండి మిమ్ము నిరోధించునేమో . . . జాగరూకులు కండు ¶167
పవిత్ర గ్రంథములపై వారి వ్యాఖ్యానములు, భగవంతుని దివ్యావతారమూర్తిని గుర్తించడానికి అవరోధం కానివ్వకూడదని “అంతర్దృష్టి” గల ప్రజలను బహాఉల్లా హెచ్చరించాడు. ప్రతి మతానుయాయులు, దాని సంస్థాపకుని ఎడ తమ భక్తిని వెల్లడించి ఆయన దివ్యావిష్కరణనే భగవంతుని తుది ప్రవచనంగా భావించి, తదనంతర ప్రవక్త సాక్షాత్కార సంభావ్యతను విస్మరించడానికి పూనుకొన్నారు. యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాల విషయంలో అలాగే జరిగింది. గడచిన యుగధర్మాల విషయంలో గానీ, తన స్వీయధర్మావిష్కరణ విషయంలో గానీ, ఇదే చివరి దివ్యావిష్కరణమన్న భావనలను బహాఉల్లా నిరసించాడు. ముస్లింలకు సంబంధించి, “ప్రవక్తల అధీకృత ముద్ర అను పదములు . . . ఖురాన్ జనుల నేత్రములను కప్పి వేశా” యని, “వారి అవగాహనను మఱుగుపరచి, ఆయన ఔదార్యాలను కోల్పోయేలా” చేశాయని ఆయన కితాబ్-ఎ-ఇఖాన్ గ్రంథంలో వ్రాశాడు. “ఈ సిద్ధాంతము . . . సకల మానవజాతికి దుఃఖపూరితమగు పరీక్ష” అని ధృవీకరించి, “ఈ పదములను పట్టుకు వ్రేలాడుతూ, తమ నిజమైన ఆవిష్కర్తను విశ్వసించని వారి” దురదృష్టానికి పరితపించాడు. బాబ్‌కూడా ఈ సిద్ధాంతాన్ని సూచిస్తూ “నామధేయముల కధినాథుడగు ఆయన నుండి నామములు మిమ్ములను మఱుగు పరచనీయవలదు, ప్రవక్త నామధేయము సహితము ఆయన వాణి నుండి యుద్భవించినదే తప్ప వేరొకటి కాద”ని హెచ్చరించాడు.

181. భగవంతుని సార్వభౌమత్వమున కధీకృత ప్రతినిధి యగు ఆయన నుండి “ప్రాతినిధ్య” పరమైనదేదైనను ¶167

“ప్రాతినిధ్యము” గా ఇక్కడ అనువదింపబడిన పదం అరబ్బీ మూలంలో“విలాయత్‌”గా వ్యవహరింప బడుతున్నది. దీనికి “ప్రతినిధిత్వము”, “సంరక్షణత్వము”, “రక్షణత్వము”, “వారసత్వము” అనే నానార్థాలున్నాయి. భగవంతునికి, ఆయన దివ్యావతారానికి లేదా దివ్యావతారముచే నియమింప      బడిన ఉత్తరాధికారులకు మధ్య గల సంబంధాన్ని సూచించేందుకై ఇది ఉపయోగింప బడుతున్నది. అటువంటి భావనలు మానవులను ఈ నవీనదివ్యావతార “సార్వభౌమత్వా”నికీ, నిజమైన “దైవప్రతినిధి”కీ అంధులను కానీయరాదని బహాఉల్లా ఈ అఖ్దస్ ప్రవచనంలో హెచ్చరించాడు.

182. కరీమ్‌ను స్ఫురణకు దెచ్చికొనుడు ¶170

హాజీ మీర్జా మహమ్మద్ ఖాన్-ఇ-కిర్మానీ (1810-1873 ప్రాంతాలు), షేఖ్ అహ్మద్-ఇ-అహ్సాయి వారసునిగా నియమితుడైన సయ్యద్ ఖాసిం మరణాంతరం తనను తానే నియమించుకొన్న షేఖీ నాయకుడు. (చూ. వివరణలు 171, 172). షేఖ్ అహ్మద్ బోధనల పురోగతికి తనను తాను అంకితం చేసుకొన్నాడు. హితులకు, విమతులకు సహితం అతని అభిప్రాయాలు వివాదస్పదాలయ్యాయి. 

 సమకాలీన పండితాగ్రగణ్యుడిగా, రచయితగా గుర్తింపును పొందిన ఈ వ్యక్తి  ఆనాటి వివిధ విజ్ఞానరంగాలకు సంబంధించి అనేక గ్రంథాలను, సందేశాలను రచించాడు. బాబ్, బహాఉల్లా లిరువురినీ తీవ్రంగా వ్యతిరేకించాడు. బాబ్‌నూ, ఆయన బోధనలనూ విమర్శించడానికై  తన గ్రంథాలను ప్రయోగించాడు. అయితే, బహాఉల్లా అతని రచనలలోని అంశాలను, వైఖరిని గర్హించి, బాబ్‌కు విరుద్ధదృష్టాంతాలను కలిగియున్న అతని పుస్తకాలలో ఒకదానిని కితాబ్-ఇ-ఇఖాన్ లో ప్రస్తావించాడు. షోఘి ఎఫెండి అతనిని “దురాశాపరునిగా, వంచకునిగా” అభివర్ణించి, “షా చేసిన ప్రత్యేక విజ్ఞాపనతో అతను తన గ్రంథములలో ఒకదానిలో ఈ నవీన దివ్యధర్మం మీదను, దీని సిద్ధాంతాలమీదను ఎంత దారుణంగా విరుచుకుపడ్డాడో” కూడా వర్ణించాడు.

183. ఓ బహా పండితులారా! ¶173

బహాఉల్లా తన అనుయాయులలో గల విద్వాంసులను ప్రస్తుతించాడు. ఆయన తన ఒడంబడిక గ్రంథములో ఇలా వ్రాశాడు: “బహా జనుల యందలి పాలకులు, పండితులు ధన్యులు.” ఈ ప్రకటన గురించి షోఘి ఎఫెండి యిలా వ్రాశాడు:

ఈ పవిత్ర యుగంలో “పండితు”లు ఒక విధముగా దివ్యధర్మహస్తములు, మరియొక విధముగ ఆయన బోధనలను ప్రబోధించువారు, విస్తరింప చేయువారు; దివ్యధర్మహస్తముల శ్రేణికి చెందకపోయినా, బోధనారంగమున విశిష్టస్థాయి నొందినవారు. ఇక “పాలకు”లనగా - స్థానిక, జాతీయ, అంతర్జాతీయ న్యాయమందిరముల సభ్యులకు సంకేతం. వీరిలో ప్రతియొక్కరి విధులు భవిష్యత్తులో నిర్థారించబడతాయి.

 దివ్యధర్మహస్తములు బహాఉల్లాచే నియమితులై, అనేక విధులు - విశేషించి ఆయన దివ్యధర్మ రక్షణ, విస్తరణ బాధ్యతలు - అప్పగించబడిన వ్యక్తులు. మెమోరియల్స్ ఆఫ్ ది ఫెయిత్‌ఫుల్ అనే గ్రంథంలో అబ్దుల్-బహా -- కొందరు విశిష్టవిశ్వాసులను దివ్యధర్మహస్తములుగా సూచించి, తన వీలునామా, మరణ శాసనంలో దివ్యధర్మ సంరక్షకునికి పిలుపునిస్తూ, ఆయన తన వివేచన ప్రకారం దివ్యధర్మహస్తములను నియమించే ఏర్పాటును కల్పించాడు. షోఘి ఎఫెండి తొలుత కీర్తిశేషులైన ఎందరో విశ్వాసులను ఈ స్థాయికి సముద్ధరించాడు. ఆ తర్వాతి సంవత్సరాలలో, 32 మంది విశ్వాసులను ఈ స్థాయిలో అన్ని ఖండాలలోను నియమించాడు. షోఘి ఎఫెండి మృతికి (1957) విశ్వన్యాయమందిరం ఎన్నిక (1963) కు మధ్యకాలంలో, దివ్యధర్మహస్తములే దివ్యధర్మపు వ్యవహారాలకు మార్గదర్శకత్వాన్ని వహించి శైశవావస్థలో ఉన్న బహాఉల్లా ప్రపంచకూటమికి ప్రధానరక్షకులుగా వ్యవహరించారు. (చూ. వివరణ 67). విశ్వన్యాయమందిరం 1964 నవంబరులో దివ్యధర్మ హస్తముల నియామకాలకు వీలును కల్పించే శాసనాన్ని తాను చేయలేదని నిర్థారించింది. అయితే, అందుకు బదులుగా అది -- 1968లో సలహాదారుల ఖండాంతరమండళ్ల నియామకం ద్వారాను, 1973లో పవిత్రభూమిలో ప్రధానాసనం ఉండేలా అంతర్జాతీయ బోధనా కేంద్రాన్ని నెలకొల్పడం ద్వారాను - దివ్యధర్మహస్తముల ప్రధాన విధులైన ధర్మరక్షణ, విస్తరణలు -  భవిష్యత్తులో కూడా కొనసాగేలా నిర్ణయించింది. 

విశ్వన్యాయమందిరము అంతర్జాతీయ బోధనా కేంద్ర సలహాదారుల సభ్యులను, ఖండాంతరమండళ్ల సలహాదారులను నియమిస్తుంది. ఖండాంతర మండలి సలహాదారులచే సహాయక మండలి సభ్యులు, నియమించ బడతారు. షోఘి ఎఫెండి ఇచ్చిన పై వివరణలోని “పండిత” వర్గంలోకి వీరంతా వస్తారు.

184. దివ్యగ్రంథము నందేదైనను మీకవగతము కానిచో, ఈ మహావృక్షము నుండి యావిర్భవించిన శాఖ యగు ఆయనకు నివేదింపుడు. ¶174

బహాఉల్లా తన పవిత్ర ప్రవచనాలను వ్యాఖ్యానించే అధికారాన్ని అబ్దుల్-బహాకు ప్రసాదించాడు (చూ. వివరణ 145 ).

185. సర్వోత్కృష్ట ఏకత్వ సాంప్రదాయము ¶175

తాను బయాన్ వాగ్దత్త పురుషుడనని గావించిన ప్రకటనను బాబీలలో కొందరు ఖండించడానికి గల కారణాన్ని ఈ దివ్యప్రవచనంలోను, దీని తరువాయి ప్రవచనాల లోను బహాఉల్లా ప్రతిఘటించాడు. “భగవంతునిచే ప్రత్యక్షీకరింపజేయబడు నాతని”ని ఉద్దేశించి బాబ్ వెలువరించిన దివ్యఫలకం ఆధారంగా వారు తమ ఖండనను గావించారు. ఈ దివ్యఫలకానికి వెనుకవైపున బాబ్ : “భగవంతునిచే ప్రత్యక్షీకరింపజేయబడు నాతనిదృక్కులు ఈ లేఖను ప్రాథమిక దశలోనే శోభిల్లజేయు గాక” అని వ్రాశాడు. బాబ్ పవిత్ర రచనల సంకలనము లో ఈ ఫలకం ప్రచురితమైంది. 

 బహాఉల్లా బాబ్ కన్న వయస్సులో రెండు సంవత్సరాలు పెద్ద కనుక ఆయనకు “ప్రాథమిక దశలోనే” ఈ దివ్యఫలకాన్ని అందుకోవడం సాధ్యం కాదని ఆ బాబీలు వాదించారు. 

 అయితే, ఈ ప్రస్తావనఈ జీవనతలానికి అతీతంగా ఆధ్యాత్మిక ప్రపంచాలలో సంఘటిల్లే ఘటనలకు వర్తిస్తుందని బహాఉల్లా ఇక్కడ వివరించాడు.

186. ఆయన మాకు సమర్పించిన . . . దివ్యప్రవచనములను స్వీకరించితిమి ¶175

“భగవంతునిచే ప్రత్యక్షీకరింపజేయబడు నాతని” ని ఉద్దేశిస్తూ తాను వెలువరించిన దివ్యఫలకములో బయాన్ ను బహాఉల్లాకు తన సమర్పణగా పేర్కొన్నాడు బాబ్. చూ. బాబ్ పవిత్ర రచనల సంకలనము.

187. ఓ బయాన్ జనులారా! ¶176

ఇది బాబ్ అనుయాయులకు అన్వయిస్తుంది.

188. అ మరియు గు అక్షరములను జతగూర్పకమునుపే ¶177

షోఘి ఎఫెండి తన తరఫున వ్రాయబడిన లేఖలలో “అ మరియు గు అక్షరముల” ప్రాధాన్యతను వివరించాడు. ఈ అక్షరాలు “తన ఆదేశమున సమస్తమును ఉనికి లోనికి తీసుకురాగల భగవంతుని సృజనాత్మక శక్తి”, భగవంతుని దివ్యావతారమూర్తి శక్తి, ఆయన పరమాధ్యాత్మిక సృజనశక్తి” తో కూడిన “అగు” అనే పదంగా ఏర్పడతాయి. 

ఆజ్ఞాపూరితమైన “అగు” అరబ్బీ మూలంలో “కాఫ్‌”, “నూన్‌” అనే రెండు అక్షరాలతో కూడిన “కున్‌” అనే పదం (ఆంగ్లంలో ఇది “Be”). షోఘి ఎఫెండి వాటిని పై విధంగా అనువదించాడు. సృష్టిని ఉనికిలోకి తీసుకురావడానికి భగవంతుడు ఉపయోగించిన ఆజ్ఞగా ఈ పదం ఖురాన్‌లో ప్రయోగించబడినది.

189. ఈ దివ్యప్రపంచ సంవిధానము ¶181

పారశీక బయాన్‌లో బాబ్ యిలా వివరించాడు: “బహాఉల్లా సంవిధానముపై దృష్టిని సారించి, తన దైవమునకు ధన్యవాదముల నర్పించునాతడు ధన్యుడు. ఆయన తప్పక ప్రత్యక్షీకరింపచేయబడును కనుక భగవంతుడు నిక్కముగ, నిర్ద్వంద్వముగ దీనిని బయాన్ నందు నిర్దేశించినాడు.” షోఘి ఎఫెండి ఈ “సంవిధానము” ను, అ అఖ్దస్ గ్రంథంలో బహాఉల్లా వెల్లడించిన విధానంతో పోల్చాడు. మానవజీవితంపై ఆ సంవిధానపు విప్లవాత్మక ప్రభావాన్ని, దాని వ్యవహారశైలిని నియంత్రించే శాసన నియమాలను ఈ గ్రంథంలో సహేతుకంగా వివరించాడు బహాఉల్లా .  

 “నూతన ప్రపంచ సంవిధాన” లక్షణాలు బహాఉల్లా, అబ్దుల్-బహాల రచనలలోను, షోఘి ఎఫెండి, విశ్వన్యాయమందిరముల లేఖలలోను వర్ణించబడ్డాయి. వర్తమాన బహాయి పరిపాలనావిధానానికి సంబంధించిన వ్యవస్థలు బహాఉల్లా భావి ప్రపంచ సంవిధానానికి “నిర్మాణ ప్రాతిపదిక”లై, వృద్ధి చెంది, బహాయి ప్రపంచ కూటమిగా పరిణితి చెందుతాయి. షోఘి ఎఫెండి ఈ అంశాన్ని నిర్ధారిస్తూ, పరిపాలనా సంవిధానం “దాని ప్రధాన భాగాలు, వివిధాంగాలు పటిష్టంగా, శక్తివంతంగా విధుల నిర్వహణను ఆరంభించే కొద్దీ, నూతన ప్రపంచ సంవిధానానికి కేంద్రకంగానే గాక, సమయమాసన్నమైనప్పుడు సమస్త మానవాళికి అనువర్తితమయ్యే ఆదర్శ సంవిధానంగా తన అధికారాన్ని సుస్థిరపరచుకుంటుం”దన్నాడు.

 ఈ నూతన ప్రపంచ సంవిధాన పరిణామం గురించిన అదనపు సమాచారానికై, ఉదాహరణకు, ది వరల్డ్ ఆర్డర్ ఆఫ్ బహాఉల్లా లో ప్రచురితమైన షోఘి ఎఫెండి లేఖలను చూడవచ్చు.

190. ఓ దుస్స్వభావమూలమా! ¶184

సుభ్-ఎ-అజల్ (అనంతప్రభాతం) గా వ్యవహరింపబడినవాడూ, బహాఉల్లాకు, ఆయన దివ్యధర్మానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తినవాడూ అయిన - ఆయన సవతి తమ్ముడు మీర్జా యాహ్యాకు ఇది అన్వయిస్తుంది. వాగ్దత్త పురుషుని ఆగమనం ఏ సమయంలోనైనా సంభవించవచ్చునని ఎదురు చూస్తున్న బాబీ సమాజానికి నాయకునిగా మీర్జా యాహ్యాను బాబ్ నియమించాడు. సయ్యద్ మహమ్మద్ -ఎ -ఇస్ఫహాని (చూ. వివరణ 192) ప్రేరణతో బాబ్ పట్ల అవిశ్వాసంగా వ్యవహరించి, ఆయనకు వారసుడిగా చెప్పుకుని, బహాఉల్లాకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని, చివరికి ఆయనపై హత్యాప్రయత్నాలు కూడా చేశాడు మీర్జా యాహ్యా. అడ్రియానోపుల్‌లో బహాఉల్లా తన దివ్యకార్యక్ర మాన్ని గురించి మీర్జా యాహ్యాకు వెల్లడించినపుడు అతను ప్రతిగా ఏ స్థాయికి వెళ్ళాడంటే: తనకు కూడా ఒక స్వతంత్రమతానికి సంబంధించిన సందేశం అందిందని ప్రకటించుకున్నాడు. అజలీలుగా వ్యవహరింపబడిన కొందరు తప్ప, చివరికి అందరూ అతని అతిశయోక్తులను త్రోసిపుచ్చారు (చూ. వివరణ 177) షోఘి ఎఫెండి అతనిని “బాబ్ ఒడంబడికను తీవ్రంగా ఉల్లంఘించినవా”డని అభివర్ణించాడు (చూ. గాడ్ పాసెస్ బై , 10వ అధ్యాయము ).

191. దివ్యధర్మసేవకై మేము అహర్నిశలు నిన్ను పోషించిన విషయమును, పరమాత్ముని మృదుకారుణ్యమును స్ఫురణకు దెచ్చికొనుము. ¶184

మీర్జా యాహ్యా కన్నా పదమూడేళ్లు పెద్దవాడైన బహాఉల్లా, కిశోరప్రాయంలోనూ, పెద్దయ్యాక కూడా అతని మంచిచెడ్డలు చూసి, సంరక్షించాడన్న వాస్తవాన్ని షోఘి ఎఫెండి గాడ్ పాసెస్ బై లో వివరించాడు.

192. నిన్ను పెడదారి పట్టించిన వానిపై దేవుడు నియంత్రణను కలిగి యుండుట ¶184

 “బహాయి దివ్యాష్కరణానికి సైతాను” వంటి వాడని షోఘి ఎఫెండిచే వర్ణించబడిన, సయ్యద్ మహమ్మద్-ఇ-ఇస్ఫహానికి ఇది అన్వయిస్తుంది. అతను దుస్స్వభావి, దురాశాపరుడు. బహాఉల్లాను వ్యతిరేకించి, ప్రవక్తృత్వాన్ని చేపట్టవలసిందిగా మీర్జా యాహ్యాను ప్రేరేపించినవాడు అతనే (చూ. వివరణ 190). మీర్జా యాహ్యా పక్షీయుడే అయినా, బహాఉల్లాతోపాటుగా అక్కా కు బహిష్కరించబడ్డాడతను. బహాఉల్లాకు వ్యతిరేకంగా ఆందోళనలు లేవదీయడం, కుట్రలు పన్నడంలాంటివి కొనసాగించాడు. అతని మరణపరిస్థితులను, గాడ్ పాసెస్ బై లో షోఘీ ఎఫెండి వర్ణించాడు :

బహాఉల్లా జీవితానికి మరొక సరిక్రొత్త విపత్తు ఏర్పడినట్లు స్పష్టంగా తెలియ వచ్చింది. తమను హింసించే వారికి వ్యతిరేకంగా ప్రతీకారచర్యలను చేపట్టవద్దని తన ఆనుయాయులను ఎన్నో సందర్భాలలో మౌఖికంగాను, లిఖితపూర్వకం గాను గట్టిగా నిషేధించాడాయన. తన ప్రియతమ నేతకు జరిగిన అన్యాయాలకు ప్రతీకారంచేయడానికి యోచించినవాడూ, బాధ్యతారహితుడూ, పూర్వాశ్రమంలో అరబ్బు అయిఉన్న ఒక విశ్వాసిని ఆయన బీరూట్‌కు త్రిప్పిపంపివేశాడు; అయినా, ఆయన సహచరులలో ఏడుగురు రహస్యంగా బైటికి వెళ్లిపోయి, తమను బాధలకు గురిచేస్తున్నవారిలో ముగ్గురిని - సయ్యద్ మహమ్మద్, అఖా జాన్ లతో సహా - హతమార్చారు.

అంతకుముందు నుంచే అణచివేతకు గురౌతూవస్తున్న సమాజానికి కలిగిన భీతి వర్ణనాతీతం. బహాఉల్లా ఆగ్రహానికి అంతులేదు. ఈ సంఘటన జరిగిన కొద్దికాలానికే వెలువరించిన ఒక దివ్యఫలకములో తన ఆవేశాన్ని ఇలా వ్యక్తం చేశాడాయన : “మేము మాకు సంభవించిన దానిని ప్రస్తావించినచో, స్వర్గములు చీలి బీటలు వారును, పర్వతములు నేలకూలును.” మరో సందర్భంలో ఆయన యిలా వ్రాశాడు: “నా కారావాసము నాకు హాని చేయజాలదు. నాకు హాని చేయునది - నన్ను ప్రేమించుచు, నా వారమని చెప్పుకొనుచు, నా హృదయమును, నా లేఖినిని ఆక్రోశింపచేయు వారి ప్రవర్తయే.”

193. యొక భాషను . . . ఒక సామాన్యలిపిని ఎంచుకొనుడు. ¶189

ఒకే విశ్వభాషను, లిపిని అవలంబింపుడని బహాఉల్లా నిర్దేశించాడు. ఆయన పవిత్ర రచనలు ఈ ప్రక్రియకు సంబంధించి రెండు దశలను వెల్లడిస్తాయి. తొలి దశలో ప్రస్తుతం ఉన్న భాషలలో నుండి గాని, నూతనంగా కల్పన చేసి గాని ఒక దానిని ఎంపిక చేసుకోవడం, ఆ పై అది ప్రపంచంలోని పాఠశాలలు అన్నింటిలోనూ మాతృభాషకు, సహాయభాషగా బోధించబడటంగా ఉంటుంది. తమ చట్టసభల ద్వారా ఈ అత్యావశ్యక శాసనాన్ని చేయవలసిందిగా ప్రపంచంలోని ప్రభుత్వాలు కోరబడాలి. పర్యవసానంగా రెండవ దశలో, దూరభవిష్యత్తులో, భూమిపై వసించే వారందరూ ఒకే సామాన్య భాషను, సార్వత్రిక లిపిని అలవరచుకోవడం జరుగుతుంది.

194. మానవజాతి యుగాగమనమునకు మేము రెండు సంకేతములను ఏర్పరచినాము. ¶189

బహాఉల్లా పవిత్ర రచనలలో సూచితమైన మానవజాతి యుగాగమనానికి ప్రథమ సంకేతం : మూలధాతువులను సమూలంగా పరివర్తింపచేసేదీ, మౌలికవిధానంతో కూడి “దైవిక తత్త్వ్వజ్ఞానం” గా వర్ణితమయ్యేదీ అయిన విజ్ఞానం ఆవిర్భవించడం. భవిష్యత్తులో చోటుచేసుకోనున్న మహత్తర విజ్ఞానవికాస శోభకు యిదొక సంకేతం.

కితాబ్-ఎ-అఖ్దస్ లో బహాఉల్లా సూచించిన “రెండవ” సంకేతానికి సంబంధించి షోఘి ఎఫెండి యిలా వివరించాడు: “బహాఉల్లా ... తన పరమ పవిత్ర గ్రంథములో - భూమిపై నుండువారందరూ తమ ఉపయోగానికై ఒకే భాషను ఎంపిక చేసుకుని, సార్వత్రిక లిపిని అవలంబించాలని సూచించాడు; నెరవేర్పబడినప్పుడు, అది - తానే స్వయంగా ఆ దివ్యగ్రంథములో నుడివినట్లుగా, ‘మానవజాతి యుగాగమన’ సంకేతాలలో ఒకటౌతుందని వివరించాడు.” 

మానవజాతి యుగాగమన ప్రక్రియ ఆంతర్యం గురించి, పరిణితి దిశగా దాని ప్రస్థానం గురించి మరికొంత సమాచారాన్ని బహాఉల్లా ఇచ్చిన ఈ దిగువ వివరణ అందిస్తుంది :

ప్రపంచ పరిణితి కొక సంకేతము : రాజరికపుభారమును భరియించుట కెవ్వడును సమ్మతింపడు. తన భారమును వహియించుట కెవ్వరును సహియింపనట్టిదిగ రాజరికము మిగిలిపోవును. మానవజాతియందున వివే సాక్షాత్కారము జరుగునది ఆ దినముననే.

సమస్త మానవజాతి సమైక్యతతో, ప్రపంచకూటమి సంస్థాపనతో, సమస్త మానవ జాతియొక్క వివేక, నైతిక ఆధ్యాత్మిక జీవితాలకు ఆపూర్వమైన ఉత్తేజం కలగడంతో మానవజాతి యుగాగమనం ముడివడిఉందని షోఘి ఎఫెండి వెల్లడించాడు.

